Tuesday, 18 October 2011

వైయస్ విజయమ్మను ఆయన మహాభారతంలోని గాంధారితో పోల్చారు

                                             
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి ఆస్తులపై హైకోర్టులో పిటిషన్ వేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. విజయమ్మపై ప్రశ్నల వర్షం కురిపించారు. వైయస్ విజయమ్మను ఆయన మహాభారతంలోని గాంధారితో పోల్చారు. దృతరాష్ట్రుడు, గాంధారి తమ పుత్రుడికి జ్ఞానోదయం కలిగించకుండా వ్యవహరించడం వల్ల కురువంశాన్నే పోగొట్టుకున్నారని, వైయస్ విజయమ్మ, వైయస్ రాజశేఖర రెడ్డి పరిస్థితి కూడా అదేనని ఆయన అన్నారు. విజయమ్మ చేసిన ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రతి ఆరోపణపై తీర్పు ఇప్పటికే వెలువడిందని ఆయన అన్నారు. అబద్ధాలను అల్లడంలో కూడా వైయస్ విజయమ్మ విఫలమయ్యారని ఆయన అన్నారు. సింగపూర్‌లో హోటల్ ఉందంటూ జతచేసిన ఫొటో ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేశారని, అదే ఫొటోను తాను కూడా డౌన్ లోడ్ చేశానని, ఆ హోటల్ కట్టినప్పుడు చంద్రబాబు రాజకీయాల్లోకి కూడా రాలేదని ఆయన అన్నారు.

ఆరేళ్లు వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నారని, ఆ ఆరేళ్లు చర్యలు తీసుకోకుండా ఏం చేశారని ఆయన అన్నారు. ఆరేళ్లు చర్యలు తీసుకోలేదంటే వైయస్సార్ చేతకానివాడైనా అయి ఉండాలి లేదా ఆరోపణలు అసత్యాలైనా ఉండాలని అంటూ ఈ రెండింటిలో ఏది నిజమో విజయమ్మ చెప్పగలరా అని ఆయన అడిగారు. చంద్రబాబు బినామీలుగా ఈనాడు రామోజీరావు, మురళీమోహన్, సుజనా చౌదరి, నామా నాగేశ్వరరావు పేర్లను చేర్చడాన్ని ఆయన తప్పు పట్టారు. చంద్రబాబు రాజకీయాల్లోకి రాక ముందే రామోజీ రావు ఈనాడు ఉన్నత స్థాయిలో ఉందని ఆయన చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జిఎంఆర్, జివికె, రిలయన్స్ లబ్ధి పొందాయని విజయమ్మ ఆరోపించడాన్ని ప్రస్తావిస్తూ ప్రయోజనాలు పొందినవారి పేర్లు చేర్చకుండా ప్రయోజనం పొందనివారి పేర్లను చేర్చారని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలో భూములు కొన్న విధంగానే వైయస్సార్ బంధువులు కూడా పెద్ద యెత్తున భూములు కొన్నారని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి రాక ముందే సుజనా చౌదరి, నామా నాగేశ్వర రావు వ్యాపారాలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు

ఈ నెల 21న తిరుపతి సీపీఐ 24గంటల నిరాహారదీక్ష

                                     
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఈ నెల 21న తిరుపతి, చిత్తూరుల్లో సీపీఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున 24గంటల నిరాహారదీక్ష జరుగుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి పి.హరినాథ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యుల సమా వేశం ఎస్.సయ్యద్ బాషా అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా హరినాథ రెడ్డి మాట్లాడుతూ,2 జీ కుంభకో ణాల్లో అవినీతికి పాల్పడిన యూపీఏ ప్రభుత్వ మంత్రులు ఊచలు లెక్కపెడుతున్నారని విమర్శించారు. అవినీతి సొమ్ముతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు.పేదలకు సెంటు భూమి ఇచ్చేందుకు నిబంధనలు చెప్పే ప్రభుత్వం జిందాల్ వంటి కంపె నీలకు వేలాది ఎకరాలు బంగారుపళ్ళెంలో పెట్టి ఇస్తున్నారని, వీరికి నిబంధనలు వర్తించవా? అని ప్రశ్నించారు.

2.50 లక్షల పోస్టులు భర్తీ చేయని ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడం ఉత్తుత్తి మాటలుగా వర్ణించారు. 21న తిరుపతిలో జరిగే 24గంటల నిరాహార దీక్షలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, చిత్తూ రు పట్టణంలో జరిగే దీక్షలో ప్రముఖ నాయకులు పాల్గొంటారని చెప్పారు

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమనిc కర్నూలు పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తెలిపారు. సోమవారం వెల్దుర్తిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. కోట్ల సమక్షంలో ఎఐటియుసి నాయకులు జయన్నాచారి, వాల్మీకి సంఘం నాయకులు మల్లికార్జున నాయుడు, వెంకటేశ్వరనాయుడు, టిడిపి నాయకులు చిన్న అనంతయ్య, మల్లికార్జునతో పాటు 200మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎంపీ కోట్ల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేస్తానని అన్నారు. గ్రామాల్లో ప్రజలు ఫ్యాక్షన్‌కు దూరంగా వుండాలని, ఫ్యాక్షన్ క్యాన్సర్ లాంటిదని చెప్పారు. ఇటీవల వెల్దుర్తి మండలంలో కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ పార్టీలో చేరారని, వారు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడం తగదని వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గల్లంతు అవుతుందని, కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రకటన చేయిస్తానని ఆయన చెప్పారు. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలంతోపాటు ఇళ్లు మంజూరు చేయిస్తామని అన్నారు. కర్నూలు పార్లమెంటు పరిధిలో తాగునీటి కోసం తన కోటా నుండి 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తానని వివరించారు. పార్టీలకు అతీతంగా పనులు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి చెరుకులపాడు నారాయణరెడ్డి, కాంగ్రెస్ నాయకులు విజయమోహన్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, తొగర్చెడు చంద్రారెడ్డి, ఆనంద్‌రెడ్డి, రమణారెడ్డి, వెంకటరామిరెడ్డి, మల్లికార్జునయ్య పాల్గొన్నారు

గురుకులాలకు నాంది పలికిన ఘనత నందమూరిదే

రాష్ట్రంలో దారిద్య్రం, పేదరికంతో వెనుకబడిన కులాల వారి సంక్షేమం కోసం గురుకులాల వ్యవస్థకు నాంది పలికిన ఘనత నందమూరి తారక రామారావుదేనని ఆర్డీటి విద్యాశాఖ డైరెక్టర్ తిప్పేస్వామి పేర్కొన్నారు. సోమవారం స్థానిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల కాళసముద్రంలో రాయలసీమ స్థాయి జోనల్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్బంగా తిప్పేస్వామి మాట్లాడుతూ రామారావ్ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం గురుకుల పాఠశాల వ్యవస్థను ప్రవేశపెట్టి లక్షలాది మందికి క్రమశిక్షణతో కూడిన ఉన్నత విద్యను అందించడానికి కృషి చేశారన్నారు. ఆయన కృషి ఫలితమే నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మందికి ఉపాధి, విద్యావకాశాలు పెరిగాయన్నారు. గెలుపు ఓటములు అనేవి పక్కన పెట్టి క్రీడా స్పూర్తితో వ్యవహరించి ముందుకెళ్లాలన్నారు. ప్రిన్సిపల్ గిరిజా కుమారి అద్యక్షతన జరిగిన సభలో ఎస్‌బిహెచ్ మేనేజర్ వాణిశ్రీ, బ్లూమూన్ సంస్థ అధినేత శివశంకర్, మైరాడా ప్రాజెక్టు అధినేత రమేష్, కణేకల్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శంకర్‌రెడ్డి, పట్నం ఎస్సై గంగాధర్‌రావ్, న్యాయవాది విజయ్‌కుమార్, పాఠశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీదేవి, సీనియర్ అధ్యాపకులు శ్రీనివాస్ చౌదరి, ఆదినారాయణ, పిడిలు జనార్ధన్‌రెడ్డి, పాల్గొన్నారు. రాయలసీమ స్థాయి గురుకుల జోనల్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎస్‌బిహెచ్ మేనేజర్ వాణిశ్రీ, బ్లూమూన్ విద్యా సంస్థల అధినేత శివశంకర్, మైరాడా ప్రాజెక్టు అధినేత వైఎస్ రమేష్, కణేకల్ ప్రిన్సిపాల్ శంకర్‌రెడ్డి, పట్నం ఎస్సై గంగాధర్‌రావ్, న్యాయవాది విజయ్‌కుమార్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. నాలుగవ జోని విభాగం కింద ప్రారంభమైన పోటీలకు కర్నూలు, కడప, చిత్తూరు, అనంతజిల్లాలకు చెందిన 16 సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు, కళాశాలకు చెందిన 400 మంది క్రీడాకారులు హాజరయ్యారు

దేశంలో విస్తరించిన అవినీతి ఎయిడ్స్ కన్నా ఎంతో ప్రమాదకరమ

దేశంలో విస్తరించిన అవినీతి ఎయిడ్స్ కన్నా ఎంతో ప్రమాదకరమని సినీ నటుడు, కళాకారుల ఐక్య వేదిక రాష్ట్ర అద్యక్షులు నరేష్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక బాలుర కళాశాలలో అవినీతి వ్యతిరేక పొరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేటి విద్యార్థులు, రాజకీయం అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అవినీతి ప్రాచీనకాలం నుండే ఉందన్నారు. అయితే ప్రజల్లో స్వతహాగా చైతన్యం వస్తే అవినీతిని అంతం చేయవచ్చన్నారు. ముఖ్యంగా అవినీతి అంతానికి ఓటును ఆయుధంగా వాడుకోవాలన్నారు. గాంధీజీ కలలు కన్న విధంగా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామ స్థాయి నుండే అవినీతిని పారద్రోలాలన్నారు. విద్యార్థి దశ నుండే అవినీతిని అంతమొందించడానికే కదిరి నుండి ఈ మహత్తర ఉద్యమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. ఒక నీటి బొట్టులా ప్రారంభమైన ఈ ఉద్యమం రాష్ట్ర మంతా పెద్ద ఉద్యమంగా మారుతుందన్నారు. అవినీతి నిర్మూలనలో అన్నాహజారే దీక్ష అందరికి ఆదర్శమన్నారు. అనంతపురం జిల్లా కరవుకాటకాల్లో అల్లాడుతోందని, తాను అదిలాబాద్ జిల్లా అడవుల్లో పని చేసినప్పటికి అనంత జిల్లాకు తన వంతు సహాయ సహకారాలందించి ఆదుకోవానే ఉద్దేశ్యంతో ఎక్కువ శాతం అనంతపురం జిల్లాలోనే తన కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరో జన్మంటూ వుంటే అనంతపురం జిల్లాలోనే పుడతానన్నారు. అనంతరం అనంత విద్య, వైద్య అవినీతి వ్యతిరేక పోరాట సమితికి తన వంతు సాయంగా రూ. 5 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. జాకీర్ హుసేన్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే సమాజంలో జరుగుతున్న అవినీతి విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించకుండా ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ చెన్నకేశవులు, అధ్యాపకులు ప్రశాంత్, సూర్యనారాయణ, సనావుల్లా, అనంత విద్యా, వైద్య అవినీతి వ్యతిరేక పొరాట సమితి జిల్లా కార్యదర్శి వెంకటేష్, బిసి మహాజన సమితి రాష్ట్ర కార్యదర్శి హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

29వ తేదీన జిల్లా బాలల సైన్స్ కాంగ్రెస్ నిర్వహించనున్నట్లు తెలిపారు

డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజి(ఏపీ), భారత శాస్త్ర సాంకేతిక పరిశోధనా మండలి వారి సంయుక్త ఆధ్వర్యంలో 29వ తేదీన జిల్లా బాలల సైన్స్ కాంగ్రెస్ నిర్వహించనున్నట్లు బాలల ఎన్‌సీఎస్‌సీ చైర్మన్, జిల్లా విద్యాశాఖాధికారి డి. వెంకటసుబ్బయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎ.క్యాంపులోని మాంటిస్సోరి హైస్కూల్‌లో ఉదయం 8.30 నుంచి కార్యక్రమం ఉంటుందన్నారు.

‘భూ వనరులను అభివృద్ధి కోసం వినియోగించు-భవిష్యత్తు కొరకు ఆదా చేయి’లోని వివిధ అంశాలైన ‘మనకు తెలిసిన భూమి-దాని పనులు, నేల నాణ్యత, నేలపై మానవ కార్యకలాపాలు, నేల సుస్థిర వినియోగం’ తదితర అంశాలపై 10 నుంచి 17 సంవత్సరాల వయస్సు కల్గిన విద్యార్థులు(బాల శాస్త్రవేత్తలు) బృందంగా ప్రాజెక్టు తయారు చేసి కార్యక్రమంలో ప్రదర్శించాలన్నారు.

జిల్లాలో ని అన్ని (ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్, మున్సిపల్, గుర్తింపు పొందిన ప్రైవేటు) పాఠశాలలకు సంబంధించి గతంలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే ప్రాజెక్టును తయారు చేయించి కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని హెచ్‌ఎంలను కోరారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 24లోపు సంబంధిత డివిజన్ కో ఆర్డినేటర్లకు అందజేయాలన్నా రు. dcncsckurnool@gmail.com వెబ్‌సైట్‌లో కూడా వివరాలు పంపవచ్చన్నారు

రాయలసీమ ఆర్టీపీపీ మజ్దూర్ పోస్టులు

రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంటు నాలుగవ దశ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి అర్హతను బట్టి అక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని కడప ఆర్డీవో వీరబ్రహ్మయ్య చెప్పారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చిన బాధితులతో ఆయన మాట్లాడారు. జూనియర్ ప్లాంటు అటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇందుకు పదవతరగతిలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఐటిఐ పాసై ఉండాలని ఆయన చెప్పారు. బాధితుల పక్షాన వచ్చిన పద్మనాభరెడ్డి మాట్లాడుతూ అధికారులు నిర్ణయించిన అర్హత ఉన్న ప్రజలు బాధితుల్లో లేరన్నారు.

చదవడం, రాయడం వస్తే సరిపోయే మజ్దూర్ పోస్టులు ఇప్పించాలని కోరగా తాను ఈ విషయాన్ని కలెక్టర్, ఆర్టీపీపీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. పలు సమస్యలపై ప్రజలు ఆర్డీఓకు విన్నవించారు

జిల్లాలో 30 వర్క్‌సైట్ పాఠశాలలను ఏర్పాటు

జిల్లాలో 30 వర్క్‌సైట్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) అధికారులు సన్నాహా లు చేస్తున్నారు. ఎయిడ్ ఎట్ యాక్షన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఈ స్కూళ్లను ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ స్వచ్ఛంద సంస్థ ఇటీవల జిల్లాలో సర్వే నిర్వహించి 599 మంది పిల్లలు పలు చోట్ల పని చేస్తున్నట్లు గుర్తించింది. గ్రానైట్ పరిశ్రమల్లో, ఇటుకబట్టీల్లో, స్టోన్ క్రషింగ్ యూనిట్లలో ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు, బీహార్ తదితర ప్రాం తాల నుంచి వలస వచ్చిన వారి పిల్లలు కూడా పనిచేస్తున్నట్లు గుర్తించింది. పరిశ్రమల్లో సుమా రు 3,400 మంది పిల్లలు పనిచేస్తున్నట్లు స్వ చ్ఛంద సంస్థ అంచనా వేసినా, ఇప్పటి వరకు 599మంది పిల్లలను గుర్తించారు.

ఎక్కడెక్కడ ఎంతమంది...
మండలాల వారీగా కుప్పంలో 93 మంది పిల్లలు, ఆర్‌సీపురంలో 40మంది, తిరుపతి రూ రల్‌లో 65మంది, బీఎన్‌కండ్రిగలో 33మంది, వరదయ్యపాళెంలో 20మంది, వి.కోటలో వందమంది, తిరుచానూరులో 22 మంది, బంగారుపాళెంలో 20మంది, బెరైడ్డిపల్లెలో 20మంది, పీలేరులో 20 మంది పలు పరిశ్రమల్లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. అలాగే పులిచెర్ల మండలంలో 20మంది, నిమ్మనపల్లెలో 20మంది, మదనపల్లెలో 41మంది, బీ.కొత్తకోటలో 22మంది, సీటీఎంలో 20మంది, కురబలకోటలో 20మంది, కలికిరి మండలంలో 20 మంది పిల్లలు పలు చోట్ల పనిచేస్తున్నట్లు ఇప్పటి వరకు గుర్తించారు. వీరిలో ప్రతి 20 మందికి ఒక పాఠశాలను ఏ ర్పాటు చేసి ఒక విద్యావాలంటీర్‌ను నియమిం చనున్నారు. మొత్తం తొమ్మిది నెలల పాటు పిల్లలకు వారి మాతృభాషలో విద్యను బోధించనున్నారు

ఫ్యాక్షన్ తగ్గుముఖం పట్టిందని రాయలసీమ రేంజ్ డీఐజీ చారుసిన్హా అన్నారు

రాయలసీమలో ఫ్యాక్షన్ తగ్గుముఖం పట్టిందని రాయలసీమ రేంజ్ డీఐజీ చారుసిన్హా అన్నారు. సోమవారం పట్టణంలోని సీఐ కార్యాలయాన్ని ఆమెతో పాటు ఎస్పీ షహనావాజ్ ఖాసీం, అడిషనల్ ఎస్పీ శివయ్య సందర్శించారు. ఈ సందర్భంగా డీఐజీ విలేకరులతో మాట్లాడుతూ.. సీమలో పోలీసుల చర్యతో ఫ్యాక్షన్ తగ్గుముఖం పట్టిందన్నారు. గ్రామాల్లో అక్కడక్కడా చిన్నచిన్న సమస్యలతో వివాదాలు జరుగుతున్నాయని, వాటిపై సకాలంలో చర్యలు తీసుకుని రాజీమార్గం ద్వారా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.

మావోయిస్టుల ప్రభావం కూడా తగ్గిందని, సూడో నక్సల్స్‌ను ఉక్కుపాదంతో అణచివేసినట్లు తెలిపారు. దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించినట్లు చెప్పారు. ప్రొహిబిషన్ ఎస్‌ఐలు సమర్థవంతంగా పని చేస్తున్నారని, త్వరలో అన్ని స్టేషన్లకు ఎస్‌ఐల నియామకం జరుగుతుందన్నారు. కానిస్టేబుళ్ల కొరత లేకుండా దశల వారీగా నియామకాలు చేపడతామన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది పనితీరు, స్టేషన్‌లోని సమస్యల గురించి డీఎస్పీ కోలార్‌కృష్ణ, సీఐ రామకృష్ణలను అడిగి తెలుసుకున్నారు