Saturday, 3 December 2011

రజనీకాంత్ చెల్లెలుగా స్నేహ

అందాల ముద్దుగుమ్మ స్నేహ తమిళంలో రజనీకాంత్ చెల్లెలుగా నటించనుంది.  రజనీకాంత్ కథానాయకుడిగా ఆయన తనయ సౌందర్య దర్శకత్వంలో ‘కొచ్త్చెదయన్’ పేరుతో ఓ త్రీడీ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో రజనీ చెల్లెలిగా నటించడానికి స్నేహను ఎంపికచేశారు.
ఈ విషయమై స్నేహ స్పందిస్తూ ‘నా స్వప్నం సాకారమవబోతోంది. రజనీ సర్‌తో నటించాలన్న నా కల నెరవేరుతుంది. ఈ చిత్రంలో నాది చిన్న పాత్రేం కాదు అని ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇటీవలే తమిళ నటుడు ప్రసన్నతో ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టిన ఈ భామ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి తరువాత హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ నటిగా నటించేందుకే స్నేహ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే రజనీకాంత్ చెల్లెలు పాత్రకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది

ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి?

సొంత గూటికి చేరేందుకు ముగ్గురు తెలుగుదేశం తిరుగుబాటు శాసనసభ్యులు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు వారు తెలుగుదేశం వర్గాలకు సంకేతాలు పంపినట్లు చెబుతున్నారు. తిరుగుబాటు శాసనసభ్యులు వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి, బాలనాగి రెడ్డి రహస్యంగా చంద్రబాబును కూడా కలిసి తమ అభిమతాన్ని తెలియజేసినట్లు వినికిడి. దీంతో చంద్రబాబు పార్టీ సీనియర్ నాయకులతోనూ పార్టీ శాసనసభ్యులతోనూ ఆ విషయంపై చర్చించినట్లు చెబుతున్నారు. ఆ ముగ్గురిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించడానికి వారు సముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. దీనివల్ల పార్టీ బలంగా ఉందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, పార్టీ బలంగా ఉంది కాబట్టే వారు తిరిగి పార్టీలోకి వచ్చారని అనుకుంటారని భావిస్తున్నారు. తెలంగాణపై చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. కాగా, బాలనాగిరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించిన నేపథ్యంలో ఆ ముగ్గురికి కూడా తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసింది. ఆ ముగ్గురు తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వస్తే చంద్రబాబుకు నైతిక బలం చేకూరినట్లేనని చెప్పవచ్చు. అయితే, ఆ వార్తలను హరీశ్వర్ రెడ్డి ఖండిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పిలిచినా తాను కలవబోనని ఆయన అన్నారు. తెలంగాణపై తెలుగదేశం పార్టీ తన వైఖరిని స్పష్టం చేసేవరకు తాను కలవబోనని చెప్పారు.

జగన్ సమావేశానికి హాజరైన 22 మంది ఎమ్మెల్యేలు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఏర్పాటు చేసిన సమావేశానికి 22 మంది శానససభ్యులు వచ్చారు. గుంటూరు ఓదార్పు యాత్రను విరమించుకుని వైయస్ జగన్ శుక్రవారం సాయంత్రం హుటాహుటిన హైదరాబాదు వచ్చారు. శనివారం ఉదయం తన వర్గానికి చెందిన శానససభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ప్రారంభంలో 9 మందే ఉన్నప్పటికీ ఆ సంఖ్య 21కి చేరుకుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్, సుచరిత, శోభా నాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, సత్యవతి, బాబూరావు, పూతలపట్టు రవి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు సమావేశానికి వచ్చారు. సమావేశానికి వచ్చిన వారిలో బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ధర్నాన కృష్ణప్రసాద్, చెన్నకేశవ రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి కూడా ఉన్నారు. ప్రసాద రాజు, బాలరాజు, శివప్రసాద్ రెడ్డి, బాలనాగి రెడ్డి కూడా సమావేశానికి హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతిస్తామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఆయన వర్గానికి చెందిన కొంత మంది శాసనసభ్యులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని తిడుతూ పెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం సరి కాదనే వాదనను వారు ముందుకు తెస్తున్నారు. ధర్మాన కృష్ణ ప్రసాద్ మాటలను బట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.

తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి బుజ్జగిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి

తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గత ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని బుజ్జగించే ప్రయత్నంలో పడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన నేపథ్యంలో చిరంజీవి కాంగ్రెసు నాయకత్వంపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను గడ్డిపోచల్లా చూస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన శానససభ్యులు చిరంజీవి వద్ద తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. ఈ స్థితిలో తన వర్గం శానససభ్యులతో చిరంజీవి రేపు ఆదివారం అత్యవసరంగా సమావేశమవుతున్నారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన 17 మంది శాసనసభ్యులకు కాంగ్రెసు జారీ చేసే విప్ వర్తించదు. దీంతో అవిశ్వాసంపై ఓటింగు సందర్భంగా ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఏ కొద్ది మంది జారిపోయినా ప్రభుత్వం చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. దీంతో కాంగ్రెసు కలవరానికి గురవుతోంది. ప్రభుత్వ విప్ కొండ్రు మురళి చిరంజీవికి ఫోన్ చేసి మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ శానససభ్యులు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు చేసేలా చూడాలని ఆయన చిరంజీవిని అభ్యర్థించారు.

ప్రతి జిల్లాలో ఆధ్యాత్మిక గ్రంథాలయం

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో టిటిడి ఆధ్వర్యంలో ఒక ఆధ్యాత్మిక గ్రంథాలయం, గో సంరక్షణశాలను ఏర్పాటు చెయ్యాలని యోచిస్తున్నట్లు టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రతి నెలా తొలి నిర్వహించే డయల్ యువర్ ఇఓ కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని టిటిడి సమాచార కేంద్రంలో నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు ఇఓ సమాధానమిచ్చారు. నెల్లూరుకు చెందిన చందు అనే భక్తుడి ప్రశ్నకు సమాధానంగా ఇఓ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొదించనున్నట్లు తెలిపారు. అలాగే గో సంరక్షణతోనే సామాజిక సంరక్షణ సాధ్యమని టిటిడి భావించి ప్రతి జిల్లాలొ ఒక గోశాలను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు.

కర్నూలు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గుముఖం

కొంత కాలంగా జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గుముఖం పట్టడంతో కోట్ల రూపాయల లావాదేవీలు స్తంభించిపోయాయి. వందల ఎకరాల సాగు భూములను టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకున్న వ్యాపారులు గడువు దాటిపోయినా అసలు మొత్తాన్ని చెల్లించలేక చేతులెత్తేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల పుణ్యామా అంటూ ఇప్పుడు వ్యవసాయ భూములు రెంటికి చెడ్డ రేవడిలా మారాయి. ఇటు రైతులు పంటలు సాగు చేసుకోలేక..అటు వ్యాపారస్తులు ప్లాట్లను విక్రయించలేకపోతున్నారు. దీంతో కొందరు
వ్యాపారులు పరారీలో ఉండగా, మరి కొందరు ముఖం చాటేశారు. మొన్నటి వరకు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు ప్లాట్లు.. ఆరు రిజిస్ట్రేషన్లుగా కొనసాగింది. బడా వ్యాపారులు కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్ పరిధిలోని పట్టణ శివారు ప్రాంతాల్లో ఇబ్బడి ముబ్బడిగా వ్యసాయ భూములను కొనుగోలు చేశారు.
ప్లాట్లకు మంచి డిమాండ్ ఉండటంతో భూముల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. వర్షాలు లేక వేసిన పంటలు కోల్పోయి నష్టపోవటం కంటే ఉన్న భూములను విక్రయించగా వచ్చిన దాంతోనైనా వ్యాపారం చేసుకుందామని కొందరు రైతులు భూములను విక్రయించేందుకు సిద్ధపడ్డారు. వ్యాపారులు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకున్నారు. కొందరు గడువు లోపే మిగిలిన మొత్తాన్ని చెల్లించి భూములను స్వాధీనం చేసుకున్నారు. ఈమధ్యలో వ్యాపారం స్తంభించి పోయింది.
ఎంతకీ రియల్ ఎస్టేట్ రంగానికి డిమాండ్ రాకపోవటంతో కొందరు వ్యాపారులు ఊరొదిలి వెళ్తే, మరి కొందరు రైతులకు ముఖం చాటేసి సెల్ ఫోన్లు స్విచ్చాఫ్ చేశారు. కర్నూలు-ఓర్వకల్లు, కర్నూలు-కోడుమూరు ప్రాంతాల పరిధిలో సుమారు 2,601 ఎకరాల సాగు భూములకు ఎకరం రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. టోకెన్ అడ్వాన్స్‌గా లక్షకు రూ. 25వేలు రైతులకు ఇచ్చారు.
టోకెన్ అడ్వాన్స్ ఇవ్వగానే సాగు భూములను ప్లాట్లుగా మార్చేశారు. కొందరు మాత్రం ప్లాట్లను విక్రయించి రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించేశారు. మరి కొందరు మాత్రం అధిక ధరలకు విక్రయించాలని ఆశపడి ఒక్క నెల ఆలస్యం చేశారు. దురదృష్టవశాత్తు ఉన్నట్లుండి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి డిమాండ్ పడిపోయింది. దాంతో రైతులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించలేక, మార్కెట్లో తిరిగలేక సతమతమవుతున్నారు. టోకెన్ అడ్వాన్స్ కోసం వడ్డీకి తెచ్చిన మొత్తాన్ని కూడా చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చిత్తూరులో సీపీఎం జిల్లా మహాసభలు



సీపీఎం జిల్లా పదవ మహాసభలు ఆది, సోమవారాల్లో చిత్తూరులో నిర్వహించనున్నారు.ఈ మహాసభల్లో జిల్లాకు సంబంధించి 22 అంశాలపై తీర్మానాలు ఆమోదించనున్నామని తెలిపారు. తొలి రోజు మధ్యాహ్నం 3 గంటలకు రైల్వేస్టేషన్ నుంచి హైరోడ్డు, గాంధీబొమ్మ, ఎంఎస్ ఆర్ సర్కిల్, దర్గా చౌక్‌ల మీదుగా కణ్ణన్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. ర్యాలీ అనంతరం కళాశాల మైదానంలో బహిరంగ సభలో రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ప్రసంగిస్తారన్నా రు. రెండవ రోజుప్రతినిధుల సమావేశంలో పార్టీ నిర్ణయాలను, తీర్మానాలను ఆమోదిస్తామని తెలిపారు. జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో సొంత నియోజకవర్గం పీలేరుకు మాత్రమే పరిమితవుతున్నారని కుమార్‌రెడ్డి ధ్వజ మెత్తారు. పీలేరు పట్టణంలో తన సొంత స్థలంలో రూ. 60లక్షల పంచాయతీ నిధులతో క్యాంపు కార్యాలయాన్ని నిర్మించడాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రజల సొమ్ముతో భవనం నిర్మించిన స్థలాన్ని పంచాయతీకి అప్పగిస్తారా అని సీఎంను ప్రశ్నించారు. జిల్లాలో వ్యవసాయరంగానికి మేలు చేసే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తి గా విఫలమైందన్నారు. హరికృష్ణ మాట్లాడుతూ టీటీడీ నిధులను జిల్లా అభివృద్ధికి వినియోగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఉద్యోగాల్లో జిల్లావాసులకు కొంత వాటా, జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలల నిర్వహణ, తాగునీరు, వైద్యానికి టీటీడీ నిధులు కేటాయించాలని తీర్మానాలు చేయనున్నామని చెప్పారు. జిల్లాలోని 5.25లక్షల సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికులకు ఉద్యోగభద్రత కనీస వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ.రాఘవులు, కార్యదర్శివర్గ సభ్యులు కృష్ణయ్య, సోమయ్య ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ప్రజాపోరాటాలు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించనున్నట్టు పార్టీ జిల్లా కార్యదర్శి కె.కుమార్‌రెడ్డి, సీఐటీయూ కార్యదర్శి హరికృష్ణ, చిత్తూరు డివిజన్ కార్యదర్శి పి.చైతన్య వెల్లడించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వారు శుక్రవా రం విలేకరుల సమావేశంలో మాట్లాడా రు.

తిరుపతి-హైదరాబాద్ మధ్య మరిన్ని రైళ్లు

గుంతకల్లు, కదిరి మీదుగా తిరుపతి - హైదరాబాద్ మధ్య మరిన్ని రైళ్లు నడిపేందుకు వచ్చే బడ్జెట్‌లో తగు నిర్ణయం తీసుకుంటామని రైల్వే శాఖ సహాయ మంత్రి కేహెచ్ మునియప్ప స్పష్టం చేశారు. ఆయన కుటుంబ సమేతంగా కదిరిలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ధర్మవరం-పాకాల రైలు మార్గంలో గతంలో మీటర్ గేజ్ ఉన్నప్పుడు హైదరాబాద్- తిరుపతి మధ్య వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ నడిచే దని, దాన్ని మళ్లీ ఇదే మార్గంలో తిప్పేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రస్తుతం వారంలో రెండు రోజుల పాటు కదిరి మీదుగా సికింద్రాబాద్- తిరుపతి మధ్య నడుస్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలును ప్రతి రోజు నడిపేందుకు కృషి చేస్తామన్నారు. కదిరి- పుట్టపర్తి, చిక్‌బళ్లాపూర్- పుట్టపర్తి మధ్య ఏర్పాటు చేయనున్న కొత్త రైలు మార్గానికి తమ వాటాగా చెల్లించాల్సిన నిధులను ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు ఇప్పటికే అంగీకరించాయన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.