Monday, 31 October 2011

కర్నూలు జిల్లా లో 300 ఏళ్ల నాటి శివాలయ ముఖ మంటపం కూలిపోయింది

కర్నూలు జిల్లా ఆత్మకూరులో 300 ఏళ్ల నాటి శివాలయ ముఖ మంటపం సోమవారం కూలిపోయింది. కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని ఆలయానికి విద్యుద్దీపాలంకరణ చేసేందుకు మౌలాలి అనే కార్మికుడు ఆలయం పైకి ఎక్కగా ఈ ఘటన చోటుచేసుకుంది. అతడికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పూర్వం శ్రీశైల మల్లిఖార్జునుని దర్శించుకునేందుకు మహర్షులు ఆత్మకూరు మీదుగా కాలినడకన వెళ్లే సమయంలో ఓ భారీ రాతిబండను పంచలింగాల ఆకృతిలో మలచి స్వయంభూ పరమేశ్వరుడిని రూపొందించి పూజలు చేశారన్నది చరిత్ర. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయానికి 300 ఏళ్ల క్రితం భక్తులు ముఖమండపాన్ని నిర్మించారు. అప్పటి నుంచి నిత్యపూజలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్తీక మాసం మొదటి సోమవారం నాడు ముఖమంటపం కూలిపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు

యువరాజ్ సింగ్ దేశ రాజధానిలో తొలి ఇండోర్ క్రికెట్ శిక్షణ కేంద్రం ప్రారంభించారు

                                            
తన చిరకాల స్వప్నమైన ‘యువరాజ్ సింగ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ను భారత క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ సోమవారం గుర్గావ్‌లో ప్రారంభించారు. ఈ క్రికెట్ అకాడమీలో యువ క్రికెట్ క్రీడాకారులకు అత్యాధునిక సౌకర్యాలతో శిక్షణను అందించనున్నాడు. నైపుణ్యం కలిగిన కోచ్‌ల సహాయంతో ఇండోర్, అవుట్ డోర్ శిక్షణ సౌకర్యాల్ని అందించనున్నాడు. దేశ రాజధానిలో తొలి ఇండోర్ క్రికెట్ శిక్షణ కేంద్రంగా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ క్రికెట్ అకాడమీలో బౌలింగ్ యంత్రాలతోపాటు, జిమ్, స్విమ్మింగ్ పూల్ సౌకర్యాలను యువరాజ్ సింగ్ ఏర్పాటు చేశారు. స్కూల్ విద్యార్థులతోపాటు, ఇతర వర్గాలకు కూడా అకాడమీ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు

తిరుపతి రైల్వే స్టేషన్‌లో పది చెల్లిస్తే ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకోవచ్చు

రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం నుంచి ఏసీ క్లాస్ టిక్కెట్లు కొన్నవారందరూ రూ. పది చెల్లిస్తే ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకోవచ్చు. దీన్ని ప్రయోగాత్మకంగా తిరుపతిలో ప్రారంభించారు. ఇది సఫలమైతే ఈ విశ్రాంతి గదుల నిర్వహణను ప్రైవేటుపరం చేసే అవకాశముంది. ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఏసీ, స్లీపర్ సాధారణ క్లాస్‌లలో ప్రయాణించే వారే రైలు వచ్చే వరకు ఏసీ గదుల్లో ఉచితంగా విశ్రాంతి తీసుకోవచ్చు.

ఇక స్లీపర్ క్లాస్ ప్రయాణికులు స్లీపర్ క్లాస్ విశ్రాంతి గదుల్లో ఉండొచ్చు. వీరు తమ టిక్కెట్లను గదుల రికార్డులో నమోదు చేసి ఉచితంగా విశ్రాంతి తీసుకుంటారు. ఇకపై రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారం టిక్కెట్ కొన్న ప్రతి ఒక్కరు రూ. పది చెల్లించి ఏసీ గదుల్లో మూడు గంటల పాటు విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రస్తుతం దీనిపై ప్రచారం లేకపోవడంతో పెద్ద సమస్యగా లేదు. ఒకవేళ అందరూ రూ. పది చెల్లించి ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకోవాలంటే తిరుపతిలో సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఎందుకంటే స్టేషన్‌లో ఉండేవి రెండు ఏసీ విశ్రాంతి గదులే. అందులో 80 సీట్లు ఉన్నాయి. తిరుపతి నుంచి వెళ్లే ఏసీ క్లాస్ ప్రయాణికులకే ఇవి చాలవు. అలాంటిది అందరూ విశ్రాంతి కోసం వస్తే ఎలా సాధ్యమని అధికారులు తలలు పట్టుకుంటున్నారు

Sunday, 30 October 2011

‘దమ్ము’ చిత్రంలో ఎన్టీఆర్, త్రిష

                                   
‘దమ్ము’ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన త్రిష నటించటం దాదాపు ఖరారైంది. ఈ మూవీలో ఎన్టీఆర్ తల్లిగా భానుప్రియ కనిపిస్తారు. మాకందిన అధికారిక సమాచారం ప్రకారం శుక్రవారం నుంచి త్రిష షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్స్ పై ఓ పాట షూట్ చేయనున్నారు. యంగ్ టైగర్ సరసన త్రిష తొలిసారి జతకడుతోంది. కాగా, కార్తీక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించటం ఖాయమైంది

త్వరలోనే చరణ్, అర్జున్ సినిమా


మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్నకాంబినేషన్ సాకారం కాబోతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకే చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రానికి పైడిపల్లి వంశీ దర్శకత్వం వహిస్తారు. నిర్మాత దిల్ రాజు
                            .
ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తేజ్ ఈ చిత్రం లో మెయిన్ హీరోగా నటించబోతున్నారు. ఇద్దరు ప్రముఖ హీరోలూ ఈ సినిమా లో నటిస్తున్నప్పటికీ, వీరిరువురూ ఒకే సారి తెరపై కనిపించరు. ఫ్లాష్ బ్యాక్ లో ఒక కీలక మైన పాత్రను అల్లు అర్జున్ పోషించబోతున్నారని సమాచారం.
మొత్తానికి ఈ వార్త చరణ్, అర్జున్ అభిమానులిద్దరికీ ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చింది. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరుంటారనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మూవీకి సంబంధించిన పూర్తి సమాచారం త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

కరువు ప్రాంతాల ప్రకటనతో రైతులకు ఒరిగేదేమిలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు

                             
కరువు ప్రాంతాల ప్రకటనతో రైతులకు ఒరిగేదేమిలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం అనంతపురం జిల్లా పర్యటనకువచ్చిన ఆయన ప్రభుత్వాస్పత్రి, వివాదాస్పద మిస్సమ్మ కాంపౌండ్ స్థలాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఏడాది తాము అడిగిన దానికంటే ఎక్కువగానే కరువు మండలాలుగా ప్రకటిస్తున్నప్పటికీ...ఆచరణలో మాత్రం చిత్తశుద్ధిని నిరూపించుకోవడంలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆర్భాటంగా కరువు మండలాలను ప్రకటించడం... ఆ తర్వాత చేతులెత్తేయడం రివాజుగా మా రుతోందని విమర్శించారు. పక్షం రోజుల్లో కరువు మండలాల్లో యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ రూపొందించి సాయం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టడమే కాకుండా... ఎక్కడికక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు

వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి 3 లక్షల రూపాయలు బకాయి పడ్డారు

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి 3 లక్షల రూపాయలు బకాయి పడ్డారు. ఇందుకు సంబంధించిన వార్తాకథనాన్ని ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఆదివారం ప్రసారం చేసింది. అనుమతులకు విరుద్ధంగా జగన్ ప్రభుత్వ భవనంలో ఉంటున్నారని, అందుకు ఆయన మూడు లక్షల రూపాయలు కేంద్రానికి బాకీ పడ్డారని ఆ టీవీ చానెల్ తెలిపింది. కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులకు మాత్రమే కేటాయించే భవనాన్ని గతంలో కేంద్ర ప్రభుత్వం వైయస్ జగన్‌కు కేటాయించింది. కాంగ్రెసు పార్టీకి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఆయన ఆ భవనాన్ని ఖాళీ చేయలేదని తెలుస్తోంది. అందుకుగాను ఆయన కేంద్ర ప్రభుత్వానికి మూడు లక్షల రూపాయలు బాకీ పడ్డారని ఆ టీవీ చానెల్ తెలిపింది. 

కాగా, మాజీ పార్లమెంటు సభ్యుడు, సీనియర్ కాంగ్రెసు నేత జి. వెంకటస్వామి కూడా తనకు గతంలో కేటాయించిన భవనాన్ని ఖాళీ చేయలేదని తెలుస్తోంది. అందుకు గాను ఆయన కేంద్ర ప్రభుత్వానికి రూ. 30 లక్షలు బాకీ పడ్డారని ఆ తెలుగు టీవీ చానెల్ తెలిపింది. ఇదిలా వుంటే, వార్త దినపత్రిక అధిపతి, మాజీ పార్లమెంటు సభ్యుడు గిరీష్ సంఘీ కూడా అనుమతులకు విరుద్ధంగా ఓ భవనంలో ఉన్నారని చెప్పింది. అయితే, ఆయన చెల్లించాల్సిన బాకీ ఏమీ లేదని తెలుస్తోంది

రాఘవేంద్ర తీర్థ స్వామీజీని పోలీసులు అరెస్టు చేశారు

 కాశీ మఠం సంస్థానం శ్రీమద్ సుధీంద్ర తీర్థ స్వామీజీ మాజీ శిష్యుడు, ఆయన వారసుడిగా తృణీకరణకు గురైన రాఘవేంద్ర తీర్థ స్వామీజీని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కడపలోని ఇందిరానగర్‌లో గల ఫ్లాట్‌లో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్లాట్‌లో కొన్ని చీకటి పనులు జరుగుతున్నాయని, గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారని ఇందిరా నగర్‌లోని ఆయన ఇరుగుపొరుగువారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముందుకు వచ్చారు. పోలీసులు ఆయనను అరెస్టు చేసి 20 విగ్రహాలను, రూ.8.75 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. 

కాశీ మఠానికి చెందిన విగ్రహాలను, చరాస్థులను, ఇతరాలను వెంటనే సుధీంద్ర తీర్థ స్వామీజీకి అప్పగించాలని ఇంతకు ముందు తిరుపతి కోర్టు ఆదేశించింది. దాంతో రాఘవేంద్ర హైకోర్టుకు వెళ్లాడు. కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. తాను మతపరమైన పర్యటనలో ఉన్నానంటూ వాటిని అప్పగించేందుకు రాఘవేంద్ర తీర్థ నిరాకరించారు. అక్టోబర్ 12వ తేదీన ఇందిరానగర్‌లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఓ ల్యాప్‌టాప్‌ను, 600 ఏళ్లనాటి లక్ష్మీదేవి బంగారు విగ్రహాన్ని, కొన్ని పంచలోహ విగ్రహాలను, పులి గోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా రాఘవేంద్ర తీర్థ స్వామీజీపై కేసులున్నాయి

సీమాంధ్రలో తెలంగాణ విద్యార్థి జెఎసికి స్వాగతం!

పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించేందుకు వస్తున్న తెలంగాణ విద్యార్థి జెఎసిని స్వాగతిస్తున్నామని సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి కన్వీనర్ ఆడారి కిషోర్ కుమార్ తెలియచేశారు. శనివారం ఎయు లా కాలేజీలో సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి జెఎసి సభ్యులు వస్తున్న బస్సును పోలీసులు అడ్డుకోనవసరం లేదని అన్నారు. తెలంగాణ విద్యార్థులు పోలవరంతోపాటు శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఇచ్చిన విధంగా వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, పల్నాడు, ఉత్తరాంధ్రల్లో కూడా పర్యటించాలని కిషోర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాంత వెనుకబాటుతనంపై కూడా సమైక్యాంధ్ర జెఎసి యాత్రను చేపడుతుందని ఆయన అన్నారు. దీనివలన ఇరు ప్రాంతాల వారికి ఉన్న అపోహలు తొలగిపోతాయని కిషోర్ అన్నారు. రాజకీయ నాయకుల ఉచ్చులో విద్యార్థులు పడకుండా వచ్చే నెలలో విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఒక వేదికను ఏర్పాటు చేసుకుని పరస్పరం చర్చించుకుని, వెనుకబాటుతనాన్ని పారదోలేందుకు ప్రభుత్వాలపై వత్తిడి తెద్దామని హితవు పలికారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ హైదరాబాద్‌తో పాటు విశాఖ, విజయవాడల్లో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్‌పై వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణ జరపాలని కిషోర్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా జాబ్ మేళాకు హాజరైన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజుకు సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి వినతి పత్రం ఇచ్చింది

చిత్తూరు జిల్లాలో 13 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించింది

ఖరీఫ్ సీజన్‌లో తగినంత వర్షాలు లేక జిల్లాలో అత్యధిక మండలాలు కరవు కోరల్లో చిక్కుకుని సతమతమవుతుండగా, ప్రభుత్వం మాత్రం 13 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించింది. ఖరీఫ్ సీజన్‌లో మైనస్ 17 శాతం నుంచి- మైనస్ 43 శాతం తక్కువ వర్షపాతం నమోదైన మండలాలను మాత్రమే ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా గుర్తించింది. జిల్లా యంత్రాంగం 14 మండలాలలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వాని కి నివేదిక పంపించింది.

చౌడేపల్లె, వాల్మీకిపురం, కేవీపల్లె, గుడుపల్లె, పుంగనూరు, శాంతిపురం, బైరెడ్డిపల్లె, గుర్రంకొండ, సోమల, కలకడ, కురబలకోట, తిరుపతి రూరల్, ఎర్రావారి పాళెం, రామసముద్రం మండలాలను అధికారులు ప్రతిపాదించగా, శనివారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ప్రభుత్వం రామసముద్రం మండలాన్ని మాత్రం మినహాయించి మిగిలిన 13 మండలా లను కరువు ప్రాంతంగా ప్రకటించింది.

వాస్తవానికి వర్షపాతం, పంటల విస్తీర్ణం, తెగుళ్ళు, పంటల దిగుబడి తదితర అంశాల ప్రాతిపదికన చూస్తే జిల్లాలో 49 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమాచారాన్ని కూడా జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. పొరుగునే వున్న అనంతపురం జిల్లాలో అన్ని మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటించగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఇంచుమించు 50 మండలాల్లో కరువు పరిస్థితులు తలెత్తినప్పటికీ కేవలం వర్షాభావాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని 13 మండలాలకే ప్రకటనను పరిమితం చేశారు

అనంతపురం జిల్లా లో 63 మండలాలనూ కరువు ప్రాంతాలుగా ప్రకటించారు

జిల్లాలోని 63 మండలాలనూ కరువు మండలాలుగా ప్రభుత్వం శనివారం అధికారిక ంగా ప్రకటించింది. మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశానంతరం ఈ విషయాన్ని మంత్రి డీకే అరుణ అధికారికంగా విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. అ యితే కరువు మండలాలుగా ప్రకటించడంతోటే సరిపెడతారా...? లేక కరువు మ్యాన్యువల్‌ను అమలు చేస్తారా..? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కరువు ప్రాంతంగా జిల్లా పేరుగాంచింది. అతివృష్టి...అనావృష్టితో కొన్ని సంవత్సరాలుగా రైతులు నష్టపోతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు                                                    

గత ఏడాది ప్రభుత్వం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో మొదట 57 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. రైతులు, ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తం కావడంతో... ఆ తర్వాత మిగిలిన ఆరు మండలాలను కూడా కరువు ప్రాంతాలుగా ప్రకటించా రు. జిల్లాలో గత నాలుగేళ్లుగా వరుసగా కరువు కరాళనత్యం చే స్తూనే ఉంది. గత ఏడాది జిల్లాలోని మండలాలన్నింటినీ కరువు ప్రాంతాలుగా ప్రకటించినప్పటికీ... ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదనే చెప్పాలి. జిల్లా రైతులను ఆదుకోవడంలో ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది కేవలం రూ.84 కోట్ల వడ్డీ మాఫీని ప్రకటించారు. అయితే నేటికీ కేవలం 50 శాతం వడ్డీమాఫీ మాత్రమే అమలయింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పంటనష్ట పరిహారానికే దిక్కులేదు ..? గత ఏడాది 8,14,077 హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులు... పంట కోత సమయంలో జల్ తుపాను ప్రభావంతో పూర్తిగా నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 202 రెవెన్యూగ్రామాల పరిధిలో 2.53లక్షల హెక్టార్ల సాగులో 1,05,648 మంది రైతులకు రూ.127.93 కోట్ల పంటల బీమాను అందించారు. ఇందులో 50వేల మందికిపైగా రైతులకు ప్రీమియం కంటే తక్కువగానే పరిహారం అందింది. మిగిలిన 758 రెవెన్యూ గ్రామాల్లో 5.61 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేసిన 5.02 లక్షల మంది రైతులకు బీమా అందలేదు. పంట నష్టపోయిన రైతులకు రూ.255 కోట్లకుపైగా పంటనష్ట పరిహారం మంజూరు చేస్తామని జిల్లాకు చెందిన మంత్రులు ,ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించారు. ఆ దిశగా పంట నష్ట పరిహారం అందించడంలో విఫలమయ్యారు

Saturday, 29 October 2011

ఇంగ్లండ్ జట్టు గ్రేమ్‌స్వాన్‌కు మాత్రం ఏకంగా చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయట!

 భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 0-5తో వైట్‌వాష్‌కు గురైన ఇంగ్లండ్ జట్టు ఇంటా బయటా తీవ్ర విమర్శలెదుర్కొంటుంటే.. ఆ జట్టు ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్‌స్వాన్‌కు మాత్రం ఏకంగా చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయట! భారత్‌తో ఐదో వన్డేలోనూ చిత్తుగా ఓడిన తర్వాత తనకు ట్విట్టర్‌లో బెదిరింపులొచ్చాయని స్వాన్ పేర్కొన్నాడు. 

అయితే ఈ విషయాన్ని తాను అంతగా పట్టించుకోవడం లేదంటున్న స్వాన్.. అభిమానుల ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలనని తెలిపా డు. చివరి వన్డేలో మేం ఓడిపోయిన తీరు చూస్తే అభిమానులకు కోపం రావడం సహజమేనని అన్నాడు

ఎస్వీ యూనివర్సిటీ దూరవిద్య విభాగం నిర్వహిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ దూరవిద్య విభాగం నిర్వహిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బీఏ, బీకాం, మొదటి, రెండో, మూడో సంవత్సరం పరీక్షలు, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ మొదటి సంవత్సరం పరీక్షలు కూడా అదే రోజు నుంచే మొదలవుతాయి. బీఎల్ఐఎస్‌సీ పరీక్షలను నవంబర్ ఒకటి నుంచి ప్రారంభమవుతాయి. 

ఇప్పటికే అభ్యర్థుల హాల్‌టిక్కెట్లను ఆయా పరీక్షా కేంద్రాలకు పంపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 68 కేంద్రాల్లో సుమారు 25 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. అదనపు సమాచారం కోసం www.svudde.org వెబ్‌సైట్‌లో లేదా 0877- 2289477 నంబరులో గాని సంప్రదించాలని ఎస్వీయూ డీడీఈ డీన్ ఎస్.వి.సుబ్బారెడ్డి శనివారం తెలిపారు

శ్రీరామరాజ్యం ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

                                                           
బాలయ్య రాముడిగా నయనతార సీతగా రూపొందిన శ్రీరామరాజ్యం ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. బాపూ దర్సకత్వం లో రూపొందిన ఈ చిత్రంలో బాలయ్య రాముడి గెటప్ లో ఎలా ఉంటారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా రాముడి గెటప్ కి సంబందించిన లుక్ ని ఈ నెల 31 న అధికారికంగా విడుదల చేయడానికి చిత్ర నిర్మాత యలమంచలి సాయి సన్నాహాలు చేస్తున్నారు

తిరుమల లడ్డూ వితరణశాలలోనూ భక్తులు కిక్కిరిశారు

                                     
 తిరుమలలో భక్తుల రద్దీ తరగడంలేదు. శనివారం కూడా కొండకు భక్తులు పోటెత్తారు. దీంతో సర్వదర్శనానికి 15, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. దీపావళి పండుగ ముగియడం, వారాంతపు సెలవులు కావడంతో తిరుపతి సమీప ప్రాంతాల భక్తులు రెండు రోజులుగా తిరుమలకు తరలివస్తున్నారు. 

ముఖ్యంగా కాలిబాటన, సొంత, ప్రైవేటు వాహనాల్లో భక్తులు అధిక సంఖ్యలో తిరుమల చేరుకుంటున్నారు. ఇక వాహనాల పార్కింగ్‌కు స్థలం సరిపడక రోడ్లపై ఆపుతుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇక గదుల కేటాయింపు మధ్యాహ్నానికే పూర్తవడంతో సగానికిపైగా భక్తులు ఆరుబయటే సేదతీరుతున్నారు. శనివారం ఎడతెరపి లేని చిరుజల్లులు పడుతుండడంతో వీరంతా ఇబ్బంది పడుతున్నారు.

రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్ నిండి, వెలుపల ఆళ్వారు ట్యాంకు చుట్టూ ఉన్న క్యూలైన్లో భక్తులు వేచివున్నారు. దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తుల క్యూలైన్ కూడా కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉంది. శనివారం సుమారు 90 వేల మంది భక్తులు మహాలఘులో స్వామివారిని దర్శించుకున్నారు. లడ్డూ వితరణశాలలోనూ భక్తులు కిక్కిరిశారు. ఈ రద్దీ మరో రెండు రోజులపాటు కొనసాగనుంది. దీనికి అనుగుణంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు

11 సంవత్సరాల నుంచి అద్దె కట్టలేదు !

ఆదోని వ్యవసాయ మార్కెట్‌కు 21మంది వ్యాపారులు కేటాయించిన దుకాణాల బాడుగలను చెల్లించకుండా 11 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వ్యాపారుల బకాయిలను ఆడిట్ అధికారులు ఎత్తి చూపుతుండడం వలన మార్కెట్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. బకాయి పడ్డ సొమ్మును మాఫీ చేయించుకోవడానికి వ్యాపారులు రాజకీయ నాయకుల చుట్టూ 11 సంవత్సరాల నుంచి ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే అధికారులు బకాయిలను వసూలు చేయడానికి అవసరమైతే ఆర్‌ఆర్ యాక్టు అమలు చేయడానికి పూనుకుంటున్నారు. మార్కెట్‌యార్డులో 11సంవత్సరాల క్రితం కోట్లాది రూపాయలతో పత్తి మార్కెట్‌యార్డును నిర్మించారు. మార్కెట్లో 21గోదాములను కూడ వ్యాపారులకోసం నిర్మించారు. ఈగోదాములను బహిరంగ వేలం ద్వారా 23మంది వ్యాపారులు తీసుకున్నారు. తీసుకున్నప్పటినుంచి బకాయిలు చెల్లించినమాట వాస్తవమేనని మార్కెట్‌యార్డు కమిటీ కార్యదర్శి రామమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పోటీ పడి గోదాములను తీసుకున్న వ్యాపారులు తీసుకున్న గోదాముల్లో విభాగాలు చేసి కొంతమంది వ్యాపారులకు దుకాణాలకోసం బాడుగలు ఇచ్చి బాడుగలను వ్యాపారులు జేబుల్లో వేసుకుంటున్నారు. కానీ మార్కెట్ కమిటీకి మాత్రం నెలనెల బాడుగలు చెల్లించలేదు. ఈవిధంగా 11సంవత్సరాలు గడిచిపోయింది. 2006సంవత్సరంలో బాడుగలను తగ్గించి బకాయిలను మాఫీ చేయాలని ప్రభుత్వానికి వ్యాపారులు చేసుకున్న విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది. అయినప్పటికీ కూడ వ్యాపారులు బాడుగలు చెల్లించకుండా అలాగే కాలయాపన చేస్తున్నారు. పదకొండేళ్లు కావడంతో బాడుగలు తడిసి మోపుడై ఇప్పుడు రూ.80లక్షల మేర 23మంది వ్యాపారులు మార్కెట్‌యార్డుకు బకాయి పడ్డారు. మార్కెట్ అధికారులు కూడ వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం వలన వ్యాపారులు కూడ పెద్దగా స్పందించలేదు. ప్రతి సంవత్సరం బకాయిల వ్యవహారం ఆడిట్‌లో వస్తూనే ఉంది. చాలామంది అధికారులు బకాయిల వసూళ్లకు పూనుకున్నారు. కానీ వ్యాపారులు అప్పటికప్పుడు స్థానికంగా ఉన్న రాజకీయ పార్టీల నాయకులను కలిసి అధికారులపై ఒత్తిడి తీసుకొని రావడంతో అధికారులు కూడ కిమ్మనకుండా ఉండిపోతున్నారు. దీంతో చివరకు రూ.80లక్షల వరకు బకాయి చేరగా వ్యాపారులు ఇంత మొత్తం బకాయి పడ్డ విషయం నిజమేనని మార్కెట్ కమిటీ కార్యదర్శి స్పష్టం చేశారు. ఇటీవల సీమ స్థాయి మార్కెట్ కమిటీ జెడివద్ద బకాయిపడ్డ వ్యాపారులు కలిసి బకాయిలను మాఫీ చేయాలని కూడ కోరినట్లు సమాచారం.



ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులు ముందురోజు రాత్రి MBC కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు

శ్రీవారి భక్తులకు టిటిడి కొత్త నిబంధనలు విధించింది. ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులు ముందురోజు రాత్రి MBC కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాని భక్తుల టికెట్లు రద్దు చేసి సామాన్య భక్తులకు మంజూరు చేస్తామని టిటిడి అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆర్జిత సేవా టికెట్లు వృధా అవుతున్నాయి. సంవత్సరాల తరబడి వేచి ఉన్నా దొరకని ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులు వాటిని వినియోగించుకోవడం లేదు. రెండు నెలలుగా 30 నుంచి 50 శాతం మంది భక్తులు ఆర్జితసేవలకు రావడం లేదు. అభిషేకం, వస్త్రం సేవలకు శుక్రవారం 167మంది భక్తులు హాజరుకావాల్సి ఉన్నా...చాలామంది భక్తులు రాలేదు. హాజరుకాని భక్తులు ముందస్తుగా సమాచారం అందించలేదు.

దీనిపై టిటిడి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్జిత సేవ టికెట్లు పొందిన భక్తులు ముందురోజు రాత్రి MBC కార్యాలయంలో హాజరుకావాలని టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు అన్నారు. ముందురోజు ఆఫీస్‌కు రాని భక్తుల టికెట్లు రద్దు చేస్తామని.... వాటిని సామాన్య భక్తులకు మంజూరు చేస్తామని తెలిపారు. సామాన్య భక్తులకు సౌకర్యాలు మెరుగు పరచడానికి టిటిడి సమయాత్తం అవుతోంది. తిరుమలలోని ప్రైవేటు మఠాలలో ఉన్న 30శాతం గదులను సామాన్య భక్తులకు మంజూరు చేసేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తోంది

తాగునీటి కష్టాలు పెరగనున్నాయి

అసలే కరువు కాటకాలతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయి. గతేడాదితో పోలిస్తే గ్రౌండ్‌వాటర్ లెవల్స్ నాలుగు మీటర్ల మైనస్‌కు పడిపోయాయి. భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవడంలో విఫలమైన కారణంగానే ఈ దుస్థితి దాపురించింది. అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతలో భూగర్భ జలనిధి కూడా తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశం.^నీటి మట్టం పెంచేందుకు చర్యలు తీసుకోక పోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది. దీంతో సాగు, తాగునీటి కష్టాలు పెరగనున్నాయి.

అలాగే నీటిలో ఫ్లోరైడ్ శాతంపెరుగుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. భూగర్భ జలవనరుల శాఖ^సేకరించిన గణాంకాల మేరకు 15.53 మటరల్ లోతుకు జలాలు పడిపోయాయి. నీటిమట్టం పడిపోవడంతో బోర్లకు నీరందని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో రైతులకు అదనపు కరెంట్ కష్టాలు వచ్చి పడ్డాయి. వర్షపునీటిని నిల్వ చేయడం, చెరువులు, చెక్‌డ్యామ్‌లను సంరంక్షించడంలో అధికారుల విఫలం కావడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడింది.

ఇసుక అక్రమ రవాణా కూడా నీటి నిల్వలు పడిపోవడానికి కారణం అవుతోంది. ఇప్పటికైనా అధికారులు యుద్ద ప్రాతిపదికన వాననీటి సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. చెరువులు, కుంటలను రక్షించకుంటే భవిష్యత్ మరింత దారుణంగా ఉండే ప్రమాదం ఉంది

ఆర్టీసీ బస్సు పిట్టగోడను ఢీకొంది

 తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 35వ మలుపు వద్ద శనివారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు పిట్టగోడను ఢీకొంది. కాగా తృటిలో పెను ప్రమాదం తప్పటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనతో ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Friday, 28 October 2011

టీడీపీ-కాంగ్రెస్‌ వర్గాల మధ్య నెలకొన్న పాత కక్షలుభగ్గుమన్నాయి

AAటీడీపీ-కాంగ్రెస్‌ వర్గాల మధ్య నెలకొన్న పాత కక్షలుభగ్గుమన్నాయి.
దీంతో..ఇరువర్గాలు దాడికి దిగాయి. ఈ దాడిలో 10మంది గాయపడ్డారు.చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామపంచాయితీలోని వడ్డె పల్లిలో ఈ ఘటన జరిగింది.గాయపడిన వారిలో మహిళలు కూడా ఉన్నారు.క్షతగాత్రులను పోలీసులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యచికిత్సలు అందిస్తున్నారు

తిరుపతిలో వరలక్ష్మి నోములను మహిళలు ప్రత్యేక పూజలు చేపట్టారు

తిరుపతిలో వరలక్ష్మి నోములను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పలు దేవాలయాల్లో ముత్తయిదువలు ప్రత్యేక పూజలు చేపట్టారు. దీంతో అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. పూలు, పండ్లు పూజకు ప్రధానం కావడంతో వీటి ధరలకు రెక్కలొచ్చాయి. ఇక అరిసెలు సమర్పించడం ఇక్కడి పూజలో ప్రత్యేకం. దీంతో ఇక్కడి అరిసెలు తయారు చేసే వారు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. దీపావళి సందర్భంగా ముత్తయిదవలు మంగళగౌరీ వ్రతం నిర్వహించడం పరిపాటి. తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ వారు ఈ వ్రతాన్ని చేపట్టారు. పూజానంతరం నోము దారాలను కట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది. .

తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు.గౌరీ నోముల్లో పూలు, పండ్లతో పాటు అరిసెలు సమర్పించడం తప్పనిసరిగా భావిస్తారు. అరిసెల తయారీ శ్రమ, ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఇప్పుడు తిరుపతిలో కొన్ని కుటుంబాలు ప్రత్యేకంగా అరిసెల తయారీని చేపట్టారు. దీంతో ఇళ్లల్లో అరిసెల తయారీ బాధ తప్పింది. విజయవాడకు చెందిన కొన్ని కుటుంబాల వారు ఇప్పుడు అరిసెల తయారీ చేపట్టి తిరుపతిలో అమ్ముతున్నారు. అంగళ్లు ఏర్పాటు చేసుకున్న వారికి కూడా ఉపాధి లభిస్తోంది

గంభీర్‌ పెళ్లికొడుకు అవతారంలో అభిమానులను అలరించనున్నాడు

ఇన్ని రోజులు టీమిండియా  మైదానంలో ఆటతో అభిమానులను అలరిస్తే ఈరోజు మాత్రం గుర్గావ్‌లో పెళ్లికొడుకు అవతారంలో అభిమానులను అలరించనున్నాడు. బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె నటాషా జైన్‌తో గంభీర్‌ గుర్గావ్‌ ఫామ్‌ హౌస్‌లో పెళ్లి చేసుకొనున్నాడు. ఈ ప్రయివేట్‌ కార్యక్రమానికి గంభీర్‌ సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు. ఈ వివాహానికి ప్రముఖ సింగర్‌ రహత్‌ ఫతేష్‌ ఖాన్‌ ప్రత్యేక ఆహ్వానితునిగా విచ్చేయనున్నాడు. 
Natasha Jain-Gautam Gambhir
, నటాషా జైన్‌లకు సంవత్సరం క్రితం పరిచయం ఏర్పడింది. ఆరు నెలల కిందే వీరి వివాహాం జరగాల్సింది. కానీ భారత్‌-ఇంగ్లండ్‌ వన్డే సిరీస్‌ నేపథ్యంలో వాయిదా పడింది. కొత్త దంపతులకు వెడ్డింగ్‌ డ్రెస్‌ను ప్రముఖ డిజైనర్‌ శాంతాను నిఖిల్‌ రూపొందించారు. శనివారం ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టి20 మ్యాచ్‌కు గంభీర్‌ అందుబాటులో ఉండడు. ఇక గంభీర్ పెళ్లికి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ మొదలగున వారు హాజరవనున్నట్లు తెలిసింది

అనంపుతరం జిల్లాలో బంగారు నానో తన మెరుపులతో చూపరులను ఆకట్టుకుంటుంది

శ్రీ సత్యసాయి సన్నిధానానికి ప్రాచుర్యమైన అనంపుతరం జిల్లాలో బంగారు నానో తన మెరుపులతో చూపరులను ఆకట్టుకుంటుంది. దేశంలో స్వర్ణాభరణాల తయారీ మొదలై 5,000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణకారుల జ్ఞాపకార్థం టాటా మోటార్స్ ఈ గోల్డ్ నానో కారును రూపొందించి. భారతదేశంలో ఒక్కోప్రాంతాని సంబంధించిన ఒక్కొక్క డిజైన్‌ను ఈ గోల్డ్ నానోపై చూడవచ్చు.

                           గత నెలలో టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ఈ బంగారు నానో (గోల్డెన్ నానో) ఆవిష్కరించారు. టాటా గ్రూపులోని స్వర్ణాభరణాల విభాగం అయిన 'టాటా గోల్డ్ ప్లస్' కంపెనీ ప్రచారంలో భాగంగా ఈ బంగారు నానో కారును దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గోల్డ్ ప్లస్ అవుట్‌లెట్లలో ఈ కారును ప్రదర్శనకు ఉంచనున్నారు. ఇందులో భాగంగానే కంపెనీ తమ బంగారు నానో కారును అనంతపురం జిల్లాలో కూడా ప్రదర్శనకు ఉంచింది.

గోల్డ్ నానో తయారీ కోసం 80 కేజీల స్వచ్ఛమైన బంగారాన్ని, 15 కేజీల వెండిని మరియు 10,000 రత్నాలను ఉపయోగించారు. ఈ బంగారు నానో కారు తయారీకి కంపెనీ సుమారు రూ.22 కోట్లకు పైగా ఖర్చు చేసింది

Wednesday, 26 October 2011

నమస్తే రాయలసీమ పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు


తిరుమలకు బాణాసంచా తీసుకురావద్దు

హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటైన దీపావళీని ప్రతి హిందువు ఎంతో సంతోషంగా పిల్లాపాపలతో జరుపుకుంటారు. దీపావళీ అంటేనే బాణాసంచా కాల్చడం అన్నది భారతదేశంలోని ఎవ్వరిని అడిగినా ఇట్టే చెపుతారు. అయితే అలాంటి ముఖ్యమైన దీపావళీ పండుగ రోజు తిరుమలకు బాణాసంచా తీసుకువెళ్లకూడదంటూ టిటిడి అధికారులు హుకుంజారీ చేశారు. ఒక వెళా తీసుకువెళ్లినా పేలుడు బాణాసంచా తిరుమలకు తీసుకురాకూడదంటూ నిబందనలు విదించారు. చిన్నపిల్లలకు కాల్చే బూచక్రాలు, కాకర వత్తులు శబ్ధరహిత బాణాసంచా మాత్రమే తీసుకువెళ్లాలని ఆంక్షలు విదించారు. దీంతో స్దానికులు తీవ్ర ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా వుండగా ఈ వ్యవహారంపై టిటిడి ఎస్‌ఓ ఎంకెసింగ్‌ను విలేకరులు ప్రశ్నించినపుడు దీపావళీ రోజున టపాసులు తీసుకువెళ్లడానికి అనుమతి ఇచ్చామని తెలిపారు. ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చినా అలిపిరి వద్ద వున్న విజిలెన్స్ సిబ్బంది మాత్రం స్దానికులు తిరుమలకు బాణాసంచా తీసుకువెళ్లకుండా నిరోదించడంతో ఈ యేడాది స్దానికులు దీపావళికి దూరం కావలసిన పరిస్దితి ఏర్పడింది. అయితే కొంత మంది సాహాసించి దొంగచాటుగా తిరుమలకు టపాసులు తీసుకువెళ్లారు. దీంతో దొంగచాటుగా తిరుమలకు తరలివెళ్లే నిషేదిత వస్తువులను నియంత్రించడంలో అలిపిరి భద్రతా సిబ్బంది ఎప్పటికీ కొరగారని మరోమారు నిరూపితమైంది. కాగా తిరుమల ఒక హైందవ ధార్మిక సంస్ధ అయినప్పటికి హిందు పండుగలను కూడా జరుపుకోనివ్వకుండా భద్రత పేరుతో టిటిడి అధికారులు నియంత్రణ చేయడం సబబుకాదని స్దానికులు అంటున్నారు

దీపావళి సంప్రదాయ పర్వదినం

సంప్రదాయ పర్వదినం
దీపావళి సంప్రదాయ బద్ధమైన పండుగ. ఈ సందర్భంగా ఇంటిల్లిపాది ఉదయాన్నే తలస్నానాలు చేసి, నూతన వస్త్రాలు ధరిస్తారు. ఇళ్లలో లక్ష్మీ పూజలు చేసి సంపద, సౌభాగ్యంతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదించమని ప్రార్థిస్తారు. పిండి వంటలు, తీపి పదార్థాలతో మధ్యాహ్నం విందు భోజనం చేస్తారు. రాత్రి చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరు ఉల్లాసంగా.. ఉత్సాహభరితంగా టపాసులు కాలుస్తారు. జిల్లాలోని మార్వాడీ సేట్లు తమ వ్యాపారాలకు సంబంధించి కొత్తగా పద్దుల పుస్తకాలను దీపావళి నుంచే ప్రారంభిస్తారు. శుభం, లాభం కలగాలని లక్ష్మీదేవిని పూజిస్తారు. 

విశేష పూజలు
దీపావళి సందర్భంగా దాదాపు అన్ని వైష్ణవాలయాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. దేవాలయాలను రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష అభిషేకాలు, నామ పారాయణం, అలంకారాలు చేస్తారు. కొన్ని చోట్ల రాత్రి గ్రామోత్సవాలు నిర్వహిస్తారు. దేవునికడప శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయం, జయనగర్ కాలనీలోని శ్రీదేవి, భూదే వి సమేత కళ్యాణ వేంకటే శ్వరస్వామి ఆలయం, నకాష్‌లోని శ్రీ రుక్మిణీ పాండురంగస్వామి ఆలయం, గడ్డిజజారులోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణస్వామి ఆలయం,
విశేషాలంకారంతో పూజలు నిర్వహించనున్నారు.

ఇంజినీరింగ్ విద్యలో ప్రమాణాల పెంపు

 ఇంజినీరింగ్ విద్యలో ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్నట్టు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) రీజనల్ చైర్మన్, జేఎన్‌టీయూ మాజీ వీసీ ప్రొఫెసర్ డిఎన్.రెడ్డి పేర్కొన్నారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమానికి హాజరు కావడానికి తిరుపతికి వచ్చిన ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడా రు. దేశంలో ఇంజినీరింగ్ విద్యను అందించడంలో, పెద్ద సంఖ్యలో ఇంజినీర్లను తయారు చేయడంలో మన రాష్ట్రం పొరుగు రాష్ట్రాల కన్నా ముందుందని ఆయన తెలిపారు. దేశంలో 3,500 ఇంజి నీరింగ్ కళాశాలలు ఉంటే మన రాష్ట్రంలో 717 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 13 లక్షల ఇంజి నీరింగ్ సీట్లు ఉంటే, మన రాష్ట్రంలో 3 లక్షల సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే 22 వేల ఎంటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సామాన్యు లు, పేద విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య ను అందించాలన్న లక్ష్యంతో మన రాష్ట్రం లో ఇన్ని ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటయ్యాయని ఆయన పేర్కొన్నారు.

మరి న్ని కొత్త కళాశాలల స్థాపనకు దరఖాస్తులను ఏఐసీటీఈ ఆహ్వానిస్తోందని తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ లోపు దరఖా స్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అయి తే మనరాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాల ల్లో నాణ్యత ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేవన్నారు. చట్టాల్లోని లొసుగు ల వల్ల ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ఆంధ్రప్రదేశ్ విద్యాచట్టం 1982 మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఈ దిశగా పని చేస్తుందన్నారు. నవంబర్ మూడో వారంలో జరిగే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు పాస్ కావచ్చ ని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ప్రైవే టు కళాశాలలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ర్యాగింగ్, సరైన బోధన, వసతులు లేని కళాశాలలపై ఎవరైనా ఏఐసీటీఈ వెబ్‌సైట్‌కు ు పంపవచ్చని ఆయన తెలిపారు

ప్రభుత్వ వైఖరి వల్లే రాయలసీమకు అన్యాయం

 ప్రకృతి చేతిలో కాదు... ప్రభుత్వ వైఖరి వల్లే రాయలసీమ ప్రాంతం ఆది నుంచి అన్యాయానికి గురైందని రాయలసీమ విమోచన సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రా యలసీమ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో పట్ట ణంలోని పద్మశాలీయ కల్యాణ మండపంలో మంగళవారం రాయలసీమ భవిష్యత్తు ఏమి టి? అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి 22 శాతం ఆదాయం లభిస్తున్నా ప్రభుత్వం ఇందులో ఒకటిన్నర, రెండు శాతానికి మించి సీమ అభివృద్ధికి ఖర్చు చేయడం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ రాయలసీమ వెనుకబాటు తనాన్ని బట్టబయలు చేసిందన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మన రాష్ట్రానికి 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించగా, ఈ నీటి పంపకంలో కూడా మనకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణాను ప్రకటిస్తే మిగిలిన రాష్ట్రంలో రాయలసీమకు మళ్లీ అన్యాయం జరుగుతుందన్నారు.

తెలంగాణ వారు ప్రత్యేక రాష్ట్రం కావాలంటుంటే, తాము సమైక్యాంధ్రలో ఉంటామని ప్రాధేయడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదన్నారు. సిగ్గువిడిచిన మన పాలకులు విడిపోతే బతకలేమనే హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలని వస్తున్న డిమాండ్‌ను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్నారు.ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందనడంలో అర్థం లేదన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సీమ అభివృద్ధికి అంతో ఇంతో కృషి చేశారంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను వైఎస్‌ఆర్ విస్తరింప చేశారన్నారు. రాయలసీమ విద్యార్థి వేదిక సెంట్రల్ కమిటీ సభ్యుడు ఎం.భాస్కర్ మాట్లాడుతూ మన ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాయలసీమ అభివృద్ధిపై ఓ ప్రణాళిక అంటూ లేదన్నారు

Tuesday, 25 October 2011

రిజర్వు బ్యాంక్ వడ్డీ రేటుని మళ్లీ పెంచింది

                                    
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బిఐ) వడ్డీ రేటుని మళ్లీ పెంచింది. రెపో రేటు పావు శాతం పెంచింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకే ఆర్ బిఐ మళ్లీ వడ్డీరేటుని పెంచింది. పొదుపు ఖాతాల వడ్డీపై నియంత్రణని ఎత్తివేసింది. సేవింగ్స్ ఖాతాదారులకు లబ్దిచేకూరుతుంది. ముందుగా చెల్లించే ఇంటి రుణాలకు అదనపు చార్జీలను రద్దు చేశారు. వడ్డీ రేటుని ఇక పెంచకపోవచ్చని భావిస్తున్నారు

రైలు టిక్కెట్ల ధరలను పెంచాలి !!

 కొన్నేళ్లుగా రైలు టిక్కెట్టు ధరలను పెంచని కారణంగా రైల్వే ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఎస్సీ రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రధాన కార్యదర్శి, ఆలిండియా రైల్వేమెన్ ఫెడరేషన్ సహాయ కార్యదర్శి శంకర్ రావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం గుంతకల్లుకు వచ్చిన ఆయన కోజీ రైల్వే గెస్ట్ హౌస్‌లో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మట్లాడుతూ భారత రైల్వేల ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు.

లాలూ హయాం నుంచి ఇప్పటిదాకా రైలు టిక్కెట్ల ధరలను పెంచకపోగా, తగ్గించారన్నారు. ఈ కారణంగా రైల్వేల ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. తొమ్మిదేళ్లుగా టిక్కెట్టు ధరలు పెంచకపోగా, రైల్వే నిర్వహణ వ్యయం దాదాపు నాలుగింతలైందన్నారు. ఈ కారణంగా రైల్వేలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కొత్త రైలు మార్గాలు, స్టేషన్ల ఆధునికీకరణ, విద్యుద్దీకరణ, వ్యాగన్లు, కోచ్ ఫ్యాక్టరీల నిర్మాణ పనులు శంఖుస్థాపనలకే పరిమితమౌతున్నాయిగానీ, పూర్తికావడం లేదన్నారు. భధ్రతకు సంబంధించిన అంశమైన ఉద్యోగ ఖాళీలను సైతం పూర్తిచేయలేని దుస్థితిలో రైల్వే ఉందన్నారు.

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను నవంబర్ 21 నుంచి 29వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు

                                       
 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను నవంబర్ 21 నుంచి 29వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని అధికారులను టీటీడీ ఈవో ఎల్‌వి.సుబ్రమణ్యం ఆదేశిం చా రు. ఆయన సోమవారం దేవస్థానం పరిపాలన భవనంలో టీటీడీ, పంచాయ తీ, పోలీసు, ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు వివిధ విభాగాధిపతులు చేయాల్సిన విధులను, సూచనల ను చేశారు. తిరుమలలో విద్యుద్దీపాలంకరణలు ఏవిధంగానైతే భక్తులను ఆకట్టుకున్నాయో అదే రీతిలో ఏర్పాట్లు ఉండాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని టీటీడీ పారిశుద్ధ్య విభాగం, తిరుచానూరు పంచాయతీ అధికారులకు సూచించారు.

బ్రహ్మోత్సవాల సందర్బంగా అమ్మవారి ఆలయం లో నవంబర్ 15వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించాలని అధికారులను ఆదేశిం చారు. భక్తులను అలరించేలా వివిధ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ కళాకారులచే వివిధ కళారూపాలను హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య, ఆళ్వారు దివ్యప్రంబంధ ప్రాజెక్టు ఏర్పాట్లు చేస్తాయని ఈవో ఎల్‌వి. సుబ్రమణ్యం తెలిపారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల నుంచి తిరుచానూరుకు రోజుకు 60 ట్రిప్పులు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇందుకు ఆర్టీసీ అధికారులు అంగీకరించారు. ఈ సమీక్ష సమావేశం లో జేఈవో కెఎస్.శ్రీనివాసరాజు, వెంకటరామిరెడ్డి, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు