Tuesday, 7 February 2012

ఎంబీబీఎస్ విద్యార్థులుకు సర్కారు షాక్

జూనియర్ వైద్యులకు ప్రభుత్వం షాకిచ్చింది. ఎంత చెప్పినా సమ్మె విరమించక పోతుండడంతో.. హౌస్ సర్జన్లపై వేటువేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లకు రహస్యంగా ఉత్తర్వులు జారీచేసినట్లు సమాచారం. సమ్మెవల్ల తగ్గిన హాజరును కారణంగా చూపి.. ప్రభుత్వం దాదాపు 1,900 మంది హౌస్‌సర్జన్లను పీజీ పరీక్షలకు అనర్హులను చేస్తోంది. రాష్ట్రంలోని 10 బోధనాస్పత్రుల్లో ఎండీ, ఎంఎస్ వంటి మూడేళ్ల పీజీ కోర్సులు చేస్తున్న జూనియర్ వైద్యులతో పాటు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఏడాదిపాటు హౌస్‌సర్జన్ చేస్తున్న వైద్యవిద్యార్థులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. విద్యార్థులు నాలుగున్నరేళ్ల ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేసి, ఏడాదిపాటు ఆస్పత్రుల్లో హౌస్‌సర్జన్‌గా పనిచేయాలి. తర్వాత మరో ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు సేవలు చేయాలి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్ కోర్సు పూర్తయిన ప్రతీ విద్యార్థి కచ్చితంగా 365 రోజుల(ఏడాది) పాటు హౌస్‌సర్జన్‌గా విధులు నిర్వహించాలి. అందులో ఒక్కరోజు తగ్గినా.. వారికి వైద్యపట్టా లభించే అవకాశముండదు. హౌస్‌సర్జన్ పూర్తిచేశాకే ఎండీ, ఎంఎస్ లాంటి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హతపరీక్షకు అనుమతిస్తారు. 2012 అక్టోబర్‌లో ఈ అర్హత పరీక్ష జరగనుంది. అప్పటిలోగా.. హౌస్ సర్జన్ పూర్తి చేసుకోవాల్సిందే. కానీ, 2012 సంవత్సరంలో హౌస్ సర్జన్ పూర్తి చేసుకోబోయే.. 10 బోధనాస్పత్రులకు చెందిన 1,900 మంది హౌస్‌సర్జన్లు సమ్మెలో పాల్గొంటున్నారు. 11 రోజులుగా విధులకు దూరంగా ఉంటున్నారు. దీంతో వీరికి పీజీ పరీక్షలో అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సమ్మెలో పాల్గొంటున్న హౌస్ సర్జన్ల వివరాలు సేకరించి పెట్టుకోవాల్సిందిగా అన్ని బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లను రాష్ట్ర వైద్య విద్యా శాఖ ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు రహస్యంగా ఉత్తర్వులు (మెమోలు) పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం

శివరాత్రికి శ్రీశైలంలో విస్తృత ఏర్పాట్లు

శివరాత్రికి శ్రీశైలం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాంశంకర్ నాయక్ తెలిపారు. ఫిబ్రవరి 13 నుంచి 23 వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకై  దేవస్థానం కార్యనిర్వాహక భవనంలో సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ రాంశంకర్‌నాయక్, ఎస్పీ శివప్రసాద్, ఇ ఓ హనుమంతరావు, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఇమిడిశెట్టి కోటేశ్వరరావు, పాలక మండలి సభ్యుల అధ్యక్షతన అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారుల సమక్షంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివరాత్రికి సంబంధించిన ఏర్పాట్ల గురించి, వసవి విభాగం, పారిశుద్యం, ట్రాఫిక్, క్యూలైన్లు, వాలెంటీర్లు తదితర ఏర్పాట్ల గురించి చర్చించారు. తాగునీటి సమస్యలు రాకుండా పంపింగ్ ద్వారా, ట్యాంకుల ద్వారా ఏర్పాటు చేయాలన్నారు. 9 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తామన్నారు. పారిశుద్ధ్యం కొరకు 350 మందిని, 650 స్వీపర్లు, 6 ట్రాక్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వసతి నిమిత్తం 1300 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఘాట్‌రోడ్ల వద్ద స్వీడ్ బ్రేకర్ల ఏర్పాటు చేస్తామన్నారు. ఈప్రాంతాల్లో పల్లె వెలుగు బస్సులకు బదులుగా కొత్త బస్సులు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రించాలని ఆర్ ఎంలను కలెక్టర్ ఆదేశించారు. అగ్నిమాపక సిబ్బందిని ఏర్పాటు చేసి పాతాళగంగ సమీపంలో గజ ఈతగాళ్ళను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో 95 సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జి తెలుగులో వచ్చే కార్యక్రమాలను కూడా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. 1800 మంది భద్రతా సిబ్బందిని, నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చివరి రోజులైన 19, 20, 21 తేదీల్లో మద్యపానాన్ని నిషేదిస్తున్నట్లు తెలిపారు. ఏదేమైనా భక్తులకు దర్శనాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సహకరించి సేవ చేయాలని వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఎస్ ఇలు, ఆర్టీసి ఆర్‌యంలు, ఆర్డీవో వెంకటమురళి, ఫారెస్టు, పారిశుద్య తదితర అధికారులు పాల్గొన్నారు.

శాఖల మార్పులపై కిరణ్ కుమార్ రెడ్డిపై ఫైర్...డీఎల్ రవీంద్రారెడ్డి

 శాఖల మార్పులపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అసంతృప్తి వ్యక్తపరిచారు. తాను పనిచేయడం లేదని శాఖల్లో కోత వేసి ఉంటే తనకు మంత్రి పదవే అక్కర్లేదని ఆయన అన్నారు. తాను ఎవరికీ చెంచాగిరి చేయలేదని, చేయనుకూడా అని డీఎల్ పేర్కొన్నారు. పథకాల వైఫల్యం, అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంటానని డీఎల్ స్పష్టం చేశారు. జూడాల విషయంలో తన వైఫల్యం లేదని, వచ్చే ఉప ఎన్నికల్లో తన ప్రమేయము ఉండదని, ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. తాను సంతోషంగా ఉన్నానని, ఇప్పటి వరకు తనకిచ్చిన బాధ్యతను సమర్థవంగా నిర్వహించానని డీఎల్ తెలిపారు. పదవి భారం అని ఎప్పుడూ అనుకోలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌తో తనకే విభేదాలు లేదని, వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే వారికే వ్యతిరేకినని డీఎల్ రవీంద్ర అన్నారు.పదవుల కోత విషయంలో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. తాను పని చేయలేదని శాఖలపై కోత కోసి ఉంటే తనకు మంత్రి పదవే అవసరం లేదని ఆయన మండిపడ్డారు. తాను ఎవరికీ చెంచాగిరి చేయలేదని, అలా చేయను కూడా అని అన్నారు. తనకు పదవి ఉన్నా లేకున్న ప్రభుత్వ పథకాల వైఫల్యంపై ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. ప్రభుత్వ పథకాలను విమర్శించినందు వల్లనే కోత కోస్తే నన్ను పదవి నుండే తప్పించ వచ్చునని అన్నారు. ఆరోగ్య శాఖలో జరిగిన కొన్ని సంఘటనలకు తాను బాధ్యుడిని కానన్నారు. జూడాల విషయంలో నా వైఫల్యం లేదన్నారు. తనది ముక్కుసూటిగా వ్యవహరించే తత్వమని, ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు.ఉప ఎన్నికల్లో తన ప్రమేయం ఉండదన్నారు. ఉప ఎన్నికలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే బాధ్యత వహించాలన్నారు. కడప జిల్లాలో ఆధిపత్యం చూపాలనుకుంటున్న వారు ఉప ఎన్నికల్లో మూడు సీట్లు గెలిపించి తమ సత్తా చూపాలని అన్నారు. పదవిలో కోత విధించి భారం తగ్గించినందుకు సిఎంకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. తనను కేబినెట్ నుండి తప్పించినా బాధపడనని, సామాన్య కార్యకర్తగా పని చేస్తానని అన్నారు. తనకు ఎవరితో విభేదాలు లేవని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడతానని అన్నారు. కాంగ్రెసు వల్లనే తాను ఉన్నత స్థానానికి వచ్చానని అన్నారు.

వ్యక్తిగత ఆదా యం పన్నుచెల్లింపుదార్లకు వేతనజీవులకు బడ్జెట్‌లో ఊరట..!

వేతన జీవులు, వ్యక్తిగత ఆదా యం పన్ను చెల్లింపుదార్లకు రానున్న బడ్జెట్‌లో ఆర్థి కమంత్రి కొంత ఊరట కలిగించనున్నారు. ప్రత్యక్ష పన్నుల కోడ్ (డిటిసి) సిఫార్సులను దృష్టిలో ఉంచు కొని వ్యక్తి గత ఆదాయం పన్ను మిన హాయంపు పరిమితిని రెండు లక్షల రూపాయలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయంచినట్లు తెలుస్తోంది. అయతే ఇప్పుడున్న ద్రవ పరిస్థితి రీత్యా ఇతర పన్ను రేట్లు తగ్గించేందుకు అవకాశం లేదని భావిస్తున్నారు. ప్రస్తుతం పార్ల మెంటరీ స్థాయా సంఘం పరిశీలనలో ఉన్న డిటిసిలో ఆదాయం పన్ను రాయతీ పరిమి తి ఇప్పుడున్న రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచాలని సిఫార్సు చేశారు. అలాగే గరిష్ఠ ఆదాయ పన్ను రేటు 30% ప్రస్తుతం అమల్లో వున్న రూ.8 లక్షల వార్షిక ఆదాయం గలవారికి కాకుండా రూ.10 లక్షల రాబడి గలవారికి వర్తింప జేయాలని డిటిసి ప్రతిపాదిం చింది. కాగా, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మార్చి ద్వితీయా ర్ధంలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇతర పన్ను రేట్లను యథాతథంగా కొనసాగిం చినా, అధిక ద్రవ్యోల్బణం రీత్యా ఆదాయం పన్ను శ్లాబ్ పెంచాలని పారి శ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.. వ్యక్తిగత ఆదాయం పన్ను మిన హాయంపు పరిమితి రూ.1.8ం లక్షల నుంచి రూ.2 లక్షలకు హెచ్చిం చాలని సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయతే ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపధ్యంలో వ్యక్తిగత ఆదాయం పన్ను రేట్లను తగ్గించకూడదని, అయతే గరిష్ఠ 30% పన్ను రేటును రూ.8 లక్షల వార్షికాదాయం గలవా రికి కాకుండా రూ.10 లక్షల స్థాయ గలవారికి వర్తింపజేయాలని ఫిక్కి ప్రధాన కార్యదర్శి రాజీవ్‌కుమార్ అన్నారు. అసోచామ్ అధ్యక్షుడు మాట్లాడుతూ బేసిక్ పన్ను మినహాయంపు పరిమితి రూ.2 లక్షలకు విస్తరించాలని కోరారు. రూ.2 లక్షలకు పైన, రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి 10% పన్ను రేటు వర్తింప జేయాలని సూచించారు.

సచిన్ అంతర్జాతీయ క్రికెట్లో నెంబర్ వన్...మాజీ కెప్టెన్ స్టీవ్ వా

వందో సెంచరీ చేయనంతమాత్రాన సచిన్ గొ ప్పతనం ఏమాత్రం తగ్గదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా అన్నాడు. సచిన్ వం దో సెంచరీ చేయాలని దేశమంతా ఎదురుచూస్తున్నందునే అతనిపై అనవసర ఒత్తిడి పెరుగుతోందని చెప్పాడు. భారత్‌లో అభిమానులు గణాంకాలపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుంటారని వా అన్నాడు. 'సచిన్ వందో సెంచ రీ చేస్తే మంచిదే. ఒకవేళ అతను సాధించలేకపోయినా గొప్ప ఆటగాడిగా అతనికున్న ఖ్యాతి ఇసుమంతైనా తరిగిపోదు. ప్రస్తుతం 99 సెంచరీల సచిన్‌ను చూస్తుం టే..99.94 సగటుతో రిటైరైపోయిన డాన్ బ్రాడ్‌మన్ గు ర్తుకొస్తున్నాడని' స్టీవ్ వా అన్నాడు. గతేడాది ఏప్రిల్‌నుంచి వందో శతకం కోసం సచిన్ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. భారత్ అభిమానులు గతంలో సచిన్ రికార్డులని చూసి.. చూసి తన వందో సెంచరీ కోసం ఎదురు చూస్తున్నారని.. ఐతే వందో సెంచరీ అనేది కేవలం సచిన్‌కు ఓ అంకె మాత్రమేనని అన్నాడు. 'సచిన్ వందో సెంచ రీ చేస్తే మంచిదే. మరోవైపు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెంటూల్కర్‌ను ఆసీస్‌ లెజెండ్‌ డాన్‌ బ్రాడ్మన్‌తో స్టీవ్ వా పోల్చాడు. బ్రాడ్మన్‌ 99 యావరేజ్‌తో కెరీర్‌ ముగించినపుడు అందరూ బాధపడ్డారని తెలిపాడు. ఇప్పుడు సచిన్‌ విషయంలోనూ 99 ఆడుకుంటుందని అన్నాడు.ఐతే సచిన్‌ అతి త్వరలోనే వందో సెంచరీ సాధించితీరతాడని వా ఆశాభావం వ్యక్తం చే శాడు. ఐతే గత ఏప్రిల్‌నుంచి సచిన్‌ వందో సెంచరీ కోసం వెయిట్‌ చేస్తూనే ఉన్నా ఇప్పటికీ ఆ రికార్డు ఊరిస్తూనే ఉంది. ఇంగ్లండ్‌, విండీస్‌, ఆసీస్‌లతో జరిగిన సిరీస్‌లలో దగ్గరకు వచ్చినా మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకోలేకపోయాడు.

సినీ గాయని జానకి తలకు గాయం

ప్రముఖ గాయని ఎస్‌.జానకి గాయపడ్డారు. తలకు గాయం కావడంతో.. ఆమెను తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. తిరుపతిలోని హోటల్‌ భీమాస్‌ బాత్‌రూమ్‌లో ఆమె జారిపడ్డారు. ఈ ఉదయం ఈ ఘటన జరిగింది. స్విమ్స్‌లో ఆమెకు MRI స్కాన్‌ తీశారు. గాయం కారణంగా మెదడులో రక్తం గడ్డకట్టిందని సమాచారం. గాయకుడు బాలకృష్ణ ప్రసాద్‌ నిర్వహిస్తున్న అన్నమయ్య సంకీర్తనా మహాయజ్ఞంలో పాల్గొనేందుకు జానకి తిరుపతి వచ్చారు. నగరంలో ఐదు రోజులుగా జరుగుతున్న అన్నమయ్య సంకీర్తన యజ్ఞంలో జానకి పాల్గొంటున్నారు. నిర్వహకులు జానకికి ఓ ప్రైవేటు హోటల్‌లో వసతి కల్పించారు. కాగా ఈ ఉదయం బాత్‌రూంలో కాలు జారి కిందపడిపోవడంతో తలకు గాయమయింది. ఈ సందర్భంగా మరో గాయకుడు బాలకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ (మా పిన్ని) జానకీ త్వరగా కోలుకుంటుందని అన్నారు. ఈ విషయంలో ఆందోళన చెందనవసరం లేదని అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఈరోజు సాయంత్రం జరగాల్సిన సంకీర్తనా యజ్ఞం యథావిధిగా జరుగుతుందని ఆయన తెలిపారు. ఐదురోజులుగా అన్నమయ్య సంకీర్తనా యజ్ఞంలో పాల్గొన్న జానకికి ఈ ఉదయం ప్రమాదం జరిగిందని తెలిసి, ఆస్పత్రికి తరలివస్తున్న సినీ ప్రముఖులు, కుటుంబసభ్యులు అభిమానులు ప్రజలు ఆవేదన చెందుతున్నారు. భక్తులు, అభిమానులు త్వరగా ఆమె కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.