Tuesday, 17 January 2012

బాలయ్యపై పోటీపై పార్టీదే నిర్ణయం, చర్చిస్తాం...చంద్రబాబు నాయుడు


సినీ హీరో, తమ పార్టీ నాయకుడు బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం చెప్పారు. బాలయ్య పోటీపై పార్టీలో చర్చిస్తామని ఆయన అన్నారు. బాలయ్య పోటీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది. అయితే, బాలయ్య పార్లమెంటుకు పోటీ చేస్తారా, శాసనసభకు పోటీ చేస్తారా అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఏ విషయమైనా పార్టీలో చర్చిస్తామని, పార్టీ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని ఆయన అన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలకృష్ణ చెప్పిన విషయం తెలిసిందే. కాగా, మంగళవారం బాలయ్య పోటీ విషయంపై చంద్రబాబు మాట్లాడారు. బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. దీన్ని బట్టి పార్టీ నిర్ణయం పేర చంద్రబాబు తన నిర్ణయాన్ని బాలయ్యపై రుద్దబోతున్నట్లు చర్చ జరుగుతోంది. బాలకృష్ణను లోకసభకు పంపేందుకు చంద్రబాబు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాష్ట్రంలో స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల నుంచి తనకు పోటీ లేకుండా చూసుకోవడమే ఆయన ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు. నందమూరి హరికృష్ణను రాజ్యసభకు పంపించినట్లే, బాలకృష్ణను లోకసభకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. బాలకృష్ణను కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన అభిమానులు చూస్తున్నారు. శాసనసభకు ఆయనను పోటీకి దించే 2014 ఎన్నికల్లో పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి పదవికి పోటీ రావడం ఖాయమని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే, ముందే ఆయనను అడ్డం తొలగించుకోవాలనే ఎత్తుగడలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ నిర్ణయం పేర ఆయనను వచ్చే ఎన్నికల్లో లోకసభకు పోటీ చేయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా లోకసభకు పోటీ చేస్తే శాసనసభకు ఎక్కువ మందిని గెలిపించే అవకాశాలుంటాయని ఆయనకు నచ్చజెప్పే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఏమైనా, బాలకృష్ణ విషయంలో చంద్రబాబు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.సినీ హీరో, పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ రాజకీయ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి చేతిలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలకృష్ణ ప్రకటించినప్పటి నుంచి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై చర్చ జరుగుతోంది. తాజాగా, ఆయన లోకసభకు పోటీ చేస్తారా, శాసనసభకు పోటీ చేస్తారా అనే చర్చ ప్రారంభమైంది. ఈ చర్చను చంద్రబాబు నాయుడే ముందుకు తెచ్చినట్లు కనిపిస్తోంది. విజయవాడ లోకసభ స్థానం నుంచి కాంగ్రెసు నాయకుడు లగడపాటి రాజగోపాల్‌పై బాలకృష్ణ పోటీ చేస్తే బాగుంటుందని తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి మొత్తం వ్యవహారానికి ఓ మలుపు ఇచ్చాడు. రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడే ఆ మాటలు అనిపించినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. బాలకృష్ణ ప్రతిస్పందన, పార్టీ ఇతర నాయకుల ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది చంద్రబాబు చూడదలుచుకున్నట్లు భావిస్తున్నారు.

పరిటాల హత్యకు హోంమంత్రి ఫాం హౌస్ లో కుట్ర...మంత్రి శంకరరావు

ప్రస్తుత హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఫాం హౌస్ నుండే దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవీంద్ర హత్యకు కుట్ర జరిగిందని ఆరోపిస్తూ చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకరరావు మంగళవారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఆయన సోనియాకు ఎనిమిది పేజీల లేఖ రాసి ఫ్యాక్స్ చేశారు. అందులో ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరిటాల హత్యకు కుట్ర సబితా ఫాం హౌస్ నుండే జరిగిందన్నారు. సబిత తనయుడు కార్తీక్ రెడ్డి భూఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనపై దాడి జరిగి నెల రోజులు దాటినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించక పోవడం బాధాకరమన్నారు. దాడికి కారకులపై సబితా రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన సోనియాకు విజ్ఞప్తి చేశారు.కార్తీక్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. బడుగు, బలహీన వర్గాలను దూరం చేసుకోవడం పార్టీకి సబబు కాదని లేఖలో అధినేత్రికి విజ్ఞప్తి చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి పాలనలోనూ అవినీతి కొనసాగుతోందని అందులో పేర్కొన్నారు. పాలనపై అధిష్టానం ఐబి రిపోర్టు తెప్పించుకోవాలని సూచించారు. అవసరమైతే కిరణ్ కుమార్ రెడ్డిని సిఎంగా తప్పించాలన్నారు.

రాయలసీమలో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి



హిందువుల పండుగల్లో మొట్టమొదటి పండుగ సంక్రాంతి. ఈ పండుగకు ఎంత దూరంలో ఉన్నప్పటికీ తప్పనిసరిగా స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో, గ్రామస్థులతో కలిసి సంక్రాంతి పండుగ చేసుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు పట్టణాల్లో చదువుతున్న యువకులు, ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులు, వ్యాపారులు ప్రతి ఒక్కరూ గ్రామాలకు చేరుకున్నారు. దీంతో పట్టణాలన్నీ ఖాళీ అయ్యాయి. ఏ పల్లెలో చూసినా వాహనాలతో కొత్త కొత్త వ్యక్తులతో కనిపించాయి. గ్రామానికి చేరుకున్న కొత్తవ్యక్తులు, పల్లెకు చెందిన వారు గ్రామంలో ఉండే రైతులను పలకరించడం, కలిసి మెలిసి సంక్రాంతి పండుగను చేసుకున్నారు. అయితే రైతును ఏమాత్రం కదిలించినా కష్టాలను దిగమింగుతూ వారికి తమ కష్టం ఎందుకు చెప్పుకోవాలన్న ఆలోచనతో చిరునవ్వుతో వారిని పలకరించడం, వచ్చిన బంధువులను, స్నేహితులకు, అల్లుళ్లు, ఆడ బిడ్డలకు ఎక్కడా ఏలోటు రాకుండా చూసుకోవాలన్న తాపత్రయం ప్రతి ఒక్కరిలో కనపడింది. తమ కష్టాలు ఎన్నిఉన్నా వారు వచ్చేది సంవత్సరానికి ఒకమారే కదా, వచ్చినపుడువారికి తమ కష్టాలను చూపడం భావ్యం కాదన్న విధంగా సంతోషంగా పండుగను జరుపుకోవాలన్న సదుద్దేశంతో కలిసి మెలిసి సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. అయితే పండుగకు కావాల్సిన నిత్యావసర సరుకులు ధరల పోటు ఆకాశాన్ని అంటినా కొనుగోలుచేయక తప్పలేదు. ఆరేడు సంవత్సరాలుగా వరుస కరవులతో సంక్రాంతి పండుగ కాలక్రమేణా ఆనవాయితీగా చేస్తున్న కార్యక్రమాలు చేయడం తప్ప పండుగలో పూర్తి కార్యక్రమాలు చేయలేకపోతున్నారు. పండుగ వచ్చింది ఏదో చేసుకోవాలా, నలుగురితో నారాయణ అన్న చందంగా చేయడమేతప్ప మనస్ఫూర్తిగా రైతు లు ఈ పండుగను జరుపుకోలేకపోతున్నారు. కారణం ప్రభుత్వ వైఫల్యం, ప్రకృతి కనికరించకపోవడం రైతులను ప్రతియేడు నష్టాలలోకి నెట్టేస్తోంది. గతంలో సంక్రాంతి పండుగ అంటే గ్రామ సీమలు కళకళలాడుతుండేవి. పారుతున్న సెలయేర్లు, పక్షుల రాగాలతో, పచ్చని పైర్లతో రైతన్న ముఖంలో ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. పండించిన ధాన్యం రాసులుపోసి ఎటువెళ్లినా రైతన్నకు ఆప్యాయత, అనురాగాలు చూపించేవారు. ప్రస్తుతం అదే రైతన్న బజారులోకి అప్పుకోసం వెళితే గతంలో పిలిచి అప్పు ఇచ్చే ఆసాములు నేడు ముఖం చాటుచేసుకుని వెళ్తున్నారు

రాయలసీమ జిల్లాలో వణికిస్తున్న చలిపులి



ఎన్నడూ లేనంతగా చలి ప్రజలను గజ గజ వణికిస్తోంది. దీనితో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 7గంటలైనా సూర్యుని కిరణాలు బయటకు పడని పరిస్థితి ఉంది. ఉదయం పూట మంచు కప్పేసి ఉండడంతో చలితో జనం వణికిపోతున్నారు. నాలుగురోజుల్లోనే వాతావరణంలో వచ్చిన మార్పులతో చలి పెరిగింది. ఉదయం ఏడుగంటలైనప్పటికీ ఇళ్లలో నుంచి జనం బయటకురాని పరిస్థితి ఉంది. ఇలాంటి చలిని గత 60 సంవత్సరాల కాలంలో ఎప్పుడు చూడలేదని ప్రజలు స్పష్టం చేశారు. సాయంత్రం 5గంటల ప్రాంతంలో చలి పెరిగిపోతోంది. రాత్రి 9గంటల తరువాత వరకూ లావాదేవీలు సాగించే వాణిజ్య వ్యాపార సంస్థలు 8 గంటలకే మూతపడుతున్నాయి. వృద్ధులు చలివలన అనారోగ్యం పాలవుతున్నారు. చిన్నపిల్లలు కూడ చలి వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆస్మాతో బాధపడే ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఉదయం పూట మంచు కురుస్తుండడంతో దైనందిన కార్యక్రమాలు ఆలస్యంగా మొదలవుతున్నాయి. దుకాణాల వద్ద, రైల్వేస్టేషన్లలో, బస్టాండులలో నిద్రించే భిక్షగాళ్ల పరిస్థితి దారుణంగా మారిపోయింది. భిక్షగాళ్లు నిర్మాణంలో ఉన్న భవనాల్లో పడుకొనే పరిస్థితి ఏర్పడింది. చలి దెబ్బకు ఉదయం, సాయంత్రం కూడా బయట జనం సంచారం తగ్గిపోయింది. ఉదయం, సాయంత్రం వాకింగులు, జాగింగ్‌లు బందయ్యాయి.

బ్యాటింగ్ వైఫల్యమే...కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని


ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా మూడు టెస్టుల్లో ఘోర పరాజయాలను ఎదుర్కొన్న మహేంద్ర సింగ్ ధోనీ సేన అడిలైడ్‌లో జరిగే నాలుగవ టెస్టులోనూ కంగారూల చేతిలో ఓటమిపాలైతే చరిత్రలో భారత జట్టు మరోసారి అత్యంత హీనమైన దశకు చేరుకుంటుంది. గత ఏడాది వేసవి కాలంలో ఇంగ్లాండ్‌లో పర్యటించిన ధోనీ నేతృత్వంలోని టీమిండియా మొత్తం నాలుగు టెస్టుల్లోనూ ఓటమిచెంది ‘వైట్‌వాష్’తో స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం విదితమే. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మూడు టెస్టుల్లోనూ భారత జట్టు ఘోర పరాజయాలను మూటగట్టుకోవడంతో విదేశాల్లో వరుసగా ఏడు టెస్టు మ్యాచ్‌లలో ధోనీ సేన ఓటమి చెందినట్టయింది. దీంతో భారత క్రికెట్ చరిత్రలో టీమిండియా అత్యంత హీనమైన రెండో దశలో కొనసాగుతోంది. భారత జట్టు పరాజయాల పరంపరకు తగినన్ని పరుగులు చేయలేకపోవడమే కారణమని ధోనీ అంగీకరించాడు. 'ఇంగ్లండ్‌తో సిరీస్ నుంచి పెర్త్ టెస్ట్‌లో పరాజయం వరకు మేం తగినంత స్కోరు ప్రత్యర్థి ముందు ఉంచలేకపో యాం. ఓటమికి అదే కారణం. బ్యాట్స్‌మెన్ రాణించి భారీస్కోరు సాధిస్తే బౌలర్ల పని తేలికవుతుంది.టెస్టు ల్లో ఒకటి లేదా రెండు చెత్త ప్రదర్శనలంటే సాధారణం అనుకోవచ్చు. కానీ, విదేశాల్లో మేమాడిన ఏడు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమయ్యాం. ఇంత చెత్త ప్రదర్శన నా కెరీర్‌లో ఇంతవరకూ చూడలేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే బౌలింగ్ విభాగం నుంచి ఆందోళన లేదు కానీ, బ్యాట్స్‌మెన్‌లోనే నిలకడ లోపించింద'ని ధోనీ వ్యాఖ్యానించాడు. విదేశీ గడ్డపై చెత్త ప్రదర్శనకు తానే ప్రధాన కారణమంటున్నాడు టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ. కెప్టెన్‌గా ఈ పరాజయాలకు ప్రధాన దోషి ని నేనేనంటూ తనను తాను నిందించుకుంటున్నాడు. 'ఓటమికి ఏ ఒక్కరినో బా ధ్యులను చేయలేం. నాయకుడిగా ఈ పరాభవాలకు ప్రధాన దోషిని నేనే'.. ఆతి థ్య ఆస్ట్రేలియా చేతిలో వరుసగా మూడో టెస్టులోనూ ఘోర పరాజయం చవిచూసిన అనంతరం ధోనీ చేసిన వ్యాఖ్యలివి.మిస్టర్ కూల్ కెప్టెన్‌గా, వ్యూహ చతురతలో దిట్టగా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న మహీ తాజా ఓటములతో తీవ్ర నిరాశలో కూరుకుపోయా డు. అయినప్పటికీ ఇంగ్లండ్ సిరీస్ నుంచి వరుసగా విఫలమవుతున్న సీనియర్లను వెనకేసుకొస్తున్నాడు. ఇక సీనియర్లను సాగనంపుతా రా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. 'సీనియర్లను తొలగించాలనేది చాలా కీలకమైన నిర్ణ యం. వారి అనుభవం యువకులకు అవస రం. అయితే సీనియర్లపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేద'ని అన్నాడు.