Tuesday, 22 November 2011

‘బెజవాడ’ సినిమా మళ్లీ వాయిదా డిసెంబర్ 1న విడుదల

నాగ చైతన్య, అమల పాల్ జంటగా రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న సినిమా ‘బెజవాడ’ విడుదల మళ్లీ వాయిదా   పడింది. వర్మ శిష్యుడు వివేక్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 25న లేదా డిసెంబర్ 26న విడుదల చేయాలని తొలుత భావించినా...ఆ తేదీ రోజున విడుదల సాధ్యం కాక పోవడం, ఇతర సమస్యల కారణంగా సినిమాను డిసెంబర్ 1న విడుదల చేయాలని నిర్ణయించారు. వివాదాస్పద దర్శకుడిగా పేరొందిన వర్మ...బెజవాడకు సంబంధించిన వివాదాస్పద అంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని తొలి నుంచి ప్రచారం జరుగుతోంది. 90వ దశకంలో ఇక్కడ జరిగిన కుల, వర్గ పోరాటాలు, పేరుమోసిన రౌడీల జీవితాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా కథ తయారు చేశాడని అంటున్నారు. అయితే వర్మ మాత్రం ఇదంతా కల్పిత కథ మాత్రమే, ఈ సినిమా ఎవరినీ ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు.

కడప జిల్లాలోని ఫ్యాక్షన్ మళ్ళీ పగడలెత్తింది.

జిల్లాలోని ఫ్యాక్షన్ పగలు మళ్ళీ పగడలెత్తింది.  ప్రొద్దుటూరు, ఆర్టీవో కార్యాలయం వద్ద తండ్రీ, కొడుకులను ప్రత్యర్ధులు వేటకొడవళ్ళతో నరికివేశారు. ఈ ఘటన ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించింది. మృతి చెందిన తండ్రీకొడుకులిద్దరూ చెన్నమరాజుపల్లెకు చెందిన సుబ్బరాయుడు, లక్ష్మీనారాయణలుగా పోలీసులు గుర్తించారు.వీరు ఓ హత్యా కేసులో నిందితులు, ఇటీవలె జైలు నుంచి విడుదలైనట్లు సమాచారం. వీరిద్దరూ ఈరోజు ఉదయం మోటారు బైక్‌పై వెళుతుండగా మాటు వేసిన ప్రత్యర్ధులు సుమో వాహనంపై వచ్చి, బైక్‌ను ఢీకొట్టి హతమార్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు

6000 కోట్లతో రాష్ట్రంలో శ్వేత విప్లవం:ముఖ్యమంత్రి

ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్రవ్యాప్తంగా మిల్క్ మిషన్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో ఫుడ్ 360 డిగ్రీస్ పేరిట జరుగుతున్న ఆహార ఉత్పత్తుల సదస్సును సోమవారం ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో కొద్ది కాలం క్రితం ప్రయోగాత్మక ప్రాతిపదికన పాల ఉత్పత్తి పెంపునకు ఒక కార్యక్రమం ప్రారంభించామని ఆయన చెప్పారు. అదే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం ద్వారా గ్రామీణుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.చిత్తూరు జిల్లాలో ఇందిరా క్రాంతి పథం (ఐకెపి) ద్వారా గ్రామీణ మహిళలకు 3000 లీటర్ల వరకు సామర్థ్యం గల బల్క్ కూలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు సహకారం అందించడం ద్వారా లీటరు పాలకు మూడేళ్ల క్రితం లభించిన ఆరేడు రూపాయల ధర 20 నుంచి 21 రూపాయలు వచ్చేలా చేశామని ఆయన చెప్పారు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో రోజుకి 14 లక్షల లీటర్ల వరకు పాలు ఉత్పత్తి చేస్తున్నారన్నారు. దీనికి అనుబంధంగా పెరుగు, ఫ్లేవర్డ్ మిల్క్ వంటి అనుబంధ ఉత్పత్తులు తయారుచేయడం ద్వారా వారు అదనపు ఆదాయాలు కూడా పొందగలుగుతున్నారని ఆయన చెప్పారు.

వర్మ సినిమాలో విలన్ గా నాగార్జున

రామ్ గోపాల్ వర్మ చిత్రం శివతో స్టార్ గా ఎదిగిన నాగార్జున మరోసారి ఆయన దర్శకత్వంలో చేయనున్నారని సమాచారం. రామ్ గోపాల్ వర్మ రామాయణం టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాగార్జునని రావన్ రాజు అనే పాత్రకు అడిగినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఓ కార్పోరేట్ సంస్ధకు అధిపతిగా నాగార్జున మోడ్రన్ టచ్ తో పౌరాణిక మూలాలు ఉన్న పాత్రను పోషిస్తారు. అలాగే ఆ పాత్ర సినిమాలో నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్ర. రామాయణానికి ఓ కొత్త ట్విస్టు ఇచ్చి సినిమాని నడపాలనుకుంటున్నాడని, అందుకే పాత్రలకు సైతం పాపులర్ స్టార్స్ నే ఎంపిక చేయాలని నాగార్జునని సంప్రదించాడని తెలుస్తోంది. నాగార్జున సైతం ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక ఈ పాత్రలో మనుష్యుల్లో ఉండే చీకటి వాంఛలను చూపనున్నారని చెప్తున్నారు. మన్మధుడు గా ఇన్నాళ్లూ ఏలుతున్న నాగార్జున ఒక్కసారిగా ఇటువంటి పాత్రను ఒప్పుకుని వైవిద్యతను ప్రదర్సించాలనుకుంటున్నారు