Monday, 12 December 2011

చిరంజీవికి రాజకీయాలు వద్దు...జగన్‌వర్గం

చిన్న చిన్న పదవులు వదులుకోవడానికే తటపటాయిస్తున్న ఈ రోజుల్లో తాము నమ్మిన నాయకుడి కోసం ఏకంగా పదహారు మంది శాసనసభ్యులు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీని కాదని పదవులకు గుడ్‌బై చెప్పడానికి సిద్ధపడటం చారిత్రక ఘట్టమని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి  అన్నారు. మేం పడగొడతామంటే సర్కారును నిలబెడతామన్న చిరంజీవి రాజకీయాలు మాట్లాడకుండా ఉంటనే ప్రజలు హర్షిస్తారన్నారు. ఆయన రాజకీయాలు మానుకొని తన వృత్తికి పరిమితమైతే బాగుంటుందని సూచించారు. దివంగత వైయస్ మృతి చెందినప్పటి నుండి ఆ ఎమ్మెల్యేలు జగన్ వెంటే ఉన్నారని అలాంటప్పుడు వారిని కొన్నారని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు అంగడిసరుకుగా మారారంటున్న తులసీరెడ్డి మూడుసార్లు పార్టీలు మారినప్పుడు ఎంతకు అమ్ముడు పోయారో చెప్పాలన్నారు.అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు సంక్షేమ పథకాల విషయంలో అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వేరుగా హైదరాబాదులో అన్నారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం...ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. ఆమె సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ ను మరో రెండేళ్లు అధికారంలో నిలబెట్టాలనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబునాయుడు అవిశ్వాస తీర్మానంపై ఇతర ప్రతిపక్షాల మద్దతు కోరలేదన్నారు.రైతుల పేరు చెప్పి అవిశ్వాసం పెట్టిన చంద్రబాబు సమస్యల గురించి చర్చించకుండా వైఎస్ రాజశేఖరరెడ్డిని తిట్టడానికే అసెంబ్లీని వేదికగా చేసుకున్నారని శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. వడ్డీలేని రుణాలు ఇస్తామంటూ ప్రజలను మోసం చేయకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు.