Tuesday, 21 February 2012

రాయలసీమలో మహాశివరాత్రి ఘనంగా నిర్వహించారు

శ్రీశైలం
శిరిగిరిపై వెలసిన శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్ల కల్యాణం సోమవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని కనులారా చూసి తరించేందుకు సుమారు 8 లక్షల మందికి పైగా భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. మహాశివరాత్రి పర్వదినమైన సోమవారం ఉదయం నుంచే శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారికి పల్లకీ సేవ నిర్వహించిన అనంతరం తిరుమల వెంకన్న తరపున టిటిడి అధికారులు స్వామి, అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించడంతో కల్యాణోత్సవ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి కల్యాణానికి సిద్దం చేశారు. రాత్రి 9 గంటల సమయంలో చీరాలకు చెందిన నేత కళాకారుడు పృధ్వీ వెంకటేశ్వర్లు నేసిన సుమారు 150 గజాల పాగాను కుటుంబ సభ్యులతో కలిసి మేళతాళాల మధ్య ఆలయ ప్రదక్షణ చేశారు. అనంతరం పాగాలంకరణకు సిద్ధమవగా ఆలయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపి వేశారు. దీంతో చిమ్మ చీకట్లో పృధ్వీ వెంకటేశ్వర్లు దిగంబరంగా ఆలయంపై ఉన్న నవనందులు, ఆలయ గోపురాన్ని కలుపుతూ పాగా అలంకరించారు. పాగాలంకరణ, రుద్రాభిషేకం, కల్యాణోత్సవం తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది.
శ్రీకాళహస్తి

మహాశివరాత్రి పర్వదినమైన సోమవారం ఉదయం శ్రీకాళహస్థీశ్వర స్వామి, శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవి సర్వభూషితాలంకారులై ఇంద్రవిమానం, చప్పరం వాహనాలపై కొలువుదీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తూ ఆశీర్వదిస్తూ చిద్విలాసాన్ని ప్రదర్శించారు. అదే విధంగా సోమవారం రాత్రి శ్రీకాళహస్థీశ్వరుడు నంది వాహనం, గజవాహనంపై జ్ఞానప్రసూనాంబికా దేవిలు ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. వాహనాల ముందు కేరళ పంచవాయిద్యాలు, తప్పెటగుళ్లు, లంబాడీల నృత్యాలు, కోలాటాలు, భజనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను కళాకారులు ఆనందోత్సాహాలతో నృత్యం చేశారు. అదే విధంగా ఏనుగులు, గుర్రాలు, వృషభాలు కూడా వాహనాల ముందు నడుస్తూ భక్తులను అలరించాయి. మొత్తంమీద ఉత్సవాల ఊరేగింపుతో మహాశివరాత్రి పర్వదినం నాడు శ్రీకాళహస్తి పట్టణం నాలుగుమాడావీధులు భక్తుల హరహర ధ్వానాలతో పులకించాయి.
తిరుపతి
తిరుపతిలోని శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన సోమవారం మహాశివరాత్రి పర్వదినం రావడంతో భక్తులు పెద్దఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున రెండుగంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. 2.30గంటల నుండి 4.30గంటల వరకు అభిషేకం, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం 7గంటల నుండి 9గంటల వరకు రథోత్సవం(బోగితేరు) కన్నులపండుగా జరిగింది. ఆత్మరథికుడు, శరీరమే రథం, బుద్ధిసారధి, మనస్సుపగ్గం. ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూలశరీరం వేరని, సూక్ష్మశరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. ఉదయం 9గంటల నుండి 11గంటల వరకు అర్చకులు స్నపనతిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీసోమస్కందమూర్తి, కామాక్షి దేవి అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. కాగా సాయంత్రం 6గంటల నుండి రాత్రి 10గంటల వరకు నంది వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా జూలకంటి బాలసుబ్రమణ్యం రచించిన, టిటిడి ముద్రించిన ‘కమనీయక్షేత్రం కపిలతీర్థం’ అనే పుస్తకాన్ని టిటిడి ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు జాగారం చేసేందుకు రాత్రి 10గంటల నుండి 12గంటల వరకు హరికథా కాలక్షేపం ఏర్పాటు చేశారు. ఆ తరువాత రాత్రి 12గంటల నుండి మంగళవారం తెల్లవారుజామున 4గంటల వరకు లింగోద్భవకాల అభిషేకాలు నిర్వహించారు.

శాసనసభ నడపడం చేతకాకపోతే రాజీనామా చేయాలి...చంద్రబాబు

శాసనసభ సమావేశాలను వాయిదా వేస్తూ పోతుండడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై, స్పీకర్ నాదెండ్ల మనోహర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఇదే రకంగా చేసి వైయస్ ఏమయ్యారో చేశారని, వీరికి కూడా అదే అవుతుందని, ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారని, మిగిలి ఉన్న అసెంబ్లీని భ్రష్టు పట్టించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. శానససభా సమావేశాల తీరు చూస్తుంటే మొదటి సారి తనకు ఆవేదన, బాధ కలుగుతున్నాయని ఆయన అన్నారు. జాతీయ రాజకీయాలు టిడిపికి కొత్తేమీకాదన్నారు. గతంలో ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వదులుకున్నట్లు ఆయన తెలిపారు. మళ్లీ టిడిపి గెలిస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. ఉప ఎన్నికల పొత్తుపై సిపిఎంతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. శాసనసభ సమావేశాలు చూస్తుంటే బాధ కలుగుతోందని అన్నారు. ప్రజా సమస్యలు చర్చిద్దామన్నా అవకాశం లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ జరుగకూడదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. శాసనసభని చక్కగా నడిపించవలసిన బాధ్యత స్పీకర్ దేనని చెప్పారు. రేపటి నుంచైనా శాసనసభని సజావుగా నడిపించమని సలహా ఇచ్చారు. ప్రజా సమస్యలపై శాసనసభని నడపడం చేతకాకపోతే రాజీనామా చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు చురకలు అంటించారు.శాసనసభ సమావేశాలు జరగకపోతే బాగుంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటున్నారని ఆయన అన్నారు. అది జరగకపోతే ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడానికి తాము ఏం చేయాలో అది చేస్తామని ఆయన అన్నారు. ప్రజల ముందు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతామని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు శాసనసభలో చర్చకు రాకుండా చూస్తున్నారని ఆయన అన్నారు.

ధోనీ తన పద్ధతి మార్చుకోవాలి...సౌరవ్ గంగూలీ

ఎక్కువ కాలం ఫలితాలు సాధించని ఆటగాళ్లను సమర్థించడాన్ని ధోనీ మానుకోవాలని ఆయన సూచించారు. తన మైండ్ సెట్ వల్ల ఎవరో ఒక్కరిని కాపాడుతూ పోవడం సరి కాదని ఆయన అన్నారు. రైనా విషయాన్ని ఆయన ఉదహరించారు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను నియమించాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. సెలెక్టర్లు ఆ దిశగా ఆలోచన చేయాలని ఆయన అన్నారు. క్రికెట్ ఎక్కువగా జగడమే కాకుండా ఫార్మాట్లు పెరిగాయని ఆయన అన్నారు.భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రొటేషన్ పాలసీపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విరుచుకుపడ్డారు. ఉత్తమ ఫీల్డింగ్ ప్రమాణాల కోసం సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి ఆటగాళ్లకు రొటేషన్ పాలసినీ అమలు చేస్తున్నట్నలు ధోనీ చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. జట్టులోని 11 ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో అత్యద్భుతమైన ప్రదర్శన కనబరచడమనేది జరగదని ఆయన అన్నారు. ఆస్ట్రేలియా జట్టు కూడా అలా లేదని ఆయన అన్నారు. ఫిల్డింగ్ మరీ మరీ ముఖ్యమే అయినప్పటికీ క్లిష్టమైన పరిస్థితిలో పరుగులు సాధించడం అంతకన్నా ముఖ్యమని ఆయన అన్నారు. ధోనీ తన పద్ధతి మార్చుకోవాలని ఆయన అన్నారు.మహేంద్ర సింగ్ ధోనీపై మ్యాచు నిషేధం విధించడంతో భారత జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్ నాయకత్వం వహిస్తున్నాడు. రోహిత్ శర్మ ఈ మ్యాచులో ఆడడం లేదు. పార్ధివ్ పటేల్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. జహీర్ ఖాన్‌ను పక్కకు పెట్టి స్పిన్నర్ అశ్విన్‌ను మైదానంలోకి దించారు. గత మ్యాచులో స్వల్పంగా గాయపడిన సచిన్ టెండూల్కర్ ఈ మ్యాచులో ఆడుతున్నాడు. భారత్ జట్టులో మూడు మార్పులు జరిగాయి. ధోనీ, రోహిత్ శర్మ, జహీర్ ఖాన్ స్థానాల్లో పార్థివ్ పటేల్, అశ్విన్, సెహ్వాగ్ మైదానంలోకి దిగారు. శ్రీలంక జట్టులో ఏ విధమైన మార్పులు జరగలేదు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో పది పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. శ్రీలంక ఏడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన వన్డే మ్యాచులో భారత్‌పై శ్రీలంక పగ తీర్చుకుంది. భారత్‌ను 51 పరుగుల తేడాతో ఓడించింది.


 

జగన్ పార్టీ మా శత్రువే,ఉప ఎన్నికల్లో పోటీ...వైఎస్ వివేకానందరెడ్డి

వచ్చే ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు.తన సోదరుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమకు ప్రధాన శత్రువు అని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ నేత వైయస్ వివేకానంద రెడ్డి మంగళవారం అన్నారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెసుకు ప్రధాన శత్రువులు తెలుగుదేశం, జగన్ పార్టీలేనని ఆయన స్పష్టం చేశారు. తాము జగన్ పార్టీతో కలిసే ప్రసక్తే లేదన్నారు. తాను అధిష్టానాన్ని రాజ్యసభ సీటు అడిగేందుకే ఢిల్లీ వచ్చానని చెప్పారు. పార్టీ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా తాను కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవ చేశాను కాబట్టే తాను పదవిని ఆశిస్తున్నానని అన్నారు. కాంగ్రెసు ఇప్పటి వరకు ఎవరినీ వాడుకొని వదిలేయలేదన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని అందలమెక్కిస్తుందన్నారు.జగన్‌తో సహా అవినీతి ఆరోపణలు వచ్చిన వారు ఎవరైనా విచారణకు హాజరు కావాల్సిందేనని అన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ చేస్తే కక్ష సాధింపు చర్యలు అనుకోవడం పొరబాటు అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్ చేస్తున్న ప్రచారం తప్పన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పుడూ విస్మరించలేదన్నారు. 15 ఏళ్లుగా రాయలసీమ ప్రాంతవాసులకు రాజ్యసభ సీటు దక్కనందున ఈసారి అది తనకు దక్కే అవకాశముందని వైఎస్ వివేకా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.