Friday, 9 December 2011

పంజా సినిమా రివ్యూ

పంజా’ ట్రైలర్స్ చూసినప్పుడు.. ఆ కథ గురించి చూచాయిగా తెలుసుకున్నపుడు… ఇదేంటి.. బాలు సినిమా లాగే అనిపిస్తోంది.. కొంపదీసి ఆ సినిమానే కొంచెం మార్చి మళ్లీ తీయలేదు కదా అన్న అనుమానం.. కానీ విష్ణువర్ధన్ గురించి తెలిసి, అతనలా చేయడులే.. తనదంటూ ఓ ముద్ర వేస్తాడులే అన్న ధీమా! కానీ సినిమా చూశాక అనుమానం నిజమైంది.. భయపడిందే జరిగింది.. బాలును జైగా మార్చి.. విష్ణు పవర్ లేని “పంజా” విసిరాడు. సింపుల్ గా చెప్పాలంటే పంజా.. బాలు సినిమాకి మోడర్న్ వెర్షన్. బాలు సినిమాని ఇంకాస్త స్టైలిష్ గా, ఇంకాస్త మోడర్న్ గా, ఇంకాస్త రిచ్ గా తీస్తే పంజా అయింది. అంతే.. మరే ప్రత్యేకతా లేదీ సినిమాలో!
ముందుగా కథ గురించి చెప్పకుందాం..
కోల్ కత నేపథ్యంగా సాగే మాఫియా కథ ఇది. బాలులో లాగే ఇందులోనూ హీరో ఓ మాఫియా డాన్ కు కుడిభుజం. అతని పేరు జై (పవన్ కళ్యాణ్). డాన్ పేరు భగవాన్ (జాకీష్రాఫ్). తన చిన్నతనంలో భగవాన్ చేసిన సహాయాన్ని కృతజ్ఞతగా అతనికి అన్ని పనులూ చేసిపెడుతుంటాడు. ఐతే భగవాన్ కొడుకు మున్నా (అడివి శేష్) విదేశాల నుంచి రావడంతో ఓ సమస్య తలెత్తుతుంది. మున్నా ఓ శాడిస్టు. అతనికి జాహ్నవి (అంజలి లావనియా) అంటే పిచ్చి. కానీ జాహ్నవికి జై అంటే ఇష్టం. ఇదిలా ఉండగా భగవాన్ దగ్గర పనిచేసే సభా (పరుచూరి వెంకటేశ్వరరావు)ను మున్నా అవమానించడంతో అతను ప్రత్యర్థి గ్యాంగ్ లోకి వెళ్లిపోతాడు. సభాను తీసుకొచ్చేందుకు వెళ్లూ జై.. ప్రత్యర్థి గ్యాంగ్ కు చెందిన కుర్రాడిని తీసుకొచ్చి తన గ్యాంగ్ లో వదిలేసి వెళ్తాడు. అతణ్ని మున్నా ఆవేశంలో చంపేస్తాడు. అంతటితో ఊరుకోకుండా జాహ్నవి.. జైని ప్రేమిస్తోందని తెలిసి, ఆమెనూ చంపేస్తాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన జై.. మున్నా ప్రాణాలు తీస్తాడు. కొడుకంటే ప్రాణమైన భగవాన్.. జైపై పగ పెంచుకుంటాడు. అప్పటికే సంధ్య (సారాజేన్ డయాస్)ను ప్రేమించిన జై.. ఆమె కోసం కోల్ కత వదిలి వచ్చేస్తాడు. ఆ తర్వాత జై కోసం భగవాన్ వేట ఎలా సాగింది. చివరికి జై ఏం చేశాడు.. అన్నది మిగిలిన కథ.
కథ చెప్పగానే అర్థమై ఉంటుంది… ఇది బాలుకు భిన్నంగా ఏం లేదని.. ఐతే అక్కడ హీరోయిన్ కోసం హీరో.. తన యజమానికి ఎదురుతిరిగితే.. ఇక్కడే తనంతట తానే సమస్యలో చిక్కుకుంటాడు. పోనీ సన్నివేశాలైనా భిన్నంగా ఉన్నాయా అంటే అదీ లేదు.. హీరో ఇంట్రడక్షన్ సీన్ నుంచి అతని లవ్ స్టోరీ.. తర్వాత అతను సమస్యలో చిక్కుకునే సన్నివేశాలు.. చివరికి క్లయిమాక్స్ కూడా ఇదివరకు చాలా సినిమాల్లో చూసినవే. ఫస్టాఫ్ రొటీనే అయినా కొన్ని వేగంగా సాగడం, టేకింగ్ స్టయిలిష్ గా ఉండటం.. కథ కొన్ని మలుపులు తీసుకోవడం.. పర్వాలేదనిపిస్తుంది. కానీ ద్వితీయార్ధంలో కథను క్లయిమాక్స్ కు చేర్చడానికి దర్శకుడు అనవసర, బోరింగ్ సన్నివేశాలతో నింపేయడంతో సినిమా మీద ఇంప్రెషన్ క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. సెకండాఫ్ లో ఏదైనా రిలీఫ్ ఇచ్చింది అంటే అది బ్రహ్మానందం-పాపారాయుడు పాటే. ఈ పాట అనుకున్న దానికంటే ఎంటర్టయినింగ్ గా సాగింది. ఈ పాటలో హావభావాలతో బాగా నవ్వించిన బ్రహ్మానందం మిగతా సన్నివేశాల్లో మాత్రం విఫలమయ్యాడు. అందుకు బాధ్యత దర్శకుడు, మాటల రచయితలదే. సినిమాకు థీమ్ గా వాడుకున్న ”సాయం పొందిన వాడు కృతజ్ఞత చూపకపోవడం ఎంత తప్పో.. సాయం చేసిన వాడు కృతజ్ఞత ఆశించడం కూడా అంతే తప్పు” డైలాగ్ సూపర్బ్. కానీ నిజానికీ డైలాగ్ సినిమాకు ఎందుకు అవసరమైందో అర్థం కాలేదు. టైటిల్స్ కు ముందే పడే ఈ డైలాగ్ సినిమా ఉద్దేశాన్నేం చాటదు. మంచి డైలాగ్ రాస్తే సరిపోదు. అది సినిమాకు ఉపయోగమా కాదా అని కూడా చూడాలి. అబ్బూరి రవి మాటలు కొన్ని చోట్ల మాత్రమే పేలాయి.అంజలి తన శక్తిమేరకు ఎక్స్ పోజింగ్ చేసింది.
కథ, కథనాల్లో ఏ కొత్తదనం చూపలేకపోయిన విష్ణు.. ఓ విషయంలో మాత్రం అవసరం లేని క్రియేటివిటీ చూపాడు. సినిమాలో అత్యంత ఆకర్షణీయమైన పంజా టైటిల్ సాంగ్ ను సినిమా ముగిశాక, జనాలు థియేటర్లు ఖాళీ చేశాక వచ్చేలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. మరో మంచి పాట “అనుకోనే లేదుగా” పల్లవికి పరిమితం చేసేయాలన్న ఆలోచన అతనికెలా వచ్చిందో.. అంజలి లావనియా అందాలు ఆరబోసిన వెయ్ రా చెయ్ వెయ్ రా పాటను కూడా పూర్తిగా ఆస్వాదించకుండా మధ్యలోనే బ్రేక్ చేశాడు. దీనివల్ల యువన్ మంచి మ్యూజిక్ ను సినిమాకు ఉపయోగపడకుండా చేశాడు. ఐతే బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాకు పెద్ద ప్లస్ అయింది. పి.ఎస్.వినోద్ ఫొటోగ్రఫీ సినిమా స్థాయికి మించి ఉంది. అతను ఎంచుకున్న థీమ్స్, లైటింగ్ సూపర్బ్. ఇందులో విష్ణు అభిరుచి కూడా తోడైంది. ఇవే కాదు.. టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ అన్నీ మంచి ఔట్ పుట్ ఇచ్చాయి. యాక్షన్ సీక్వెన్స్ అన్నీ హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి. లొకేషన్స్ కూడా డిఫరెంట్ గా ఎంచుకున్నారు. ఐతే కొసరంతా బాగానే ఉంది. అసలే లేదు. సన్నివేశాల్లో బలం లేక ఈ అదనపు ఆకర్షణల్నీ చాలావరకు ఉపయోగం లేకుండా పోయాయి
ఐతే స్టయిలిష్ డైరెక్టర్ అన్న ముద్రతో వచ్చిన విష్ణు.. కేవలం సన్నివేశాల్ని స్టయిలిష్ గా తీయడంపై మాత్రమే దృష్టిపెట్టాడు. కథ, కథనాల గురించి మరిచిపోయి కేవలం టేకింగ్ ను, టెక్నికల్ విషయాల్ని మాత్రమే పట్టించుకుంటే ఎలా మంచి సినిమా వస్తుందని విష్ణు అనుకున్నాడో. పవన్ సినిమాలన్నీ చూశానని చెప్పిన విష్ణు.. బాలు సినిమాను మాత్రం చాలా ఎక్కువసార్లు చూసినట్లున్నాడు. దీన్ని తన స్టైల్లో తీసి హిట్ చేద్దామనుకున్నాడో ఏమో.. “పవన్ నా పనిలో జోక్యం చేసుకోలేదు.. ఐతే ఏది ఎందుకు అని మాత్రం అడిగాడు” అని చెప్పాడు విష్ణు. ఐతే.. ఇదేంటి నాతో మళ్లీ బాలు క్యారెక్టర్ వేయిస్తున్నావు నాతో అని.. పవన్ విష్ణును అడగలేదా?
సినిమా మొత్తం తుపాకులతో ఒకరినొకరు కాల్చుకోవడం.. బ్లాస్ట్ లు ఇవే సన్నివేశాలు.. పదుల సంఖ్యలో తుపాకులతో తనను కాలుస్తున్నా సింపుల్ గా తప్పించుకునే హీరో గురి కూడా చూడకుండా లెక్కలేనంతమందిని కాల్చి పారేస్తుంటాడు. చెప్పుకోవడానికి, గుర్తు పెట్టుకోవడానికి ఒక్కటంటే ఒక్క క్యారెక్టరూ లేదు. పవన్ కళ్యాణ్ గెటప్, మారింది కానీ ఇప్పటికే చూసిన క్యారెక్టరే కదా. ఐతే తన వరకు అభిమానుల్ని అలరించడానికి పవన్ శాయశక్తులా ప్రయత్నించాడు. సీరియస్ క్యారెక్టర్ తోనూ ఎంటర్టయిన్ చేసేందుకు కృషి చేశాడు. ఇక ఏ మాత్రం ప్రత్యేకత లేని ఆ విలన్ పాత్రలకి జాకీష్రాఫ్, అతుల్ కులకర్ణిలే కావాలా? చాలా పరిమితులున్న పాత్రల్లో వాళ్లు చేసిందేమీ కూడా లేదు. అడివి శేష్ వేసిన శాడిస్ట్ క్యారెక్టర్ కాస్త ఆసక్తి కలిగించిన అతనేం చేయబోతున్నాడని ముందే అర్థమైపోతుంది. శాడిస్టు క్యారెక్టర్ని నెమ్మదిగా బిల్డప్ చేసి, ఇంటెన్సిటీ పెంచుతూ తర్వాత శాడిజం చూపిస్తే ప్రేక్షకులు థ్రిల్లవుతారు కానీ.. తొలి సన్నివేశం నుంచే అతనో పరమ శాడిస్టన్న విషయాన్ని చూపించేస్తే ప్రేక్షకులకు ఏం ఆసక్తి ఉంటుంది? జై సభాను తీసుకురావడానికి వెళ్లేటపుడు తర్వాత ఏం జరగబోతోందన్నది అర్థమైపోతుంది. తనికెళ్ల భరణిని సరిగా వాడుకోలేదు. బాలు, భగవాన్ ల మధ్య శతృత్వం పెంచేది అతనేనన్న విషయాన్ని చివరి వరకు దాచిపెట్టి, రివీల్ చేస్తే ప్రేక్షకులు సస్పెన్స్ ఫీలయ్యేవారేమో. పరుచూరి వెంకటేశ్వరరావు ఉన్న నాలుగు సన్నివేశాల్లో చాలా బాగా చేశారు. ప్రధాన హీరోయిన్ సారాజేన్ ఏమంత అందంగా లేదు. ఆమె నటన ఓకే. మరో .

మహేష్ నటన గురించి... వెంకటేష్ కామెంట్

తెరపై చాలా అందంగా కనిపించే హీరోల్లో మహేష్ ఒకడు. అతను చక్కని పర్ఫార్మర్. అతని కామెడీ టైమింగ్ కానీ, డైలాగ్ డిక్షన్ కానీ మిగతా హీరోలతో పోలిస్తే భిన్నం. నా దృష్టిలో ఆల్‌రౌండ్ యాక్టర్. అతనితో కలిసి పనిచేస్తుండటం వెరీ హ్యాపీ అంటూ మహేష్ ని పొగడ్తల్లో ముంచెత్తారు వెంకటేష్. అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' షూటింగ్‌లో ఈ నెల 16 నుంచి తాను వెంకటేష్ పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా మహేష్ గురించి మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే చిత్రం కథ గురించి చెప్తూ..ఇద్దరు సోదరుల జీవన ప్రయాణం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అన్నారు. అలాగే కొంత కాలం నుంచి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నేను ఆ సబ్జెక్టుపై కలిసి చర్చించుకుంటూ ఉన్నాం. కమర్షియల్ అంశాలన్నీ బాగా కుదిరిన ఫ్యామిలీ డ్రామా ఈ చిత్రం. మహేష్, నేను ఈ సినిమాలో చేయడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇద్దరం ఈ సినిమా గురించి మాట్లాడుకున్నాం. సబ్జెక్టు విషయంలో, మా పాత్రల విషయంలో చాలా సంతోషంగా ఉన్నాం. కాగా ఈ సినిమా షూటింగ్‌లో మహేష్ జనవరి నుంచి పాల్గొననున్నారు అని చెప్పుకొచ్చారు.

శోభా నాగి రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు...చిరంజీవి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డిపై స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు ప్రజారాజ్యం పార్టీ ఫిర్యాదు చేసింది. చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం విప్ వంగా గీత శుక్రవారం సాయంత్రం స్పీకర్‌కు శోభా నాగిరెడ్డి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సమయంలో పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఆమె ఓటు వేసిన విషయం తెలిసిందే. అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ జారీ చేసినప్పటికీ ఆమె మాత్రం అనుకూలంగానే ఓటు వేశారు. దీంతో తీవ్ర తర్జన భర్జన అనంతరం చిరు ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించుకున్నారు.2009 ఎన్నికల సమయంలో ఆళ్లగడ్డ పిఆర్పీ వర్గాలు శోభకు టిక్కెట్ వ్యతిరేకించినప్పటికీ చిరంజీవి ఇచ్చారని సమాచారం. ఇప్పుడు ఆమె తీరు చూసి చిరంజీవి ఆవేదన చెందుతున్నారట. మిగిలిన ఎమ్మెల్యేలంతా తనతో ఉంటున్నారు. కానీ కేడర్ వద్దంటున్నా టిక్కెట్ ఇచ్చి గెలిపించిన ఆమె వైఖరితో మాత్రం చిరంజీవిని ఆగ్రహానికి గురి చేస్తుందట

10వతేదీన శ్రీవారి ఆలయం మూసివేత

తిరుమలలో ఈనెల 10వతేదీన చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 10.30 గంటల వరకు మూసి వేయనున్నట్లు టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 10వతేది ఉదయం 6 గంటలపై భక్తులను వైకుంఠం -2లో అనుమతిస్తామని తెలిపారు. అలాగే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేస్తామన్నారు. అలాగే పౌర్ణమి రోజున చంద్రగ్రహణం వస్తుండటంతో గరుడ సేవను రద్దు చేశామన్నారు. అయితే సుప్రభాత సేవకు యథావిధిగా భక్తులను అనుమతిస్తామన్నారు. ఇక చంద్రగ్రహణం వీడిన తరువాత రాత్రి 10.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి పుణ్యాహవచనం, శుద్ది, కైంకర్యాలు ఇత్యాది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. రాత్రి 11.30 గంటలకు శాస్త్రోక్తంగా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. అలాగే 11వతేది ఉదయం స్వామివారికి నిర్వహించే తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించి అనంతరం భక్తులను అనుమతిస్తామన్నారు. ఇక అన్నదానంలో 10వతేది ఉదయం 7 గంటల నుండి ఉదయం 11.30 గంటల వరకు మాత్రమే అన్నప్రసాద వితరణ వుంటుందని, అటు తరువాత ఉచిత అన్నదాన కాంప్లెక్స్‌ను మూసివేస్తామని తెలిపారు. డిసెంబర్ 11వతేది ఉదయం 9.30 గంటల నుండి యధావిధిగా అన్నప్రసాద వితరణ జరుగుతుందని, భక్తులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఆన్‌లైన్ కష్టాలు

2011-12 విద్యా సంవత్సరానికి సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయా కళాశాలల విద్యార్థులు దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాల్సి రావడం, ఈ ప్రక్రియలో సాంకేతిక లోపం తలెత్తడంతో విద్యార్థులు ఆన్‌లైన్ కష్టాలు ఎదుర్కొంటున్నారు.దరఖాస్తుల స్వీకరణకు గతనెలాఖరు వరకే గడువు ఇచ్చినా ఈనెల 15 వరకు పొడిగించారు. అయినప్పటికీ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో న మోదు కాకపోవడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. కోవెలకుంట్ల డివిజన్ లో ఐదు ప్రభుత్వ, రెండు ప్రైవేట్ జూని యర్ కళాశాలలు ఉన్నాయి. విద్యార్థి అడ్మిషన్ ఆధారంగా దరఖాస్తును ఆన్‌లైన్ ద్వారా పంపాల్సి ఉంది. అడ్మిషన్ నంబ ర్లు నమోదు చేయగా ఆ దరఖాస్తును ఆన్‌లైన్ స్వీకరించడంలేదని కొందరు విద్యార్థులు వాపోతున్నారు.ప్రభుత్వ జూనియ ర్ కళాశాలలో మొదటి సంవత్సరం సీఈ సీ చదువుతున్న మహమ్మద్ అనే విద్యార్థి 8422 అడ్మిషన్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో న మోదు చేయగా ఈ నంబరుకు సంబంధించిన కళాశాల ఉపకార వేతనాల జాబి తాలోలేదని, మరోసారి చెక్ చేసుకోవాలని సూచిస్తోంది. ఇదే కళాశాలలో మల్టీ పర్పర్స్ హెల్త్ వర్కర్స్(ఎంపీహెచ్‌డబ్ల్యు) కోర్సు చేస్తున్న 15మంది విద్యార్థినుల అడ్మిషన్ నంబర్లు నమోదు చేయగా కళాశాల పేరే చూపించకపోవడం గమనార్హం. కోవెలకుంట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే వివిధ గ్రూపులకు సంబంధించి 60మంది విద్యార్థుల దరఖాస్తులు రిజిస్టర్ కానట్లు తెలుస్తోంది. మిగతా కళాశాలల్లో కూడా ఎక్కువ మంది విద్యార్థుల దరఖాస్తులను స్వీకరించకపోవడం, గడు వు దగ్గర పడుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు ఈ ఏడాది విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలోనే స్టేట్ బ్యాంకు అకౌంట్ నంబర్‌ను జత చేయాలని చెప్పడంతో ఒకేసారి అంత మంది విద్యార్థులకు బ్యాంకు అధికారులు ఖాతాలు ప్రారంభించేందుకు నిరాకరించడంతో విద్యార్థులు గత నెలలో అకౌంట్ల కోసం వారం రోజులపాటు క్లాసులు వదులుకుని బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం పడరానిపాట్లు పడ్డారు. తీరా సర్టిఫికెట్లన్నీ సమకూర్చుకోగా ఆన్‌లైన్ మొరాయించడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. సంబంధిత అధికారులు ఆన్‌లైన్‌లో నెలకొన్న సాంకేతిక లోపాన్ని వెంటనే సరిచేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఒక అమ్మాయి కోసం ఇద్దరు విద్యార్థులు ఘర్షణ

ఒక అమ్మాయి కోసం ఇద్దరు విద్యార్థులు ఘర్షణ పడ్డారు. అంతటితో ఆగకుండా గురువారం బయటి వ్యక్తులను కళాశాల ఆవరణలోకి తీసుకొచ్చారు. విద్యార్థులందరూ ఏకమై వారిని చితకబాది పంపారు. చంద్రగిరి పాలిటెక్నిక్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐరాల మండలం కాణిపాకంకు చెందిన సంతోష్ చంద్రగిరి రెడ్డివీధిలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. పాకాలకు చెందిన కేశవులు కూడా ఇక్కడే చదువుతున్నాడు. ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు అదే కళాశాలలోని ఒక అమ్మాయిపై ప్రేమ పెంచుకున్నారు. ఆ అమ్మాయి మాత్రం ఇద్దర్నీ పట్టించుకునేది కాదు. మూడు రోజుల క్రితం ‘ఆ అమ్మాయి నీ వల్ల నాతో మాట్లాడడం లేదంటే కాదు నీ వల్లే అంటూ’ సంతోష్, కేశవులు చిన్నపాటి ఘర్షణ పడ్డారు. సంతోష్‌ను ఎలాగైనా కొట్టాలని నిర్ణయించుకున్న కేశవులు స్నేహితులు లీలాకృష్ణ, ఫరీన్‌లను వెంటబెట్టుకుని పాకాల మండలం సామిరెడ్డిపల్లికి వెళ్లి నానిరెడ్డి, రెడ్డిప్రసాద్, హరీష్, మహేష్‌లను కలుసుకున్నారు. విషయం చెప్పి తమకు సహాయం కోరారు. గురువారం ఉదయం 11 గంటలకు సంతోష్‌పై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. లీలాకృష్ణ, ఫరీన్, కేశవులు యథావిధిగా కళాశాలకు వచ్చారు. సామిరెడ్డిపల్లికి చెందిన నలుగురు యువకులు సంతోష్‌పై కర్రలతో దాడికి దిగారు. విషయం గమనించిన కళాశాల విద్యార్థులు సంతోష్‌కు అండగా నిలి చారు. ఆ నలుగురు యువకులను పట్టుకుని చితకబాదారు. కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. కానిస్టేబుళ్లు  వెంటనే అక్కడకు చేరుకుని ఆ నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనను కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రమ తీవ్రంగా పరిగణించారు.

ప్రజల వద్దకే బ్యాంకు సేవలు

గామీణ ప్రాంతాల ప్రజల వద్దకే బ్యాం కింగ్ సేవలందిస్తామని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆర్ఎం మహ్మద్‌ఖాన్ పేర్కొన్నారు. బ్యాంకింగ్ సేవలందించడానికి ఎంపిక చేసిన బిజినెస్ కరెస్పాండెంట్లకు శిక్షణా తరగతులను స్థానిక కార్యాలయంలో నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా పాలొ ్గని మాట్లాడారు. గ్రామస్థాయిలో ప్రజల ముంగిటకు బ్యాంకు సేవలిందిం చేం దుకు చర్యలు చేపట్టామన్నారు. హెచ్‌సీఎల్ కంపెనీ భాగస్వామ్యంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. సేవ లు అందించేందుకు బిజినెస్ కరస్పాండెంట్లుగా మంచి యువకులను ఎంపిక చేశామన్నారు. చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు మంచిగా సేవలందించి బ్యాంకుకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూ చించారు. ఇంతవరకు ఏ బ్యాంకు నుం చి రుణా పొందకుండా.. ఎలాంటి బకాయిలు లేనివారు ఉంటే నిబంధనల మేరకు రుణాలు అందిస్తామన్నారు. రైతులు, కౌలు రైతులు ఇతర వృత్తుల వారికి అర్హతనుబట్టి రుణాలిస్తామన్నా రు. ఈనెల 15 వరకు ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని, అర్హులందరూ సద్వినియోగం చేసుకోవచ్చ న్నారు.