Friday, 25 November 2011

బిజినెస్ మ్యాన్ ఆడియో ఫంక్షన్ కి వైయస్ జగన్ వస్తాడని ....గుసగుసలు?

బిజినెస్ మ్యాన్ ఆడియో డిసెంబర్ 23న జరగనుందనే సంగతి తెలిసిందే. ఈ ఆడియో ఫంక్షన్ కి వైయస్ జగన్ వస్తాడని అంతటా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ లో ఆయనకు షేర్స్ ఉన్నాయని అందుకే వెంకట్ అతన్ని పిలుస్తున్నారని చెప్తున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని అలాంటిదేమీ లేదని చెప్తున్నారు.ఇక మహేష్ బాబు దూకుడుతో పెరిగిన మార్కెట్ కు అణుగుణంగానే బిజినెస్ మ్యాన్ ఉండబోతోందని చెప్తున్నారు. అందులోనూ గతంలో మహేష్,పూరీ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి మెగా హిట్ ఫిలిం కావటంతో ఈ సినిమాపై మరింత అంచనాలు ఉన్నాయి

అనుష్క కోసం గోపీచంద్, నాగార్జున పోటీ

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ త్వరలో తాను ‘రామాయణం’ సినిమాను తెరకెక్కిస్తానని, తన స్టయిల్ లో రామాయణం సినిమాను తీస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేగాక రావణుడు పాత్ర తరహాలో సాగే క్యారెక్టర్ కి నాగార్జునని సైతం ఎంపిక చేసారు. అయితే సీతా, రాముడుగా కీ రోల్ లో ఎవరు చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో అనుష్క, గోపీచంద్ పేర్లు బయిటకు వచ్చాయి. వీరిది హిట్ పెయిర్ కావటం ఓ కారణం,అంతేగాక అనుష్కలో హుందాతనం ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని చెప్తున్నారు. ఆమె కోసం గోపీచంద్, నాగార్జున పోటీపడటం సినిమాలో హైలెట్ అవుతుందని వర్మ భావించాడని వినిపిస్తోంది. అందులోనూ ప్రస్తుతం అనుష్క వరసగా నాగార్జున సినిమాల్లో చేస్తోంది. అంతకుముందు గోపీచంద్ తో పెళ్లి జరుగుతుందని వార్తలు కూడా వచ్చాయి. ఇవన్నీ సినిమాకు కాంట్రావర్సి తెచ్చి ఓపినింగ్స్ తెస్తాయని భావించే ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు.

అనంతపురం జిల్లాలో 5 మండలాల్లో సత్యసాయి మొబైల్ వైద్య సేవలు

సత్యసాయి జయంతి వేడుకలను పురస్కరించుకొని వెల్లడిచేసిన మేరకు సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఏడు జిల్లాలకు మొబైల్ వైద్య సేవలు విస్తరిస్తూ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రకటన మేరకు కట్టుబడి సెంట్రల్ ట్రస్టు ఉదయం సాయికుల్వంత్ సభా మండపంలో మొబైల్ వైద్య సేవలను సత్యసాయి సంస్థల దేశీయ అధ్యక్షులు, ట్రస్టు సభ్యులైన మద్రాస్ శ్రీనివాస్, ఆర్‌జె రత్నాకర్ చేతులమీదుగా ప్రారంభించారు. వేదమంత్రోచ్ఛారణల అనంతరం ఆధునిక వైద్య వసతులతో కూడిన మొబైల్ వాహనాలను సాయికుల్వంత్ సభా మండపంలో జిల్లాల వారీగా వరుస క్రమంలో వుంచి పూజానంతరం ప్రారంభించారు. వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదల చెంతకు చేర్చే లక్ష్యంతో ప్రారంభించినట్లుగా ట్రస్టు వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం మొబైల్ వైద్య సేవలను అనంతపురం జిల్లాలోని సత్యసాయి తాలూకాలోని 5 మండలాల్లో నిర్వహిస్తున్నారు. ఈ సేవలను విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, మహబూబ్‌నగర్, హైదరాబాద్, వైఎస్‌ఆర్ కడప జిల్లాకు విస్తరింప జేసి సదరు జిల్లాల్లో 410 గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను అందిస్తారు. అత్యాధునిక వైద్య వసతులు కలిగిన మొబైల్ వాహనంలో అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహించే సౌకర్యాలను అందుబాటులో వుంచినట్లుగా ప్రారంభనంతరం ట్రస్టు వర్గాలు తెలిపాయి. ఈ వైద్య సేవలు డిసెంబర్ నెల నుండి ప్రారంభం కానున్నాయి. మొబైల్ వైద్య సేవల్లో డాక్టర్లు, పారా మెడికల్ స్ట్ఫా, సేవాదళ్ సభ్యులు పాల్గొని సేవలందిస్తారు. ప్రధానంగా మొబైల్ వై ద్యచికిత్సల తదుపరి రోగ తీవ్రతను బట్టి వైద్య సేవలను, అత్యవసర సేవలను అందించేందుకు సత్యసాయి సేవా సంస్థలకు అనుబంధంగా వున్న నర్సింగ్ హోంలలో చేర్పించి వైద్య సేవలు అందించే విధానాన్ని అమలుపరుస్తున్నారు. సత్యసాయి ప్రేమతత్వపు స్ఫూర్తితో వీటిని నిర్వహిస్తున్నామని ట్రస్టు వర్గాలు వెల్లడించాయి

36 రోజులుగా ట్రిపుల్ ఐటీ బోధకులు సమ్మె

విద్యార్థులపైన, అధ్యాపక వర్గంపైన ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమో ట్రిపుల్ ఐటీ బోధకుల దుస్థితిని చూసి తెలుసుకోవచ్చు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సుమారు 36 రోజులుగా ట్రిపుల్ ఐటీ బోధకులు, హెచ్‌ఆర్టీలు చేస్తున్న సమ్మె  విషయంలో సర్కారు ఏమాత్రం స్పందించడం లేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. 20 రోజుల పాటు ఆర్.కె.వ్యాలీ ట్రిపుల్ ఐటీ వద్ద, ఆ తరువాత 16 రోజులుగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట వీరు రిలే దీక్షలు చేస్తున్నారు. మెంటర్లు (బోధకులు), హోం రూం ట్యూటర్లు(హెచ్‌ఆర్టీలు), హౌస్ కీపర్లు సమ్మెకు దిగడంతో మొదటి రెండు సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులకు తరగతులు సాగడం లేదు. సమ్మె ముగిసే వరకు విద్యా సంస్థకు సెలవులు ప్రకటించారు. గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలనే మహోన్నత ఆశయంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో మూడు ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేయించారుట్రిపుల్ ఐటీలలో విద్యార్థులకు సహాయకులుగా ఉన్న హోం రూం ట్యూటర్(హెచ్‌ఆర్టీ)ల పరిస్థితి దయనీయంగా ఉంది. రాష్ట్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన పీజీ డిప్లమో ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సు చదివిన వారిని హెచ్‌ఆర్టీలుగా నియమించారు. వారికి నెలకురూ.10 వేల వంతున చెల్లిస్తున్నారు. వారు ఈ కోర్సు పూర్తి చేయడానికి దాదాపు రూ.1.5 లక్షల వరకు ఖర్చయింది. వారికి శిక్షణ ఇచ్చిన సంస్థ ఆ మొత్తాన్ని బ్యాంకు ద్వారా రుణం రూపంలో ఇచ్చింది. ఉద్యోగాలలో నియమితులైన తరువాత వారి వేతనంలో నెలకు రూ.4 వేల చొప్పున రుణం కింద మినహాయించుకుని, రూ.6 వేల వంతున చెల్లిస్తున్నారు. ఆర్.కె.వ్యాలీ ఐటీలో 80 మంది హెచ్‌ఆర్టీలు పని చేస్తున్నారు.

అనంతపురంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ డిసెంబర్ 1

చెన్నై, గుంటూరు జోనల్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆధ్వర్యంలో అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో డిసెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు యువజన సంక్షేమ శాఖ అధికారి వెంకటేష్ నాయక్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతపురం, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, వైఎస్‌ఆర్, చిత్తూరు జిల్లాల అభ్యర్థులకు సోల్జర్ టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, ట్రేడ్స్‌మన్, సోల్జర్ క్లర్క్, కీపర్ కేటగిరీల వారీగా ర్యాలీ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ధ్రువీకరణ పత్రాల నకలు, దేహధారుడ్య, శారీరక కొలతల పరీక్షలు జిల్లాల వారీగా జరుగుతాయన్నారు. 21 ఏళ్లలోపు వివాహం చేసుకున్న అభ్యర్థులు అనర్హులన్నారు. ప్రతి అభ్యర్థి టెన్త్, ఇంటర్, డిగ్రీ మార్కుల జాబితా, అభ్యర్థి కాండాక్ట్ సరిఫికెట్, టీసీ, క్రీడల్లో ప్రావీణ్యం కలిగిన వారు సంబంధిత నకలు ధ్రువీకరణ పత్రాలతో పాటు 12 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను తీసుకురావాలన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మొద్దన్నారు.ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని విజయవంత  చేయండి

డీఎస్సీ-98కి ఉద్యోగాలు ఇవ్వాలంటూ....హైకోర్టు తీర్పు ఇచ్చింది

డీఎస్సీ-98లో అర్హత సాధించి ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులకు ఊరట లభించింది. ఆయా అభ్యర్థుల్లో మెరిట్ ఉన్న వారికి సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) ఉద్యోగాలు ఇవ్వాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. డీఎస్సీ-98కి సంబంధించి రెండు రకాల ఎంపిక జాబితాల ప్రకారం ఖాళీలకు లోబడి ఎస్‌జీటీ ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ 5 మార్కులు తగ్గిస్తూ ఎంపిక చేసే జీవో 17 జిల్లాల్లోనే అమలైందని, మిగిలిన 6 జిల్లాల్లో సెలెక్టెడ్ అభ్యర్థుల్లో మెరిట్ ఉన్న వారికి అన్యాయం జరిగిందని పేర్కొంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అటు ప్రభుత్వం, ఇటు అభ్యర్థులు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్గొండ, కడప, అనంతపురం జిల్లాల్లోని క్వాలిఫైడ్స్ వివాదం దశాబ్దకాలంగా నానుతూనే ఉంది. జస్టిస్ గోడ రఘురాం, జస్టిస్ జి.క్రిష్ణమోహన్‌రెడ్డిలతో కూడిన బెంచ్ ఎట్టకేలకు క్వాలిఫైడ్ టీచర్లకు ఒకింత ఊరట కలిగేలా తీర్పు ఇచ్చింది. ఈ విషయమై పాఠశాల విద్యా కమిషనర్ ఎన్.శివశంకర్‌ను వివరణ కోరగా.. ఇంకా తీర్పు కాపీ తమకు అందలేదని చెప్పారు

శ్రీశైలం ఇక తిరుమల తరహాలో హోదా దక్కబోతోంది!

శ్రీశైలం ఇక తిరుమల తరహాలో రూపుదిద్దుకోనుంది. నల్లమలలోని శివాలయాల సమూహంతో ఆ దేవస్థానానికి స్వయంప్రతిపత్తి కల్పించేందుకు ప్రభుత్వం అనుమతులివ్వబోతోంది. ఓంకారేశ్వరం, నవనందులు, నాలుగు ముఖద్వార క్షేత్రాలు, సంగమేశ్వరం తదితర ఆలయాలను కలుపుతూ శ్రీశైలానికి ప్రత్యేక హోదా చేకూరనుంది.
ఇకపై మల్లన్న క్షేత్రంతో పాటు సమీప ఆలయాలకు కొత్త శోభ సంతరించుకోనుంది. దీంతో సమీప పుణ్యక్షేత్రాల దర్శనభాగ్యం కూడా భక్తులకు సులువు కానుంది. దేశంలోనే తిరుపతికి ఉన్నంత ప్రాచుర్యం ఇకపై కర్నూలుకూ దక్కబోతోంది. దీంతో తమ జిల్లాకు మహర్దశ పట్టబోతోందంటూ అక్కడి వాసులు కోటి ఆశలతో ఉన్నారు క్షేత్రపరిధిలో సాలిడ్ వేస్టేజ్ మెనేజ్‌మెంట్, నీటిసరఫరా, అంతర్గత డ్రైనేజీ, అంతర్గత రహదారులు ఏర్పాటవుతాయి. వ్యాపార సముదాయ భవనాలు వెలుస్తాయి. సాంస్కృతి కార్యక్రమాలకు పెద్దపీటవేసి ఆలయ ఆధ్వర్యంలో పెద్ద ఆడిటోరియం ఏర్పాటవుతుంది. ఉద్యానవనాల రూపకల్పన, సిబ్బంది నివాసగృహాలు, భక్తుల వసతి సముదాయలను పటిష్ఠం చేస్తారు. దీని ద్వారా ఏటా శ్రీశైల ఆర్థిక లావాదేవీలు రూ. 100 కోట్లనుంచి రెట్టింపయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆలయాధ్వర్యంలోని 250 కాటేజీలు రెండుమూడింతలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పుడున్న 334 వ్యాపార దుకాణాలు మూడింతలయ్యే అవకాశాలున్నాయి. తలనీలాల ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశముంది.శ్రీశైలం దేవస్థానానికి స్వయం ప్రతిపత్తి వస్తే కర్నూలుకు మహర్దశ వస్తుంది. మహానంది, ఓంకారేశ్వరం, నవనందులు, నాలుగు ముఖద్వార క్షేత్రాలు, సంగమేశ్వరం తదితర ఆలయాలను కలుపుతూ శ్రీశైలానికి ప్రత్యేక హోదా చేకూరుతుంది. ప్రత్యేక ప్యాకేజీతో యాత్ర వసతి అందుబాటులోకి వస్తుంది. ఆలయ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. హోదా తీరే మారిపోతుంది. ఇప్పటిదాకా పాలకవర్గం కనుసన్నల్లో నిర్వహించే ఆలయం ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో నడుస్తుంది