Saturday, 7 January 2012

సిడ్నీటెస్టులో చెరిగి పోయిన రికార్డులు!

సిడ్నీలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ టెస్టుల్లో తొలి ట్రిపుల్ సెంచరీ సాధించడంతో పాటు బ్రాడ్‌మన్ సహా పలువురి రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులు సృష్టించాడు. గురువారం మూడో రోజు లంచ్ విరామం తర్వాత కొద్ది సేపటికి క్లార్క్ ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసిన విషయం తెలిసిందే. ట్రిపుల్ సెంచరీ పూర్తి చేయగానే క్లార్క్ ఆనందంతో పిడికిలి బిగించి గాలిలోకి పంచ్ చేస్తూ గంతులు వేసాడు. ఈ క్రమంలో క్లార్క్ ఆస్ట్రేలియా-్భరత్ టెస్టు సిరీస్‌లో వివిఎస్ లక్ష్మణ్ సాధించిన 281 పరుగుల అత్యధిక వ్యక్తిగత రికార్డును అదిగమించడమే కాకుండా సొంత గడ్డపై ఆస్ట్రేలియా కెప్టెన్‌గా డాన్‌బ్రాడ్‌మన్ సాధించిన 270 పరుగుల రికార్డును కూడా అధిగమించాడు. 1936నుంచి బ్రాడ్‌మన్ రికార్డు అలాగే ఉండడం గమనార్హం.సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో 109 ఏళ్ల క్రితం ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ రెగ్ ఫాస్టర్ నెలకొల్పిన 297 పరుగుల అత్యధిక స్కోరును సైతం క్లార్క్ చెరిపివేసినప్పుడు స్టేడియంలోని వేలాది మంది అభిమానులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అతనికి అభినందనలు తెలియజేసారు. వాస్తవానికి క్లార్క్ బ్రాడ్‌మన్ నెలకొల్పిన 334 పరుగుల అత్యధిక పరుగుల రికార్డును సైతం అధిగమించే అవకాశముండింది. అయితే ఉద్దేశపూర్వకంగానో లేదా మరే కారణం చేతనో ఆ రికార్డుకు అయిదు పరుగుల దూరంలో ఉండగానే క్లార్క్ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసాడు. గతంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ కూడా బ్రాడ్‌మన్ రికార్డును సమం చేయగానే ఉద్దేశపూర్వకంగానే జట్టు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి బ్రాడ్‌మన్ పట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. ఇప్పుడు క్లార్క్ సైతం అదే ఉద్దేశంతోనే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే రికార్డులకన్నా జట్టు విజయమే తనకు ప్రధానమని, అందుకే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసానని క్లార్క్ చెప్పడం విశేషం.వ్యక్తిగత రికార్డులకన్నా టీమ్ ప్రయోజనాలే ముఖ్యంగా భావించినందుకు క్లార్క్‌పై మార్క్ టేలర్ సైతం ప్రశంసల వర్షం కురిపించాడు. బ్రాడ్‌మన్ రికార్డునే కాదు తలచుకుని ఉంటే టెస్టు క్రికెట్‌లో బ్రియాన్ లారా నెలకొల్పిన 400 పరుగుల ప్రపంచ రికార్డును సైతం అధిగమించి ఉండే వాడని టేలర్ అన్నాడు. కనీసం జింబాబ్వేపై 380 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌గా హేడన్ నెలకొల్పిన రికార్డునైనా అధిగమించి ఉండేవాడని, అయితే మ్యాచ్‌లో జట్టు విజయం సాధించడమే ముఖ్యమని భావించిన క్లార్క్ ఆ రికార్డులేవీ పట్టించుకోకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడని టేలర్ ప్రశంసించాడు.ఎస్‌సిజిలో చేసిన తొలి ట్రిపుల్ సెంచరీతోనే అనేక రికార్డులు బద్దలు కొట్టిన క్రికెటర్‌గా క్లార్క్ చరిత్ర సృష్టించినప్పటికీ అతని బ్యాట్‌కు స్పాన్సర్స్ ఎవరూ లేక పోవడం విశేషం. నాలుగు రోజుల ముందే డన్‌లప్ స్లేజెంజర్ క్లార్క్‌తో కుదుర్చుకున్న దీర్ఘకాలిక ఒప్పందంనుంచి వైదొలగింది

మున్సిపాలిటీలో వాహనాల కొనుగోలులో గోల్‌మాల్

 ప్రజల ముక్కు పిండి మరీ వసూలు చేసిన పన్నులను ఉద్యోగులు ఖజానాలో జమచేయకుండా, దిగమింగి జైలుపాలైన విషయం మరువకముందే పారిశుద్ధ్య పనులకు సంబంధించి వాహనాల కొనుగోలులో గోల్‌మాల్‌కు పాల్పడిన వ్యవహారం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. 12 ఆర్థిక సంఘం నిధుల కింద మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనుల కోసం హైడ్రాలిక్ తరహా వాహనాలు కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే అధికారులు నిబంధనలను తోసిరాజని.. రూ.20 లక్షల వ్యయంతో మహేంద్ర కంపెనీకి చెందిన మూడు ఆటోలు, ఒక టిప్పరును కొనుగోలు చేశారు. ఏడాది క్రితం ఈ వాహనాల కొనుగోలకు పాలకవర్గం ఆమోదం తెలపడంతో, రెండునెలల క్రితం అవి మున్సిపాలిటీకి చేరుకున్నాయి. వీటికి ఇప్పుడు మళ్లీ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి హైడ్రాలిక్ ఏర్పాటు చేయాల్సి ఉంది. లక్షలాది రూపాయలు కమీషన్ తీసుకుని వీటిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి.ఈ గోల్‌మాల్‌కు బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏదీ ఎమైనప్పటికీ మున్సిపాలిటిలో తవ్వేకొద్దే అవకతవకలు బయటికొస్తున్నాయి. అభివృద్థి పేరిట చేపట్టిన అన్ని పనుల్లో సంబంధిత అధికారులు అవకతవకలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళుతున్నాయి. మున్సిపాలిటీలోని అన్ని విభాగాల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. రియల్‌ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కైన కొందరు వ్యాపారులు జేబులు నింపుకుంటున్నట్లు సమాచారం. అవినీతి అధికారులను విధుల నుంచి శాశ్వతంగా తొల గించాలని ఇటీవలో హైకోర్టులో పిల్ దాఖాలు అయిన విషయం తెలిసిందే. గతంలో జరిగిన టెండర్లలో అనుమానాలు ఉన్నాయని, వృద్ధులకు, ఇతర పింఛన్ దారులకు న్యాయం జరగడంలేదన్న ఆరోపణలు హైకోర్టు దృష్టికి వెళ్లింది.

కడప జిల్లాకు రూ.62 కోట్లు మంజూరు

13వ ఆర్ధిక సంఘం ద్వారా జిల్లాకు 2012-13 సంవత్సరానికి రూ.62 కోట్లు మంజూరైనట్లు మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ మురళీకృష్ణగౌడ్ తెలిపారు. నగరపాలక సంస్థలోని కమిషనర్ ఛాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నిధులలో కడప కార్పొరేషన్‌కు రూ.6కోట్లు, ప్రొద్దుటూరుకు రూ.3 కోట్లు, పులివెందులకు కోటి, జమ్మలమడుగుకు రూ. 82 లక్షలు, రాజంపేటకు రూ. 77లక్షలు, రాయచోటికి రూ. 1.45 కోట్లు, బద్వేలుకు రూ.1.03 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.  కడప కార్పొరేషన్‌కు 76, ప్రొద్దుటూరుకు 27, బద్వేలుకు 41, జమ్మలమడుగుకు 37, పులివెందులకు 31, రాజంపేటకు 27, రాయచోటికి 41 పోస్టులు మంజూరయ్యాయన్నారు. వీటిని 50 శాతం పదోన్నతుల ద్వారా, 55 శాతం నియామకాల ద్వారా మూడు దశల్లో భర్తీ చేస్తామన్నారు. కడప కార్పొరేషన్‌లో మొత్తం 77,561 ఇళ్లు ఉండగా, అందులో 14,068 ఇళ్లకు మాత్రమే పన్నులు పెరిగాయన్నారు. అలాగే నాన్ రెసిడెన్షియల్‌కు సంబంధించి 9450 భవనాలకు గాను 3957 భవనాలకు పన్నులు పెరిగాయన్నారు. దీని ద్వారా రెసిడెన్షియల్‌లో 56 లక్షలు, నాన్ రెసిడెన్షియల్‌లో రూ.1.60 కోట్లు కార్పొరేషన్‌కు ఆదాయం వచ్చిందన్నారు. మొత్తమ్మీద కడపలో 23 శాతం మాత్రమే పన్నులు పెరిగాయన్నారు.

తన ట్విట్టర్లో రాసిన బిజినెస్ మేన్ సినిమా ఈ సారి రికార్డులు బద్దలు ..మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా బిజినెస్ మేన్ జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మహేష్ బాబు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. సినిమా ఈ సారి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంలా కనిపిస్తోంది ఆయన తన ట్విట్టర్లో రాసిన వ్యాఖ్యలు చూస్తుంటే. బిజినెస్ మేన్ సినిమా ఈ సారి బాక్సాఫీసును దున్నేస్తుందనే రేంజ్ లో మహేష్ బాబు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.నా అభిప్రాయం ప్రకారం ఈ సినిమా సూపర్ రిలీజ్, అంతా కలిసి త్వరలోనే పండగ చేసుకుంటాం, జగన్ గారికి స్పెషల్ థాంక్స్, ఆయన తీసిని సినిమాల్లోనే ఈ సినిమా టాప్ పొజిషన్ కు వెలుతుంది, ఆయన సినిమా ఇరగదీశాడు’ అంటూ మహేష్ బాబు తన ట్విట్టర్లో పేర్కొన్నారు.పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబు-కాజల్ జంటగా నటించారు. ఇందులో ఈ ఇద్దరి మధ్య ఘాటైన ముద్దు సీన్ కూడా ప్లాన్ చేశారు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. జనవరి 13న వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా చరిత్రలోనే రికార్డు స్థాయిలో 2000 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

పల్లెల నుంచి మద్యాన్ని తరిమేద్దాం...వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

రాష్ట్రంలోని ప్రతి పల్లెలోనూ మద్యం కారణంగా మహిళల జీవితాలు అన్యాయం అయిపోతున్నాయని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు తమ భర్తలను, బిడ్డలను అదుపు చేసుకోలేని విధంగా మానవత్వం లేని ప్రభుత్వం ఊరూరా మద్యం దుకాణాలు, సారా బట్టీలను నెలకొల్పిందని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్న నాయకుడే ప్రతినెల 15 శాతం తాగుబోతులను పెంచాలని లక్ష్యాలను నిర్ధేశించటం దుర్మార్గమన్నారు. మరోవైపు బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడు కూడా సరసమైన ధరలకు మద్యం అమ్మాలని డిమాండ్ చేయటం విడ్డూరంగా ఉందని జగన్ ఎద్దేవా చేశారు. త్వరలోనే స్వర్ణయుగం రాబోతుందని పల్లెల్లో సారా బట్టీలు, బ్రాందీ షాపులు లేని రాజ్యాన్ని నెలకొల్పుతామని  వైఎస్ జగన్ అన్నారు. మహిళల జీవితాలను నాశనం చేసే ఈ మద్యాన్ని గ్రామాల్లో నిషేధించేందుకు ప్రతి ఊర్లో మహిళా పోలీసింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రాణాలు పోసే 108ను ప్రభుత్వం మూలన పడేసిందని కల్తీసారా బాధితుల వద్దకు సకాలంలో చేరుకోక పోవటం వల్ల మృతుల సంఖ్య పెరిగిందన్నారు. మహానేత వైఎస్ఆర్ లేని లోటు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుందని త్వరలోనే ఈ సువర్ణయుగం రాబోతుందని అన్నారు.

త్వరలో రాజకీయాలలోకి వస్తా:బాలకృష్ణ

తాను త్వరలో ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తానని ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. పార్టీ తరపున ప్రచారం చేయడమే కాకుండా ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పారు. తెలంగాణపై పార్టీ వైఖరే తన వైఖరి అని ఆయన తెలిపారు.కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ తరపున ప్రచారం చేయడమే కాకుండా ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పారు.అధిష్టానం ఆదేశిస్తే ఏ ప్రాంతం నుంచైనా పోటీ చేస్తానని అన్నారు. ప్రత్యేక తెలంగాణపై పార్టీ వైఖరే తమ వైఖరని బాలకృష్ణ తెలిపారు. తమ కుమారుడు మోక్షజ్ఞ మరో నాలుగేళ్ళ తర్వాత సినీ రంగ ప్రవేశం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీవారీకి తలనీలాలు సమర్పించుకున్న అక్కినేని నాగార్జున

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం ప్రారంభ దర్శనంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించారు. ఈ సందర్భంగా నాగార్జున శ్రీనివాసునికి తలనీలాలు సమర్పించుకున్నారు. నాగార్జునతోపాటు అమల, అఖిల్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు.దర్శనం అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ 'రాజన్న' డిఫరెంట్ గా ఉందని...ఢమరుకం సినిమా మరింత ఆసక్తికరంగా ఉంటుందన్నారు. కాగా ఈరోజు తిరుమలకు వీఐపీల తాకిడి అధికంగా ఉంది. ఆనాటి హీరోయిన్ మీనా కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా అదే సమయంలో ముఖ్యమంత్రి రావడంతో మీనా ఇబ్బంది పడ్డారు. కొద్దిసేపు సామాన్య భక్తులతో ఉండిపోయారు