Sunday, 18 December 2011

మద్యం సిండికేట్‌పై వదలొద్దు...నేతలతో చంద్రబాబు

మద్యం సిండికేట్ల వ్యవహారంపై దీర్ఘకాలిక ఉద్యమం చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పలువురు నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మద్యం సిండికేట్ల వ్యవహారాన్ని ఉపేక్షించవద్దని ఆయన వారికి సూచించినట్లుగా తెలుస్తోంది. దీనిని దీర్ఘకాలిక ఉద్యమంగా మలచాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంలో ఉన్నారని దీనిని బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించినట్లుగా తెలుస్తోంది. పిసిసి చీఫ్ బొత్స తీరును కూడా బాబు ఆక్షేపించినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో టిడిపి నేతలు ఉన్నా ఉపేక్షించవద్దని సూచించారని సమాచారం.రాష్ట్రంలోని మద్యం సిండికేట్ మాఫియాకు సంబంధించి అసలు గుట్టు బయటపడాలంటే సిబిఐచే దర్యాఫ్తు చేయించాలని డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పార్టీ తరఫున ప్రజా ఉద్యమం చేపడతామని అప్పటికీ స్పందించకుంటే సిఎం కిరణ్ కుమార్ రెడ్డి నివాసం ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఉప ఎన్నికల కోసం ముందస్తుగా భారీగా ఖర్చు పెడుతోందన్నారు.

వేటు వేయమని కోరే నైతిక హక్కు చిరంజీవికి లేదని ...శోభా నాగి రెడ్డి

తనపై అనర్హత వేటు వేయమని కోరే నైతిక హక్కు తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవికి లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి ఆదివారం అన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తామని ఎప్పుడో ప్రకటించారని అలాంటప్పుడు తనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరే హక్కు చిరంజీవికి గానీ, వంగా గీతకు గానీ లేదన్నారు. చిరు మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సి రావడం కాంగ్రెసుకు సిగ్గు చేటు అన్నారు. తనపై వేటు వేయాలని నిర్ణయం తీసుకుంటే న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తానన్నారు.

మహేష్ సినిమాలో పవన్ గెస్ట్ రోల్!

గూఢచారి 116 చిత్రంలో శోభన్ బాబు గెస్ట్ రోల్ లో కనపడతారు. ఆ పాత్రను పవన్ చేత చేయించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం మెహర్ రమేష్ వెళ్లి పనవ్ ని రిక్వెస్ట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పటివరకూ పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని, ప్రాజెక్టు ప్రారంభమయ్యాక చూద్దామని దాటవేసినట్లు చెప్తున్నారు. అయితే అన్నీ కలిసి వచ్చి ప్రాజెక్టు ప్రారంభమయితే పవన్ చేసే అవకాశముందని చెప్తున్నారు. ఇక మహేష్ సైతం తాను ఇలాంటి మల్టిస్టారర్ చిత్రాల్లో చేయటానికి ఆసక్తి చూపెడుతున్నారు.పవన్ కళ్యాణ్,మహేష్ బాబు మంచి ప్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరు కలిసి నటిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చాలా కాలంగా ఉంటోంది. కానీ ఏ నిర్మాతకూ వీరిద్దరనీ భరించి తమ సినిమాలో పెట్టుకునే ధైర్యం లేదు. అయితే అలాంటి విచిత్రమొకటి భవిష్యత్ లో జరిగే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. మహేష్ బాబుతో త్వరలో మెహర్ రమేష్ గూఢచారి 116 చిత్రాన్ని రీమేక్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు.

'శ్రీరామరాజ్యం' పుస్తక రూపంలో

బాపు,బాలకృష్ణల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'శ్రీరామరాజ్యం'. ఈ చిత్రం జనవరి 5 నాటికి మా చిత్రం యాభై రోజులు పూర్తి చేసుకొంటుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ముఖ్య ఘట్టాలతో బాపు బొమ్మలతో ఓ పుస్తకం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. గతంలోనూ బాపు చిత్రాలకు ఇలాంటి పుస్తకాలు విడుదల చేసి ప్రమోట్ చేసే ప్రయత్నం చేసారు. ఇక ఈ విషయాన్ని తెలపటానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నిర్మాత యలమంచిలి సాయిబాబా మాట్లాడుతూ...రామాయణంలోని గొప్పదనాన్ని ఈతరానికి చెప్పేందుకు చేసిన ప్రయత్నం 'శ్రీరామరాజ్యం'. ఈ చిత్రానికి వస్తున్న స్పందన సంతృప్తి కలిగించింది. మా ఉద్దేశం నెరవేరినందుకు ఆనందంగా ఉంది. జనవరి 5న ఈ చిత్ర విజయోత్సవాన్ని విజయవాడలో నిర్వహించనున్నాం. భక్తి భావంతో నిర్మించిన సినిమా ఇది. ఇంటిల్లిపాదీ చూసేలా బాపు తీర్చిదిద్దారు. జనవరి 5 నాటికి మా చిత్రం యాభై రోజులు పూర్తి చేసుకొంటుంది. చిత్ర కథను సంక్షిప్తంగా వివరించే పుస్తకాన్ని చిన్నారుల కోసం రూపొందించాం. బాపు బొమ్మలతో దీన్ని తీర్చిదిద్దాం. పాఠశాల విద్యార్థులకు వాటిని అందజేస్తున్నామని అన్నారు.

తిరుమలలో వివాహ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం

రాష్ట్రంలోనే ప్రప్రథమంగా తిరుమలలో కొత్తగా ఏర్పాటు చేసిన వివాహ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖా మంత్రి తోట నరసింహం ఆదివారం ప్రారంభించారు. ప్రతి ఏటా వేల వివాహాలు తిరుమలలో జరుగుతున్నాయని, ఈనేపథ్యంలో కార్యాలయం ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించామని, విదేశాల్లో స్థిరపడిన వారికి కూడా వివాహ రిజిస్ట్రేషన్‌ ఉపయోగపడుతుందన్నారు.

జనవరి 1న తిరుమలలో శ్రీవెంకటేశ్వరుని విఐపి దర్శనాలను రద్దు

నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న తిరుమలలో శ్రీవెంకటేశ్వరుని విఐపి దర్శనాలను రద్దు చేసినట్లు టిటిడి ఇఓ ఎల్.వి.సుబ్రహ్మణ్యం చెప్పారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజున రెండు వేల మంది వృద్ధులు వికలాంగులకు ప్రత్యేక దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్తర, దక్షిణ, కోస్తా, తెలంగాణ జిల్లాలలో ఒక్కో శ్రవణ పాఠశాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

ఇంటర్నేషనల్ వెబ్ సైట్స్ సర్వేలో కాజల్ టాప్

ఇంటర్నేషనల్ వెబ్ సైట్స్ నిర్వహించిన ఓ సర్వేలో కాజల్ అగర్వాల్ టాప్ గా నిలిచింది. మ్యాగజైన్ కవర్స్ లో బాగా గ్లామరస్ గా కనపడ్డ ఫిగర్ ఎవరని ఆ కంటెస్ట్ లో ప్రశ్న. దానికి ఎక్కువగా కాజల్ కి ఓట్లు పడ్డాయి. ఆ ఫోటో ఎఫ్ హెచ్ ఎమ్ కవర్ కవర్ మీద కాజల్ కనపడ్డ స్పైసీ స్టిల్ అది. అప్పట్లో ఆ కవర్ పేజీ మీద పెద్ద వివాదమే చెలరేగింది. తాను స్టిల్ ఇవ్వలేదని అది ఫేక్ అని కాజల్ వాదించింది. దానికి ఆ మ్యాగజైన్ వారు తమ దగ్గర షూటింగ్ చేసిన ఆధారాలు ఉన్నాయని కొట్టి పారేసారు. ఇక ఆమె ప్రస్తుతం మహేష్‌తో కలిసి 'బిజినెస్‌ మేన్‌'లో నటిస్తోంది.పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో జనవరి 1వతేది నుండి ప్రారంభం కానున్న నూతన బ్యాచ్‌లో వివిధ రకాల కంప్యూటర్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఆఫీస్, డిసిఏ, పిజిడిసిఏ, డిటిపి, సి, సిప్లెస్, ప్లెస్, విబి అండ్ ఓరాకిల్, జావ, జావ2 ఇఇ, హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్, మోబైల్ టెక్నాలజి, మల్టీమీడియా, పిజి డిప్లమా ఇన్ అడ్వాన్మ్ మల్టీమీడియా, యానిమేషన్, ఆటోకార్డు, టాలీ తదితర కోర్సులకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయిన నిరుద్యోగులు, విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు.

తిరుపతిని వరల్డ్‌క్లాస్ రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి !

తిరుపతికి పెరుగుతున్న రద్దీ నేపథ్యం లో ప్రయాణికులకు సరిపడేలా వసతి, తాగునీరు, సౌకర్యాల కల్పనకు తగు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయన్నా రు. స్టేషన్‌కు ఎదురుగా ఉన్న రిజర్వేష న్ కార్యాలయంలో ఎదురయ్యే ఇబ్బం దులు, విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని గతంలో దక్షిణం వైపు ఆర్‌సీరోడ్డులో కొత్త రిజర్వేషన్ కమ్ జనరల్ బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. సరైన ప్రచారం లేని కారణంగా అక్కడ సిబ్బంది పనిలేక ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితులను గమనిం చిన డీఆర్‌ఎం స్థానిక రైల్వే అధికారుల కు తగు ఆదేశాలిచ్చారు. అనంతరం రైలు బోగీలను శుభ్రం చేసే ఫిట్‌లైన్లు, మురికినీటి పంపింగ్, క్లీనింగ్, ఆర్‌వో వాటర్ ప్లాంట్ పనితీరులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. స్టేషన్‌కు తూర్పు వైపున్న రైల్వేట్రాక్‌లు, ట్రాక్‌లకు మధ్య ఏర్పాటు చేసిన మురికి నీటి కాలువలను పరిశీ లించి నీటి ప్రవాహం సక్రమంగా జరిగే లా చూడాలని రైల్వే హెల్త్ అండ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ వర్క్స్ విభాగం అధికారులను కోరారు. ప్రస్తుతం తిరుపతి రైల్వేస్టేషన్‌లో ఉన్న నాలుగు ఫిట్‌లైన్లు బోగీల శుభ్రతకు సరిపోవడం లేదని, ఆ ప్రభావం డైలీ ట్రైన్ల వేళలపై పడుతోందని స్థానిక అధికారులు డీఆర్‌ఎంకు వివరించారు. ఫిట్‌లైన్ల పెంపుదలకు ఉన్న సాధ్యాసాధ్యాలపై తనకు నివేదిక ఇస్తే జోనల్ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటానని హా మీ ఇచ్చారు. గత పర్యటనలో చేపట్టిన తనిఖీల్లో చోటు చేసుకున్న అంశాలపై మార్పు వచ్చిందా, లేదా? అని పరిశీలించారు.

నేడు అనంతపురం లో మెగా జాబ్‌మేళా

నగర, పట్టణ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఆదివారం అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ నీలకంఠారెడ్డి తెలిపారు. ఈ మేళాకు ఇరవై కంపెనీలు హాజరవుతున్నాయన్నారు. ఇందులో తొమ్మిది ప్రముఖ కంపెనీలు ఉన్నాయని వెల్లడించారు. శనివారం ఆయన తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. రాజీవ్ యువకిరణాలు పథకంలో భాగంగా అనంత నగర పాలక సంస్థ, జిల్లాలోని మున్సిపాలిటీలు, అర్బన్ ఐకేపీ సంయుక్తంగా ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నాయన్నారు. తొమ్మిది ప్రముఖ కంపెనీలు 533 మందికి ఉద్యోగాలు కల్పిస్తాయన్నారు. మరో 11 సంస్థలు కూడా పలువురిని నియమించుకుంటాయని తెలిపారు. కేప్ కాఫీ డే సంస్థ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు 115, ఫ్యూచర్ రిటైల్స్ సంస్థ టీమ్ మెంబర్ పోస్టులు 60, బాటా బిర్లా సంస్థ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు 18, జోయలుక్కాస్ సంస్థ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు 100, పీటీవీపీ లిమిటెడ్ సంస్థ టోల్ ప్లాజా సపోర్ట్ టీమ్ పోస్టులు 50, పాన్‌టాలూన్ సంస్థ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు 30, ఆదిత్యా బిర్లా సంస్థ టీమ్ మెంబర్ పోస్టులు 50, అపోలో ఫార్మసీ సంస్థ టీమ్‌మెంబర్ పోస్టులు 50, షాపర్ స్టాప్ సంస్థ టీమ్ మెంబర్ పోస్టులు 60 భర్తీ చేస్తాయన్నారు. 18 -35 ఏళ్ల లోపు వారు విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్ ఆర్డర్ వెంటనే ఇస్తారన్నారు.