Monday, 13 February 2012

శ్రీశైలంలో మహాశివరా త్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీశైల మహాపుణ్య క్షేత్రంలో సోమవారం నుంచి మహాశివరా త్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కా నున్నాయి. 11 రోజులపాటు వైభవంగా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులు, శివస్వాములకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు, వివిధ వాహనసేవలు నిర్వహిస్తారు. ప్రధానంగా మహాశివరాత్రి పర్వదినం రోజున లింగోద్భవ సమయాన స్వామివారికి మహారుద్రాభిషేకం జరుగుతుంది.అనంతరం పాగాలంకరణ, కల్యాణ మహోత్సవం జరుగుతుంది. మొదటిరోజు సోమవారం ఉదయం వేదపండితులు యాగశాలలో గణపతిపూజ, పుణ్యాహవాచనం, శివసంకల్పం, చండీశ్వరపూజ, రుత్విగ్వరణం చేస్తారు. అనంతరం అఖండస్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం, పంచావరణార్చన, మండపారాధన, రుద్రకలశ స్థాప న జరుగుతుంది. సాయంత్రం అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠాపన, రాత్రి త్రిశూల పూజ, ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ, బలిహరణలు చేపడతారు. కాగా రహదారులు సరిగా లేక కంకరతేలి ఉండటంతో శ్రీశైల క్షేత్రానికి పాదయాత్రగా వచ్చే భక్తులకు ముఖ్యంగా శివమాల ధరించిన భక్తులు తీవ్రఇక్కట్లకు గురవుతున్నారు. శివదీక్షా శిబిరాల వద్ద శివస్వాములకు ఉచిత వసతి ఏర్పాట్లతోపాటు విద్యుత్ సౌకర్యం, మంచి నీరు ఏర్పాటు చేసి, జ్యోతిర్ముడిని సమర్పించుకోవడానికి అనువుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్ని క్యూలతో పాటు ఆలయ ప్రాంగణం లోపల, ప్రధానాలయ గోపురం నుంచి ముఖ ద్వారం వరకు విద్యుద్ధీకరణ పనులు పూర్తయ్యాయి. సాక్షి గణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం, కైలాస ద్వారం తదితర ప్రదేశాలకు మొబైల్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడానికి రంగం సిద్ధం చేశారు. శాశ్వత ప్రాతిపదికన నిర్మించిన మరుగుదొడ్లలో చేయాల్సిన పనులు పూర్తికాగా, వివిధ ప్రదేశాలలో తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణాలు మరో రెండు, మూడు రోజుల్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది. పాతాళగంగ మెట్ల మార్గంలో విద్యుద్ధీకరణ, మంచి నీటి కొళాయిల ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాతాళగంగలో గజ ఈతగాళ్లను నియమించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నిర్ణీత ప్రదేశాలలో పార్కింగ్ చేయడానికి అనువుగా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

.మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి పది రోజులు అసెంబ్లీకి సెలవు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై పోరు కొనసాగించాలనే రాష్ట్ర ఆరోగ్య మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలకు పది రోజుల పాటు హాజరు కాలేనని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు, శాసన మండలి చైర్మన్ చక్రమానికి లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా పంపించారు. అనారోగ్యం కారణంగా తాను సమావేశాలకు హాజరు కాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. మూడు రోజుల క్రితం తనకు ఆటలమ్మ వ్యాధి సోకిందని, మరో పది రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని ఆయన ఆ లేఖలో చెప్పారు. దీంతో తాను ఈ నెల 23వ తేదీ వరకు సమావేశాలకు హాజరు కాలేనని చెబుతూ తన శాఖకు సంబంధించిన ప్రశ్నలను వాయిదా వేయాలని ఆయన కోరారు. తన శాఖను విడదీసి కొత్త మంత్రి కొండ్రు మురళికి కేటాయించడంతో ఆయన ముఖ్యమంత్రిపై తీవ్రంగా ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్ లపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. వారిద్దరూ కుమ్మక్కై అధిష్టానవర్గాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. విప్‌ ధిక్కరించిన 17 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకపోవడం సరికాదని వారు అంటున్నారు. ముఖ్యమంత్రి తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా సాగిన విచారణ ప్రక్రియ ఇటీవలే ముగిసిందని, తీర్పు కాపీలు కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ, తీర్పు వెలువరించకుండా ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. సీఎం చర్యలతో పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిందన్నారు. నిరాశ నిస్పృహలో కార్యకర్తలున్నారని వారు చెప్పారు. ఉపఎన్నికలొస్తే మళ్లీ గెలవమన్న ఆందోళనలో సీఎం ఉన్నారని, మాజీ మంత్రులు, మంత్రి మండలి సహచరులు, ఎంఎల్‌సీలు, ఎంఎల్‌ఏలు సీఎంపై గుర్రుగా ఉన్నారు.

యువరాజ్ త్వరగా కోలుకోవాలి...ధోనీ, గంభీర్

క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న యువరాజ్ త్వరగా కోలుకొని తిరిగి జట్టులోకి రావాలని ధోనీ, గంభీర్ ఆకాంక్షించారు. యువీ సవాళ్లను ఇష్టపడతాడని, అతను కాన్సర్‌ను జయించి మరింత దృఢంగా మారతాడని ధోనీ అడిలైడ్‌లో మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. యువీ త్వరగా కోలుకోవాలని జట్టంతా కోరుకొంటోందని గౌతీ చెప్పాడు. అతన్నెంతగానో మిస్సవుతున్నట్లు గంభీర్ తెలిపాడు.అంతక ముందు సోమవారం ఉదయం యువరాజ్ సింగ్ తండ్రి మాజీ టెస్ట్ క్రికెటర్ యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ తన కొడుకు అశ్రద్ద వల్లే చికిత్సలో జాప్యం జరిగిందన్నారు. రెండు సంవత్సరాల క్రితమే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరినట్టు యోగరాజ్ తెలిపారు. ఈ విషయంలో ఎవర్ని తాను నిందించడం లేదన్నారు. తన సలహాను పాటించినట్లయితే ప్రస్తుత పరిస్థితులు మరోలా ఉండేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం మొహాలీలో టీ20 మ్యాచ్‌లో భారత్‌కు యువరాజ్ విజయాన్ని అందించాడని ఆయన గుర్తు చేసుకున్నారు.ఆ మ్యాచ్‌లో యువరాజ్ సిక్స్ కొట్టిన తర్వాత సురేశ్ రైనా వైపుకు పరిగెత్తుకు వచ్చాడని.. ఆ సమయంలో చాలా దారుణంగా దగ్గుతో బాధపడిన విషయాన్ని ప్రస్తావించాడు. అప్పటి నుంచే యువరాజ్ ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టిందని యోగరాజ్ సింగ్ కన్నీళ్లతో విలపించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని.. యువరాజ్ అశ్రద్ద చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.ఇది ఇలా ఉంటే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న యువరాజ్‌సింగ్ ప్రైవసీకి భంగం కలుగకుండా చూడాలని మీడియాకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు విజ్ఞప్తి చేసింది. యువరాజ్ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఇది ఇలా ఉంటే భారత్‌‌కు ప్రపంచ కప్‌ని అందించడంలో తనదైన పాత్రను పోషించిన ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ యువరాజ్‌ సింగ్‌‌కు క్రీడల మంత్రి అజయ్ మాకెన్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా యువరాజ్ సింగ్ త్వరగా కోలుకోవడానికి ప్రభుత్వం తరుపున ఎటువంటి సహాకారాన్ని అందించేందుకు సిద్దంగా ఉన్నామని.. యువీ త్వరలోనే కోలుకుంటాడని అన్నారు

రాయలసీమలో ఎర్రచందనం దొంగల

రాయలసీమలో ఎర్రచందనం దొంగల కార్యకలాపాలు పెచ్చుమీరాయి. ప్రతిరోజూ ఏదో ఒక చోట ఎర్రచందనం దుంగలను తరలిస్తూ అటవీ అధికారులకు పట్టుబడుతుండడమే దీనికి నిదర్శనం. తక్కువ కాలంలో కోట్లకు పడగలెత్తేందుకు కొందరు ఎర్రచందనం అక్రమ రవాణాను ఎంచుకున్నారు. చిత్తూరు,కడప,  కర్నూలు, నెల్లూరు జిల్లా అటవీ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఎర్రబంగారం విస్తరించి ఉంది.ఒకప్పుడు మావోయిస్టులకు కేంద్రంగా మారిన ఈ అడవులు ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లకు నిల యమయ్యాయి.ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతం నుంచి ఎర్రచందనం దొంగలను అటవీ పోలీ సులు కాపుకాసి పట్టుకుంటున్నారు. రెండేళ్ల కాలంలో సీమ జిల్లాలతో పాటు నెల్లూరుతో కలిపి 900కు పైగా ఉంటారని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ అటవీ అధికారి స్పష్టం చేశారు. చిత్తూరు, కడప జిల్లాల పరిధిలోనే 600 మందికిపైగా అరెస్టు చేసినట్లు సమాచారం. అధికారుల దాడుల్లో పట్టుబడుతున్న వారిలో 90శాతం మంది కూలీలు, డ్రైవర్లే ఉన్నట్లు సమాచారం. కిలో ఎర్రచందనం దుంగను నరికి స్మగ్లర్ చేతికి ఇస్తే రూ.150 ఇస్తున్నారు. అలా వారానికి ఒకరు సుమారు రూ.2 నుంచి రూ.5వేలకు పైనే కూలి గిట్టుబాటు అవుతుండడంతో అటవీ సమీపంలోని గ్రామాల్లోని కొందరు దీన్నే వృత్తిగా పెట్టుకున్నారు. అలాంటి వారే అధికారులకు దొరుకుతున్నారు.పైరవీలతో తప్పించుకుంటున్న స్మగ్లర్లు ఇటీవల చిత్తూరు,కడప  జిల్లాల పరిధిలో పట్టుబడిన ఎర్రచందనం దొంగ ఒకరు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడికి, ఇద్దరు అధికారులకు కొంత మొత్తంలో నగదు ముట్టజెప్పి కేసు నుంచి తప్పించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సదరు వ్యక్తిపై రెండు జిల్లాల్లో 14 కేసులు ఉన్నట్లు అటవీ శాఖకు చెందిన ఓ అధికారి  వివరించారు.మరోవైపు తిరుపతిలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న టెంపోను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. సుమోలో మొత్తం 32 దిమ్మెలు ఉన్నాయని, వాటి విలువ నాలుగు లక్షల వరకు ఉంటుందని సిఐ నాగరాజ్ తెలిపారు. టెంపో డ్రైవర్ వామనాన్ని వదిలి పారిపోయాడు. వివిధ ప్రాంతాల్లో దాడులు ముమ్మరం చేసినా ఎర్రచందనానికి డిమాండ్ ఉండడంతో గుట్టు చప్పుడు కాకుండా స్మగ్లింగ్ జరుగుతోంది. అటవీశాఖలో కొందరు ఇంటి దొంగలు సహకరించడం వల్లనే విలువైన కలప తరలి వెళతున్నదని ఆరోపణలు ఉన్నాయి.వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, తనిఖీలు చేయిస్తున్నామన్నారు.

తిరుపతిలో మెడిసిన్ మాఫియా

తిరుపతిలో ఔషధాల అక్రమ విక్రయాలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. అడ్డదారిలో కోటీశ్వరులవుదామని భావిస్తున్న కొందరు ఔషధ వ్యాపారులు అకృత్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ అక్రమ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. గతంలో పని చేసిన ఔషధ నియంత్రణ అధికారులు ఇచ్చిన చనువుతో ఇక్కడ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా ఔషధ నియంత్రణ అధికారులు కొరడా ఝుళిపించడంతో ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. నగరంలో మందుల అక్రమ అమ్మకాలు సాగిస్తూ వారం తిరక్క ముందే రెండు ప్రాంతాల్లో పట్టుబడడం సంచలనం రేపుతోంది. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వాస్పత్రులకు ఇస్తున్న మందులను సైతం మెడికల్ దుకాణాల్లో, అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంకొందరు వివిధ కంపెనీలు తయారు చేసే శాంపిళ్లను సైతం మెడికల్ రెప్‌లతో కుమ్మక్కై భారీస్థాయిలో విక్రయిస్తున్నారు. నాలుగు రోజులకు ముందు బైరాగిపట్టెడలో ఒక దుకాణంలో ఈఎస్‌ఐ, ప్రభుత్వాస్పత్రుల మందులు విక్రయిస్తుం డగా అధికారులు పట్టుకున్నారు. తాజాగా  ఒక ఇంట్లో ఏకంగా శాంపిల్ మందులను అమ్ముతుండగా పట్టుకుని రూ.30 లక్షల మందులను స్వాధీనం చేసుకున్నారు.ఇలాంటి తనిఖీలను ముమ్మరం చేస్తాం. అక్రమ మెడికల్ స్థావరాలను గుర్తించి, కేసులు నమోదు చేస్తాం. ఔషధ నియంత్రణ శాఖ నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులను గుర్తించే పనిలోనే ఉన్నాం. పట్టుబడ్డ ఈఎస్‌ఐ, సర్కారు, శాంపిల్ మందులపై విచారణ సాగుతోంది. వీటిలో భాగస్వామ్యం ఉన్న వారిపై చర్యలు తప్పవు.

చేనేత కార్మికుల నేనున్నానంటూ భరోసా...జగన్‌మోహన్‌రెడ్డి

చేనే త కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పాలకులు పట్టించుకున్న పా పానపోలేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల కళ్లు తెరిపించడానికే తాను 48 గం టలపాటు నిరాహారదీక్ష చేపట్టినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నా రు.చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన దీక్షకు కార్మికులు పోటెత్తారు. వేలాదిగా నేతన్నలు దీక్షా శిబిరానికి తరలివచ్చారు. అనంతపురం నుండే కాక పొరుగున వున్న కర్నాటక నుండి కూడ భారీగా ఇక్కడకు చేరుకున్నారు.ఆత్మహత్యలు చేసుకున్న చేనేతల కుటుంబ సభ్యులు తమ సమస్యలను జగన్ వద్ద విన్నవించుకుంటున్నారు. వారి సాధకబాధకాలను అవగతం చేసుకున్న ఆత్మీయనేత చేనేతల కుటుంబాలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రెండోసారి ముఖ్యమం త్రి అయ్యాక చేనేతల రుణాల మాఫీ కోసం రూ.312కోట్లు మంజూరు చేశారన్నారు. చేనేతల కోసం బడ్జెట్‌లో కే టాయించిన రూ.312 కోట్లు నిధులు ఆయన మృతి చెందిన తరువాత కూ డా విడుదల చేయలేదన్నారు. రేపోమాపో బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయని ఈ తరుణంలో తాను చేపట్టనున్న దీక్ష కారణంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు అవుతుందన్నారు.వీటితోపాటు విద్యార్థుల ఫీజు రీ యింబర్స్‌మెంటు పట్ల కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. విద్యార్థులు, చేనేతల సమస్యలపైనే ప్రధాన అజెండాలుగా 48 గంటలపాటు నిరాహార దీక్షకు పూనుకున్నట్లు ఆయన వెల్లడించారు.