శ్రీరామ రాజ్యం సినిమాలో సీత పాత్ర పోషించిన నయనతార మంచి మార్కులు కొట్టేసిన
విషయం తెలిసిందే. ఆమె అద్భుతమైన నటనకు యావత్ తెలుగు సినిమా లోకం
ప్రేక్షకులంతా ముగ్దులైపోయారు. నయన తార కెరియర్లో ఇదివరకెప్పుడూ రాని మంచి
పేరు ఈ సినిమాతో సొంతం చేసుకుంది. దీంతో ఆమెతో అలాంటి పాత్రలు చేయించడానికి
పలువురు దర్శక నిర్మాతలు కథలు కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే పెళ్లి
తర్వాత నయనతార సినిమాలకు దూరంగా ఉంటుందని ప్రచారం మరో వైపు సాగుతోంది. ఆ
విషయం అలా ఉంచితే రామ్ గోపాల్ వర్మ ‘రామాయణం’ సినిమా తెరకెక్కిస్తున్నట్లు
కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఇందులో నాగార్జునతో రావణ్ పాత్ర
చేయిస్తానని చెప్పాడు కూడా. అయితే నాగార్జున మాత్రం...నేను రావణుడి పాత్ర
చేయడం ఏమిటి అదంతా రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేశారు.సినీ
వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం రాముడి పాత్రను నాగార్జున డిమాండ్
చేస్తున్నాడని, సీత పాత్రలో నయనతార అయితేనే సినిమా చేయడానికి ఒప్పుకుంటానని
వర్మకు తేల్చి చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు వర్మకూడా
సరే అన్నట్లు సమాచారం. శ్రీరామ రాజ్యం సినిమా లాస్ట్ అని నయనతారకు ఆంక్షలు
విధించిన ప్రభుదేవా..వర్మ సినిమాలో ఆమె నాగ్‌తో రొమాన్స్ చేయడానికి
ఒప్పుకుంటాడో, లేదో అని చర్చించుకుంటున్నారు.
సచిన్ టెండూల్కర్ బౌలింగు చేస్తే కుమారుడు అర్జన్ బ్యాటింగ్ చేశాడు.
మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో దాదాపు అర గంట పాటు ఇండోర్ నెట్స్‌లో సచిన్
టెండూల్కర్ తన కుమారుడికి బౌలింగ్ చేశాడు. ఈ వ్యవహారాన్ని
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత వీరేందర్
సెహ్వాగ్‌కు అర్జున్ బౌలింగ్ చేశాడు. నీ ఫేవరైట్ షాట్ ఏమిటిని డీన్ జోన్స్
యంగ్ అర్జున్‌ను ప్రశ్నించాడు. అతనికి ఎవరు కోచింగ్ ఇస్తున్నారు, ట్వంటీ20
మ్యాచులను ఇష్టపడతాడా వంటి ప్రశ్నలను కూడా అతను వేశారు. జెఫ్
మార్ష్ తన కుమారుడు షాన్‌ను నెట్స్‌కు తెచ్చేవాడట. క్రికెటర్లు తమ పిల్లలను
నెట్స్‌కు తెస్తే అద్భుతంగా ఉంటుందని డీన్ జోన్స్ అంటున్నారు. నెట్స్‌లో
పిల్లలు క్రికెటర్ల గడిపితే చాలా ఉపయోగం అవుతుందని ఆయన అన్నారు. తండ్రి
నైపుణ్యాన్ని అర్జున్ పుణికి పుచ్చుకుంటే ఫరవాలేదని ఆయన అన్నారు. ఇటీవలి
స్కూల్ మ్యాచులో తాను సెంచరీ చేసినట్లు అర్జున్ చెప్పాడని ఆయన అన్నారు. ఓ
ఆటలో ఎనిమిది వికెట్లు తీసుకున్న విషయాన్ని కూడా అర్జన్ చెప్పాడట.
జిల్లాలో ఇష్టానుసారంగా అమలవుతున్న విద్యుత్ కోతల కారణంగా ఉపాధికి కోత
పడుతోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉత్పత్తిపరంగా దెబ్బతింటున్నాయి.
చిరు వ్యాపారులపై కూడా విద్యుత్ కోత ప్రభావం తీవ్రంగా పడింది. ఫోటోస్టాట్,
ఫోటోస్టూడియోలు, వెల్డర్లు, మెకానిక్కులు విద్యుత్ కోత కారణంగా తీవ్రంగా
నష్టపోతున్నారు. వీరు విద్యుత్ సరఫరా ఉన్న సమయంలో రోజుకు 300 నుండి 500
రూపాయల వరకు స్వయం శక్తితో అదాయాన్ని సమకూర్చునేవారు. ప్రస్తుతం జిల్లాలో
విద్యుత్‌కోత దాదాపు ఎనిమిది గంటల పాటు కొనసాగుతుండడంతో వ్యాపారాలు జరక్క
చేతి పనుల వారు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా జిల్లాలో చేనేత
కార్మికులు పని దక్కక వచ్చే అరకొర కూలీ కూడా దక్కకపోవడంతో తీవ్ర ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారు. గతంలో ఒక పట్టుచీరను నేస్తే 500 వందల రూపాయలు కూలీ
దక్కేది. ప్రస్తుతం విద్యుత్ కోత పేరుతో కూలీ చార్జీ 500 వందల నుండి 400
రూపాయల వరకు తగ్గించారు. దీంతో జిల్లాలో పట్టుచీరల ఉత్పత్తి బాగా
పడిపోయింది. జిల్లాలో వివిధ ప్రాంతాలలో వేలాది మంది చేనేత కార్మికులు
ఉన్నారు. ముందుగానే బాగా చితికిపోయిన చేనేత కార్మికులకు విద్యుత కోత
గోరుచుట్టుపై రోకలి పోటు అన్న చందంగా మారింది. ఇక పోతే వ్యవసాయదారులు కూడా
విద్యుత్ కోత వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో
విద్యుత్‌పై నడిచే చిన్న పరిశ్రమలు మూసివేత దిశగా నడుస్తున్నాయి. ముఖ్యంగా
నగర ప్రాంతాలలో వెల్డింగ్, లేత్ పనులు, విద్యుత్ పనులు పూర్తిగా
తగ్గిపోయాయి. చేతి వృత్తి కార్మికులు పని లేక పోవడంతో అంగళ్లల్లో ఖాళీగా
కూర్చుంటున్నారు. చేతి పనుల వారికి చేతి నిండా పని ఉన్నప్పటికీ విద్యుత్
లేకపోవడంతో పనులు సాగడడం లేదు. దీంతో యాజమానులు చేతి పనుల వారికి కూలీలు
తగ్గించి ఇస్తున్నారు. ఆ మేరకు ఆదాయం కోల్పోతున్నారు. రెక్కాడితే గాని
డొక్కాడని వారి పరిస్థితి గందరగోళంగా మారుతోంది.రాలయసీమ ప్రాంతాలలో మెకానిక్ షెడ్లు, ఆటోమొబైల్
సెంటర్లు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో విద్యుత్ కోత కారణంగా పనులు
ముందుకు సాగడం లేదు. దీంతో ఈ రంగాలపై ఆధారపడిన కార్మికులు అదాయం కోల్పోయి
లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో చేతి వృత్తి కార్మికుల జీవనం రోజురోజుకూ
భారంగా మారుతోంది.
అనంతపురం గ్రామీణ ప్రజలకు మరింత చేరువగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకును
తీసుకెళ్తున్నామని ఎపిజిబి బ్యాంకు రీజనల్ మేనేజర్ మహమ్మద్ ఖాన్ నేడొక
ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా అంతటా తమకు 93 బ్రాంచీలుండగా తమ
రీజియన్ పరిధిలోనే 56 శాఖలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఎపిజిబి సేవలను గ్రామీణ
ప్రజల చెంతకు విస్తరింపచేయడానికి వీలుగా సోమవారం కుందుర్పి మండలం ఎనుముల
దొడ్డి, ధర్మవరం మండలం చిగిచెర్లలలో నేడు ఎపిజిబి నూతన శాఖలను
ప్రారంభిస్తున్నామన్నారు. వీటితో పాటు తమ బ్యాంకు ద్వారా 89 మంది బిజినెస్
కరస్పాండెంట్లను నియమించామన్నారు. వీరికి ఆరు రోజుల్లో శిక్షణ ఇచ్చి రెండు
వేల జనాభా పైబడి ఉన్న గ్రామాలలో నియమించామన్నారు. రైతులు, స్వయం సహాయక
సంఘాల మహిళలు శ్రమ, ఖర్చు లేకుండా బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారానే ఇళ్ల
వద్దకు బ్యాంకు సేవలను పొందవచ్చని ఆర్‌ఎం తెలిపారు. ఇప్పటివరకూ తమ రీజియన్
పరిధిలోని 56 బ్యాంకు బ్రాంచ్‌ల ద్వారా రూ. 780 కోట్ల డిపాజిట్లు
సేకరించామన్నారు. వచ్చే మార్చి నెలాఖరుకు ఎటిఎంలను కూడా ప్రారంభిస్తామని
ఎపిజిబి ఆర్‌ఎం మహమ్మద్ ఖాన్ వివరించారు.
కొత్త సంవత్సరం వస్తోంది. 2011కు వీడ్కోలు చెబుతూ 2012కు స్వాగతం పలకడానికి
అందరూ సన్నద్ధమవుతున్నవేళ పోలీసులు కొత్త సంవత్సరం వేడుకలపై ఆంక్షలు
విధించారు.
ఈ నెల 31 వ తేదీ అర్థరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే వేడుకలకు అనుమతి
ఇస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఆ రోజున ఇరుగుపొరుగులకు ఇబ్బంది
కలిగించే విధంగా ఎక్కువ శబ్దంతో మ్యూజిక్ పెట్టరాదని పోలీసులు స్పష్టం
చేశారు. అసభ్యకరమైన నృత్యాలు, చిత్రాల ప్రదర్శనకు, అలాగే డీజేలకూ అనుమతి
లేదని పోలీసులు వివరించారు.
లైసెన్సులు ఉన్నా ఎవ్వరూ తుపాకులు పట్టుకువెళ్లరాదని, ఎక్కడా ఆరోజున బాణా సంచా పేల్చరాదని,
మద్యం మత్తులో వాహనాలు నడిపితే భారీ జరిమానా ఉంటుందనీ పోలీసులు వివరించారు. ఆ రోజున
తెల్లవార్లూ వాహనాల తనిఖీ ఉంటుందని, మద్యం సేవించి వాహనాలు నడపడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని పోలీసులు వెల్లడించారు.