Monday, 14 November 2011

నమస్తే రాయలసీమ విజ్ఞప్తి

నమస్తే రాయలసీమ పాఠకులకు విజ్ఞప్తి. కొన్ని కారణాల వాళ్ళ, మన వెబ్ సైటు గూగుల్ క్రోమ్ లో కనిపించుట లేదు. దయచేసి ఫైర్ ఫాక్స్ లేదా ఎక్స్ ప్లోరర్  ఉపయోగించగలరు. అసౌకర్యానికి చింతిస్తున్నాం.

రైతుల దారుణమృతి

కర్నూలు: పెదకడులూరు లో వరిపొలం మీదుగా ఉన్న విద్యుత్‌లైన్ నుంచి అకస్మాత్తుగా తీగలుతెగి పంటపొలంలో పడడంతో పనిలో నిమగ్నమైన ఇద్దరు రైతులు విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచారు.   ఏం జరిగిందో వారికి సహాయం అందించబోయిన పక్కపొలానికి చెందిన రైతు కూడా అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ కు గుడ్ న్యూస్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమ ఆస్తులపై హైకోర్టు సిబిఐ విచారణకు  ఆదేశించింది.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు, చంద్రబాబు ఆస్తులపై మూడు నెలల్లో ప్రాథమిక విచారణ జరిపి సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు సంస్థకి కోర్టు నిర్దేశించింది.
          చంద్రబాబుతోపాటు 13 మందిపై విచారణ జరపాలని ఆదేశించింది. ప్రతివాదులందరికీ నోటీసులు పంపారు. నారా భువనేశ్వరి, ఆమె కంపెనీలు, లోకేష్, రామోజీరావు, ఆయన కంపెనీలు, అహోబలరావు, ఎంపి వైఎస్ చౌదరి, మాగంటి మురళీ మోహన్, కర్నాటి వెంకటేశ్వరరావు, సిఎం రమేష్ వ్యక్తిగత ఆస్తులపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది

తిరుమల ,తిరుపతిలో చెత్త వేస్తే 1000 రూపాయలు జరిమానా

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల పుణ్యక్షేత్రంలో ప్లాసిక్ నివారించేందుకు టిటిడి కృతనిశ్చయంతో వుందని, తిరుపతిలో కూడా ప్లాస్టిక్ నిషేధం విధించేందుకు తగు చర్యలు తీసుకోనున్నట్లు మున్సిపల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఖాదర్‌సాహెబ్ తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చిన ఆయన తిరుపతి మున్సిపల్ కార్యాలయంలలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థ తాను వెళ్లిన సందర్భంగా తిరుమలలో టిటిడి అధికారులు ప్లాస్టిక్ నిషేధం, అన్నం వృథాకాకుండా, వేస్టు మెటీరియల్ రీసైక్లింగ్ తదితర అంశాలపై చర్చించారన్నారు. తిరుమలకు ప్లాస్టిక్ వస్తువులను పంపకుండా తిరుపతిలోనే కట్టడి చేస్తే బాగుంటుందని తాము భావిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే నగరంలో ప్లాస్టిక్ విక్రయాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రసాద్‌ను అదేశించినట్లు చెప్పారు. అలాగే పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను అదేశించినట్లు చెప్పారు. ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమాన్ని తిరుపతిలో ప్రయోగాత్మకంగా ఒక వార్డు రెసిడెన్సియల్ ఏరియాలోనూ, మరో వాణిజ్య వార్డును ఎంపిక చేసి విజయవంతంగా చెత్త సేకరణ చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 31వతేది నాటికి తిరుపతిలోని ప్రతి ఇంటి నుండి మున్సిపల్ సిబ్బందే స్వయంగా చెత్తను సేకరించే కార్యక్రమాన్ని చేపడుతారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ ఇందిరాప్రియదర్శని కూరగాయల మార్కెట్‌ను ఆకస్మింగా తనిఖీ చేశారు. మార్కెట్‌లో రోడ్డుపై చెత్తను పడేవేయడాన్ని చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవ్వరు దుకాణం ముందుంటే వారి చేతనే చెత్తను తొలగింపజేశారు. మరోమారు చెత్త వేస్తే 1000 రూపాయలు ఒక్కొక్కరికి జరిమానా వేస్తామని హెచ్చరించారు. అనంతరం మార్కెట్‌లో కొన్ని రోజులుగా దుర్గంధం వెదజల్లుతూ వున్న చెత్తను చూసి ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తను తరలించేందుకు వాహనాలున్నా, ఇంత స్థాయిలో ఖర్చులు పెడుతున్నా ఇంత అధ్వాన్నంగా వుండటం ఏమిటి అంటూ అధికారులను జెడి ప్రశ్నించారు. అనంతరం మార్కెట్ కాంట్రాక్టర్ నరసింహారెడ్డిని పిలిచి మార్కెట్‌లోని దుకాణదారులతో శ్రమదానం చేసి మార్కెట్‌ను శుభ్రంగా వుంచుకోవాలని అదేశించారు. భవిష్యత్‌లో మళ్లీ తాను వచ్చినప్పుడు మార్కెట్ ఎంతో శుభ్రంగా వుండాలని అధికారులకు, మార్కెట్ దుకాణదారులకు, కాంట్రాక్టర్‌కు అదేశించారు.



శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల కోలాహలం

 శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసంలో 3వ సోమవారం ముందుగానే భక్తుల సందడి కనపడింది. శెలవు దినాలు రావడంతో శ్రీశైలం భక్తులతో కిక్కిరిసింది. ముందుగా భక్తుల రద్దీని గమనించిన అధికారులు ఆలయ వేళలు మార్పు చేశారు. ఉదయం 2.30 గంటలకే మంగళవాయిద్యాలు, 3 గంటలకు సుప్రభాతసేవ, 4 గంటలకు మహామంగళహారతి, 4.30 దర్శన ఆర్జిత సేవలను ప్రారంభించారు. సాయంత్రం ఆలయాన్ని మూసివేసి 6 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. వచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు క్యూలైన్లలో నీటి వసతి, భద్రత ఏర్పాటు చేశారు. 1.50 లక్షల మంది భక్తులు స్వామి వార్లను దర్శించకున్నట్లు తెలిపారు. భక్తులు ఉదయం నుంచి 436 సామూహిక అభిషేకాలు నిర్వహించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే కార్తీక దీపారాధన చేసుకునే భక్తులు నాగులకట్టవద్ద పోటీపడ్డారు. కట్ట సముదాయంలో, చుట్టు ప్రదేశాల్లో కల్లాపుచల్లి ముగ్గులు వేసి దీపారాధనలు చేశారు. పూజారులను ఏర్పాటుచేసుకొని 10 లక్షల ఒత్తుల ద్వీపాలను వెలిగించారు. వసతి గృహాలన్ని కిక్కిరిసి పోయాయి. ముందుగా గదులను రిజర్వు చేసుకొని వచ్చే భక్తులకు వసతి గృహం లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. కార్తీక మాసంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆదివారం సాయంత్రం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. వీరికి ఆలయ తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.