Wednesday, 23 November 2011

టీటీడీకి పెద్ద షాక్:రూ.20 కోట్లిస్తే నీళ్లిస్తాం

తిరుమలలో ఏర్పడిన నీటి ఇబ్బందులను అధిగమించడానికి టీటీడీ కసరత్తు చేస్తోంది. తిరుపతి కార్పొరేషన్ సహాయంతో రోజుకు 10 లక్షల గ్యాలన్ల నీటిని కొండకు తరలించే ఆలోచన చేసిన టీటీడీకి అక్కడి నుంచి పెద్ద షాక్ తగిలింది. రూ.20 కోట్లిస్తే నీళ్లిస్తాం అనే షరతు ఎదురు కావడంతో దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు.తిరుమలకు వచ్చే యాత్రికులు, సిబ్బంది, స్థానికుల అవసరాల కోసం రోజుకు 28 నుంచి 30 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతోంది. తిరుమలలోని కుమారధార-పసుపుధార, పాపవినాశనం, గోగర్భం జలాశయాలతో పాటు శ్రీవారి మెట్టు సమీపంలోని కల్యాణి డ్యాంలో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్న సమయంలో యాత్రికుల అవసరం మేరకు టీటీడీ నీటిని అందిస్తోంది. కొంత కాలంగా వర్షాలు ముఖం చాటేయడంతో తిరుమల, కల్యాణి జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొండ మీద నీటి తిప్పలు తప్పవనే అంచనాతో టీటీడీ అధికారులు నీటి పొదుపునకు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం అన్ని మార్గాల్లో రోజుకు 16 నుంచి 17 లక్షల గ్యాలన్ల నీటిని మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కైలాసగిరి రిజర్వాయర్, తిరుపతి కార్పొరేషన్ నుంచి రోజుకు 10 లక్షల గ్యాలన్ల నీటిని తిరుమలకు తీసుకెళ్లేందుకు టీటీడీ ఆలోచించింది. అలిపిరి మార్గంలో ఉన్న పైప్‌లైన్ల ద్వారా తమ సంప్‌లకు నీటిని అందిస్తే రివర్స్ పంపింగ్‌తో తాము తిరుమలకు తీసుకెళతామని ప్రతిపాదించింది.మంచి తరుణం మించిన దొరకదనుకున్న కార్పొరేషన్ అధికారులు కైలాసగిరి రిజర్వాయర్ నుంచి రోజూ అదనంగా 10 లక్షల గ్యాలన్ల నీటిని పంపింగ్ చేసి అందించడానికి అవరమైన మరమ్మతులు, పైప్‌లైన్ పనుల కోసం రూ.20 కోట్లు అందచేయాలని టీటీడీకి టెండర్ పెట్టారని తెలిసింది. తాము తిరుమలకు నీరివ్వాలని అడిగితే తిరుపతి నీటి ఎద్దడి మొత్తం తీర్చేందుకు అవసరమయ్యే సొమ్ము కార్పొరేషన్ అధికారులు అడుగుతున్నారంటూ దేవస్థానం ఉన్నతాధికారులు ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను విరమించుకున్నట్టు సమాచారం. అయితే తిరుపతి వాసుల దాహార్తి తీర్చాల్సిన బాధ్యత టీటీడీ మీద కూడా ఉందంటూ కార్పొరేషన్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఈ సొమ్ము రాబట్టుకునే యోచనలో ఉన్నారు. సీఎం సమక్షంలో ఇటీవల జరుపతలపెట్టిన తిరుపతి టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ఈ కోరికను వెల్లడించాలని భావించారు. ఈ సమావేశం రద్దు కావడంతో ఇతర మార్గాల్లో ప్రభుత్వానికి తమ విన్నపాన్ని వినిపించాలనే ఆలోచన చేస్తున్నారు. కొండకు నీళ్లడిగితే కార్పొరేషన్‌కు కోట్ల రూపాయలు ఎదురివ్వాల్సి వస్తుందనే భయంతో టీటీడీ అధికారులు తిరుమలలో నీటి పొదుపునకు శ్రీకారం చుట్టారు

No comments:

Post a Comment