Friday, 30 December 2011

సౌత్ టాప్ హీరో సర్వేలో జూ ఎన్టీఆర్

ప్రముఖ తమిళ పత్రిక కండక్టు చేసిన సర్వే ప్రకారం సౌత్ టాప్ హీరోల లిస్ట్ అంటూ ఓ లిస్ట్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఆన్ లైన్ సర్వే చేసి ప్రకటించామంటున్న వారి లెక్కలు ప్రకారం...

1.రజనీకాంత్ --95%

2.జూ.ఎన్టీఆర్ --85%

3.చిరంజీవి---82%

4.అజిత్--76%

5.విజయ్---74%

6.పవన్ కళ్యాణ్-72%

7.మోహన్ లాల్--63%

8.సూర్య--63%

9.మహేష్ బాబు--57%

10.ప్రభాస్--56%

అయితే ఈ పర్శంటేజ్ లు కేవలం ఆన్ లైన్ సర్వే ప్రకారం చేసినవి అని చెప్తున్నారు. అలాగే ఈ లెక్కలు 'ధట్స్ తెలుగు' స్వయంగా వేసినవి కాదని గమనించాలి. ప్రచారంలో ఉన్న వాటిని పాఠకులు కోసం అందించటం జరుగుతోంది.

అక్కినేని అన్నపూర్ణమ్మ నాకు తల్లిలాంటివారు... బాలకృష్ణ


 

ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అన్నపూర్ణ నిన్న కన్నుమూశారు. తెలుగు పరిశ్రమ మొత్తం చూసి వచ్చి సంతాపం ప్రకటించారు. వారిలో...బాలకృష్ణ మాట్లాడుతూ..‘‘నాకు తల్లిలాంటివారు. నాకెంతో ఇష్టమైనవారు. నేనీ మధ్య ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో రాముని పాత్ర చేసిన సంగతి తెలిసిందే. అందులో వాల్మీకిగా నటించాలని నాగేశ్వరరావుగారిని అడిగితే... అన్నపూర్ణగారు చాలా ప్రోత్సహించారు. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’అన్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ..‘‘నాగేశ్వరరావుగారికి ఇది నిజంగా పూడ్చలేని లోటు. నా సినీ కెరీర్ మొదలైన నాటినుంచి అక్కినేని కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. ఇంటికెళ్లినప్పుడల్లా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారామె. అన్నపూర్ణమ్మగారి మరణం అక్కినేని కుటుంబానికే కాదు... చిత్రపరిశ్రమకే తీరని లోటు. ఈ బాధ నుంచి నాగేశ్వరరావుగారు త్వరగా బయటపడాలని ఆ దేవుడ్ని వేడుకుంటున్నాను’’అన్నారు ఇక ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు మాట్లాడుతూ...‘‘అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ ఆదిదంపతులు. అన్నపూర్ణ స్టూడియోలోకి అడుగుపెడుతుంటే శివపార్వతుల విగ్రహం కనిపి స్తుంది. ఆ విగ్రహం చూడగానే నాకు ఈ ఇద్దరే గుర్తొస్తారు. అన్నపూర్ణ స్టూడియో పతాకంపై నిర్మించిన తొలి చిత్రం ‘కళ్యాణి’కి నేను దర్శ కత్వం వహించాను. ఆ తర్వాత బుచ్చిబాబు, ప్రేమాభిషేకం, యువ రాజుతో కలిపి ఆరు సినిమాలు ఈ సంస్థలో చేశాను. అన్నపూర్ణమ్మ ఎప్పుడూ షూటింగ్‌కి వచ్చేవారు కాదు. కానీ షూటింగ్ పూర్తయ్యే సమయానికి ఏదో ఒకటి తినడానికి తీసుకువచ్చేవారు. ఆ రకంగా ‘అన్నపూర్ణ’ అనిపించుకున్నారు’’ అన్నారు. అలాగే మోహన్ బాబు మాట్లాడుతూ..‘‘ఆ మహాతల్లి మరణవార్త ఓ ‘షాక్’లా నా మనసంతా కదిలించి వేసింది. ఆ కుటుంబంతో నా అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ‘కురుక్షేత్రం’లో నా డైలాగులు ఎంతో నచ్చాయని, ఎన్టీఆర్ తర్వాత అలా డైలాగ్స్ నేను మాత్రమే చెప్పగలనని ఆమె నా గురించి అన్న మాటలు ఈ సందర్భంలో గుర్తొస్తున్నాయి. ఆ స్త్రీమూర్తికివే నా కన్నీటి వీడ్కోలు’’ అన్నారు.

యమదొంగ,సింహాద్రి తరహాలో...ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ము

ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో హైలెట్స్ చాలా ఉన్నాయని చెప్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినవి..ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం..అయితే అదుర్స్ టైప్ లో కాకుండా రెండు పాత్రలూ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని చెప్తున్నారు. అందులో ఒకటి పోలీస్ అధికారిగా అదరకొట్టే పాత్ర అని చెప్తున్నారు. అంతేగాక రెండో పాత్ర అది,సింహాద్రిలను తలపించే రేంజిలో పాత్ర అంటున్నారు. ఆ రేంజి ఎమోషన్స్ ఆ పాత్రలో నింపాడని చెప్తున్నారు. అలాగే చిత్రంలో రెండో హైలెట్ సిస్టర్ సెంటిమెంట్. శంభో శివ శంబో లో చేసిన అభినయ ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు చెల్లిగా చేస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే టచింగ్ సీన్స్ సినిమాకు ప్రాణమై నిలుస్తాంటున్నారు. రాఖీ రేంజిలో సిస్టర్ సెంటిమెంట్ పండుతుందని చెప్తున్నారు. వీటికి అదనపు బలం ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం. యమదొంగ,సింహాద్రి తరహాలో ఈ చిత్రంలో పాటలన్నీ మ్యూజికల్ హిట్స్ అవ్వటమే కాక సినిమా సీన్స్ కు బలం చేకూరుస్తాయని చెప్తున్నారు. చివరగా అపజయమెరగని దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ. వరస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణను సింహా చిత్రంతో మరోసారి హిట్ పధంలో నడిపించిన ఘనత బోయపాటికే దక్కింది. ఈ చిత్రంతో తను యంగ్ హీరోల చిత్రాలను డైరక్ట్ చేసే కంటిన్యూ అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నాడు..అందుకు తగిన కృషి చిత్రంలో కనిపిస్తుందని చెప్తున్నారు.ఇక దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష,కార్తిక నటిస్తున్నారు.తొట్టింపూడి వేణు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బావగా కనిపించనున్నారు.భానుప్రియ ..ఎన్టీఆర్ కి తల్లిగా చేస్తోంది.ఇలా ఎక్కడా రాజీపడకుండా అద్బుతమైన తారాగణంతో ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయాలని భావిస్తున్నారు.

న్యూఇయర్ వేడుకలకు ముస్తాబు

కాల గమనంలో ఎన్ని వసంతాలు మన కళ్ల ముందు మంచులా కరిగిపోతున్నా కొత్త సంవత్సరం రాక నూతనోత్సాహమే. పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరాన్ని వినూత్నంగా ఆహ్వానం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు.న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటే.. మరికొందరు పుణ్యక్షేత్రాలకు పయనమవుతున్నారు. అలా వీలు కాని వాళ్లు మాత్రం స్థానికంగానే అంబరాన్నంటే సంబరాల్లో మునిగిపోవాలని పరితపిస్తున్నారు. కొత్త ఏడాది ప్రారంభానికి రెండు రోజులుండగానే ‘అనంత’ సుందరంగా ముస్తాబవుతోంది. వన్ ప్లస్ వన్ ఆఫర్లంటూ అప్పుడే వ్యాపారస్తులు న్యూఇయర్ బొనాంజా ప్రకటిస్తున్నారు.మద్యం కూడా ఆఫర్లలో లభిస్తుండడంతో మద్యంప్రియులు హుషారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. వస్త్రదుకాణాలు కిటకిటలాడుతున్నాయి. పలు విద్యా సంస్థలు వేడుకలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కాగా కాలం తెచ్చిన మార్పుతో గ్రీటింగ్ కార్డులు వెలవెలబోతున్నాయి. సెల్ ఫోన్‌తో క్షణాల్లో శుభాకాంక్షలు చెప్పుకునే వీలుం డడంతో అందరూ వాటిపైనే ఆసక్తి చూపుతున్నారు. కొత్త ఏడా ది తమ జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉండడంతో జ్యోతిష్కులకు డిమాండ్ పెరి గింది. గురువారం నగరంలోని రెస్టారెంట్లు, ఐస్ క్రీం పార్లర్‌లు, బేకరీలు విద్యుద్దీపాలంకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మరోసారి పెరగనున్న పెట్రోల్ ధరలు ?

జనవరి ఒకటి నుంచి పెట్రోల్‌ ధర పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రూపాయి విలువ క్షీణించడం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధర పెరగడంతో పెట్రోల్‌ ధరను పెంచేందుకు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. లీటర్‌ ధర 2 రూపాయల 25 పైసల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కంపెనీలు రూపాయి 90 పైసలు పెంచుతాయని, దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్ను అదనమని భావిస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌ ధరను సమీక్షిస్తాయి. డిసెంబరు 15 నాటి సమీక్షలో లీటర్‌కు 65 పైసలు పెంచాలని తొలుత భావించాయి. అయితే రిజర్వ్‌ బ్యాంకు జోక్యం చేసుకుని రూపాయి పతనాన్ని అడ్డుకోవడంతో ఆయిల్‌ కంపెనీలు ధర పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాయి. అయితే ఇప్పుడు రూపాయి పతనంతో పాటు ముడి చమురు ధర పెరగడంతో పెట్రోల్‌ ధర పెంచకతప్పదని కంపెనీలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ధర పెంచొద్దని చెబితే తప్ప ఆయిల్‌ కంపెనీలు తమ నిర్ణయంపై వెనక్కు తగ్గే అవకాశం లేదు.

రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది ... చంద్రబాబునాయుడు

దేశంలో అవినీతే తీవ్రవాదం కన్న పెద్ద సమస్యని, అవినీతిని నిరోధించాల్సిన అవసరం ఉందని, అవినీతిని రూపు మాపడానికి సమర్ధవంతమైన చట్టాలు రావాలని తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అవినీతిని రూపుమాపే ఉద్దేశం, చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన విమర్శించారు. లోక్‌పాల్ బిల్లును కేంద్ర ప్రభుత్వం నీరుగార్చిందంటూ బాబు ధ్వజమెత్తారు.ఈ సందర్భంగా శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ పటిష్టవంతమైన లోక్‌పాల్ బిల్లు కోసం తుదివరకు పోరాటం చేస్తామని అన్నారు. మద్యం అమ్మకాల్లో దేశంలోనే రాష్ట్రన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. సమాజాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మద్యానికి బానిసలుగా మారుస్తుందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం అమ్మకాలను నియంత్రిస్తే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మద్యంనకు ప్రోత్సాహాకాలు ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 4.12 కోట్ల లిక్కర్ కేన్‌లు, 3.49 కోట్ల బీర్ కేన్‌లు ఉత్పత్తి చేస్తున్నారని ప్రతి లిక్కర్ కేన్‌కు ప్రభుత్వానికి రూ. 1549 లాభం వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, ఒక వ్యక్తికి ఒకే షాపు రావాలన్న నిబంధనలున్నప్పుడు బొత్సకు 31 షాపులెలా వచ్చాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వం మద్యం సిండికేట్లపై ఏసీబీ నివేదికను ఎందుకు బయటపట్టడం లేదని బాబు ప్రశ్నించారు. మద్యం సిండికేట్లకు నిరసనగా జనవరి 3,4,5 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా బైక్‌ ర్యాలీలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.

శ్రీశైలంలో డిజిటల్ విద్యాభ్యాసం

శ్రీశైల ప్రాజెక్ట్ కాలనీలో విద్యార్థుల కోసం అధునాతన బోధనా పద్దతిలో భాగంగా డిజిటల్ బోర్డు ద్వారా విద్యాబోధనను పాఠ్యాంశాలగా బోధించేందుకు  మధ్యాహ్నం జెన్‌కో ఛీప్ ఇంజనీరు లక్ష్మినారాయణ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. స్థానిక డిఎవి ఉన్నత పాఠశాలలో అన్ని తరగతులకు డిజిటల్ తరగతులను నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయులు సతీష్ చంద్ర కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా పోటీ ప్రపంచంలో అంచెలంచెలుగా పెరుగుతున్న బోధనాపద్దతులకు ధీటుగా మా విద్యార్థులకు కూడా మెరుగైన విద్యను అందించేందుకు ఈ డిజిటల్ బోర్డుల ద్వారా విద్యను బోధించేందుకు రంగం సిద్ధం చేశామని ఆయన అన్నారు. ఈసందర్భంగా జెన్‌కో సిఇ మాట్లాడుతూ ఈ పద్దతుల ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకుని తెలివితేటలను మెరుగుపరుచుకుని తద్వారా ఉత్తీర్ణతాశాతాన్ని పెంచుకోవచ్చని దాని ద్వారా పాఠ్యాంశాలపై మంచి పట్టును కూడా సాధించవచ్చునని ఈ కార్యక్రమంలో జెన్‌కో రైట్ బ్యాంక్ సూపరింటెండింగ్ ఇంజనీరు రాంబాబు, ఇఇలు రవీంద్ర, డిఇలు సత్యసాయిబాబా, శ్రీనివాసులు, ఎడిఇ రామకృష్ణారెడ్డి, అకౌంట్ అధికారులు ఎమ్‌ఎస్‌ఆర్‌కె శర్మ, శ్రీ్ధర్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా శ్రీశైలంలో ఆర్జిత సేవలు రద్దు

ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రం, అష్టాదశ శక్తి పీఠమైన శ్రీశైల దేవస్థానంలో కొలువున్న శ్రీ భ్రమరాంబిక, మల్లిఖార్జునస్వామి దేవస్థానంలో రానున్న నూతన సంవత్సర సందర్భంగా ఆదివారం రోజున శ్రీశైల దేవస్ధానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహణాధికారి వి హనుమంతరావు తెలిపారు. నూతన సంవత్సరంలో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారనే ముందస్తు జాగ్రత్త చర్యగా ఆరోజున అన్ని ఆర్జిత సేవలను రద్దుచేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. శాశ్వత కల్యాణాలు త ఉన్నా భక్తులు యధావిధిగా కల్యాణాలు నిర్వహించబడతాయని అంతేకాక ఆ రోజున ఆలయ వేలాలలో కూడా మార్పులు చేయనున్నారు. వేకువ జాముననే 3:30 గంటలకు ఆలయద్వారాలు తెరచి మంగళవాయిద్యాలు 4గంటలకు సుప్రభాత సేవ, 4:30గంటలకు మహామంగళహారతి నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు.

Thursday, 29 December 2011

కాణిపాకం విచ్చేసే భక్తులకు జనవరి ఫస్ట్‌కు విస్తృత ఏర్పాట్లు

జనవరి ఒకటవ తేదీ కాణిపాకం విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు డీఆర్వో శేషయ్య తెలిపారు.  సాయంత్రం ఈవో కార్యాలయంలో జనవరి ఫస్ట్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి ఫస్టున లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారుల ను ఆదేశించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. వీఐపీ భక్తుల వల్ల సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులందరికీ శీఘ్రదర్శనం కల్పించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత కల్పించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఆలయ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా ఎప్పటి కప్పుడు శానిటేషన్ పనులను పరిశీలించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశిం చారు. రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు ఆయన సూచించారు. ఈ సమావేశానికి ఎంపీడీవో పార్వతమ్మ, డీపీఆర్వో గైర్హాజర్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌కో ఏడీ మోహన్‌రాజ్ మాట్లాడు తూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా 160 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను అందుబాటులో ఉంచుతామని తెలిపా రు. అనంతరం మండల వైద్యాధికారిణి షర్మిష్టారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌డీవో సుబ్రమణ్యేశ్వరరెడ్డి, డీఎస్పీ శిల్పవల్లి, సీఐ శ్రీకాంత్, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ గురుప్రసాద్, తహసీల్దార్ రంగస్వామి తదితరు లు పాల్గొన్నారు.

ప్రపంచస్థాయికి తిరుపతి జూ అభివృద్ధి

ఆసియా ఖండంలో విస్తీర్ణత దృష్ట్యా రికార్డు సాధిం చిన తిరుపతి జంతు ప్రదర్శన శాలను ప్రపంచస్థాయికి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుం దని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి తెలిపారు. కర్ణాటక రాష్ట్రం మైసూరు జూ నుంచి తీసుకువచ్చి న మూడు అడవి దున్నల ఎన్‌క్లోజర్లను ఆమె జెండా ఊపి ప్రారంభిం చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తిరుపతికి వస్తున్న యాత్రికులు, సందర్శకులను దృష్టిలో ఉంచుకుని తొలిసారిగా ఇక్కడి జూలో అడవి దున్నలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఒక మగ, రెండు ఆడజాతి దున్నలను ఇక్కడికి తీసుకువచ్చి అందుకు బదులుగా మైసూరు జూకు 4 ఎలుగుబంట్లను ఇక్కడి నుంచి తరలించి నట్టు తెలిపారు. ఈ అడవి దున్నలకు తిరుపతి జూ వాతావరణం అనువుగా ఉంటుందన్నారు. వీటి జీవితకాలం 20-25 సంవత్సరాలు ఉంటుందన్నారు. వీటి సంరక్షణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నట్టు మంత్రి పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా టీడీపీ నాయకులు రసవత్తరంగా ‘టికెట్’ రాజకీయం

అనంతపురం అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు వస్తాయనే ఆలోచనతో టీడీపీ నాయకులు టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. తనకు టికెట్ ఇవ్వాలని నియోజక వర్గ ఇన్‌చార్జ్ మహాలక్ష్మి శ్రీనివాస్, ..కాదు తనకే ఇవ్వాలని ప్రభాకర్ చౌదరి, తమ కుటుంబంలో ఒకరికి కేటాయించాలని సైఫుల్లా....ఇలా ఎవరికివారు చంద్రబాబు వద్ద వాణి వినిపించారు. తాజాగా బుధవారం సైఫుల్లా తనయుడు జకీవుల్లా మరోసారి చంద్రబాబు వద్ద బలప్రదర్శన చేసేందుకు రాజధానికి బయలుదేరారు. మహాలక్ష్మి శ్రీనివాస్‌కు టికెట్ దక్కనీయకుండా సైఫుల్లా, ప్రభాకర్ చౌదరి పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు వద్ద పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. టికెట్ ఎవరికివ్వాలో తనకు తెలుసనని ఆయన ముగ్గురికీ చురకలంటించినట్లు తెలిసింది. ముందుగా జనచైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని, తర్వాత టికెట్ సంగతి తేలుస్తానని చంద్రబాబు సూచించారు. దీంతో ఈ నెల 21 నుంచి యాత్ర చేపట్టేందుకు మహాలక్ష్మి ప్రణాళిక రూపొందించగా, టికెట్ విషయం తేల్చకుండా ప్రజల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని సైఫుల్లా పట్టుబట్టడంతో బ్రేక్ పడింది. ఎట్టకేలకు ఈ నెల 25 నుంచి యాత్ర ప్రారంభించారు. ఇందులో సైఫుల్లా వర్గం పాల్గొనలేదు. ఈ క్రమంలో బుధవారం సైఫుల్లా తనయుడు జకీవుల్లా తన వర్గీయులతో సమావేశం నిర్వహించారు. అనంతరం దాదాపు వంద వాహనాల్లో హైదరాబాద్ పయనమయ్యారు. రాజధానిలో 1,500 మందికి భోజన ఏర్పాట్లు కూడా చేశారు. టికెట్‌పై తాడోపేడో తేల్చుకున్న తర్వాతే తిరిగి వస్తామని, అంతవరకూ అక్కడే మకాం వేస్తామని తమ వర్గం నాయకులతో జకీవుల్లా చెప్పారు. పార్టీ కోసం తన సోదరుడిని కోల్పోయామనే విషయాన్ని చంద్రబాబుకు గుర్తు చేసి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలనే యోచనలో జకీవుల్లా ఉన్నారు. టికెట్ రాకపోతే మరో పార్టీలో చేరేందుకూ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. జకీవుల్లా తీరుపై ఇటు మహాలక్ష్మి, అటు ప్రభాకర్ చౌదరి గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

విష్ణు ఈ సారి తప్పకుండా కొడతాడంటున్న...మోహన్ బాబు

తన కుమారుడు విష్ణు ఈ సారి తప్పకుండా హిట్ కొడతాడంటున్నారు సినీయర్ నటుడు మోహన్ బాబు. విష్ణ, హన్సిక జంటగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ సమర్పణలో 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఓ వినోద భరితమైన చిత్రాన్ని నిర్మించబోతోంది. జనవరి 5న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభ కానున్న నేపథ్యంలో మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ విష్ణు కెరీర్లోనే అద్భుతమైన హిట్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం, చక్రి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని నాలుగు పాటలు ఇప్పటికే రికార్డు చేయడం పూర్తయిందన్నారు. 2012లో ఈ సినిమా తమ బేనర్ లో మంచి విజయాన్ని సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. లక్ష్మి ప్రసన్న నిర్మాతగా రూపొందుతున్న ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం కూడా మనోజ్ కెరీర్ లో మంచి హిట్ గా నిలుస్తుందని, బయటి బ్యానర్లో మనోజ్ నటిస్తున్న మిస్టర్ నోకియా చిత్రం కొత్త సంవత్సరంలో ఘన విజంయ సాధిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

మల్టీస్టారర్ చిత్రాలు పెరిగేనా?

ప్రతి ప్రేక్షకునికి ఇద్దరు అభిమాన నటులుంటారు. వారిద్దరూ కలిసి, ఒకే సినిమాలో నటిస్తే చూడాలని, అన్నివర్గాల ప్రేక్షకులకు వుంటుంది. పాత తరం నటుల్లో దాదాపు అగ్ర హీరోలందరూ కలిసి నటించి, అభిమానుల్ని అలరించారు. కానీ నేటి తరం ప్రేక్షకులకు ఆ కమ్మని అనుభూతి కలగానే మిగిలిపోయింది. ఆరోజుల్లో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు లాంటి అగ్రనటులు ఎటువంటి భేషజాలు లేకుండా కలిసి నటించి అభిమానుల్ని ఆనందపరిచారు.ఎందుకో తెలియదు గాని ఈనాటి హీరోలు మల్టీస్టారర్ సినిమాల గురించి ఆలోచించడం లేదు. ఏ నటున్నైనా ఈ విషయం గురించి ప్రస్తావిస్తే, సరైన కథ దొరికితే, తప్పకుండా కలిసి నటిస్తామని చెబుతుంటారు. సరైన కథలంటే ఏంటో వారికే తెలియాలి. తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో చక్కని కథారచయితలు, దర్శకులున్నారు. వీరు ఆ మాత్రం కథల్ని అందించలేరా? ఇప్పుడు ఇక్కడి హీరోలకు కలిసి నటించేందుకు కావాల్సింది కథలు మాత్రమే! సాటి హీరోలతో కలిసి నటించాలన్న అభిలాష లేకపోవడంవల్లనే, మల్టీ స్టారర్ సినిమాలు రావడం లేదు. అప్పట్లో కొనే్నళ్ళపాటు చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళడం వలన, ఇక వారి అభిమానుల ఆశ, అడియాసగానే మిగిలిపోయింది. కాబట్టి ఇప్పుడైనా స్టార్ ఇమేజ్ వున్న హీరోలు మల్టీ స్టారర్ చిత్రాలపై దృష్టిసారిస్తే మంచిది.ఇలా నటించడంవలన అభిమాన ప్రేక్షకులకు ఆనందం పంచడమే కాకుండా, పరిశ్రమలో సుహృద్భావ వాతావరణంకోసం కృషిచేసిన వారిగా చెప్పుకోబడతారు.ఇటీవల అనౌన్స్ అయిన మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకులకు కాస్త ఊరటగా అనిపించింది. వెంకటేష్ మహేష్‌బాబుతో కలిసి నటించబోతున్న ‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’’అనే చిత్రం, రామ్‌చరణ్ తేజ్ అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తున్న సినిమాలు రాబోయే రోజుల్లో మల్టీస్టారర్ సినిమాల వాతావరణాన్ని సృష్టిస్తాయని తెలుగు సినీ ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ గోపీచంద్ లాంటి యంగ్ హీరోలు కూడా ఒకరితో ఒకరికి కలిసి నటించాలని వుందన్న విషయాన్ని, బయటపెట్టడం అభినందనీయం. ఇప్పుడున్న స్టార్ హీరోలలో నాగార్జున, మోహన్‌బాబు, శ్రీహరి, జగపతిబాబు, శ్రీకాంత్, రవితేజ, అల్లరి నరేష్ మొదలైనవారు మల్టీ స్టారర్ సినిమాలకు సై అంటున్నారు.వీరిలా అందరు హీరోలు ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది. కొంతకాలంపాటు హీరోలందరూ భేషజాలు పక్కనపెడితే, సూపర్ హిట్ మల్టీస్టారర్ సినిమాలు వస్తాయి. అప్పుడు మనం బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, నాని, గోపీచంద్ వంటి హీరోలు ఒకరితో ఒకరు కలిసి నటిస్తే, చూసి తరిస్తాం. అప్పుడు బాక్స్ ఆఫీసులు కూడా పచ్చనోట్లతో కళకళలాడుతాయి.

రామ్‌చరణ్ పూర్తి చేస్తాడు, పదవి ఏదైనా ఓకే: చిరంజీవి

మిగిలిన తన సినీ ప్రస్థానాన్ని తన తనయుడు రామ్‌చరణ్ తేజ పూర్తి చేస్తాడని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు. కాంగ్రెసు పార్టీ ఏ పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు. ఏ పదవి ఇచ్చినా స్వీకరించి పార్టీ కోసం పని చేస్తానన్నారు. తాను పదవి కోసం ఎప్పుడూ పాకులాడదేలన్నారు. తన బలం, బలహీనత రెండూ అభిమానులేనని ఆయన అన్నారు.కాగా చిరంజీవి వర్గం శాసనసభ్యులకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రెండు పదవులు ఇచ్చేందుకు అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సిఎం కిరణ్ తన ఢిల్లీ పర్యటనలో చిరు వర్గానికి మంత్రి పదవుల అంశంపై కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

జనవరిలో వ్యవసాయ అధ్యయన కమిటీ పర్యటన

'జిల్లాలో వ్యవసాయ రంగం నష్టం పోవడానికి కారణాలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటు అయిన కేంద్ర క మిటీ జనవరిలో.. జిల్లాలో పర్యటన చేస్తుంది. ఇక్కడి వాస్తవ పరిస్థితులు, పక్కా సమాచారం సేకరించి ఆ బృం దానికి నివేదికలు ఇవ్వండి. పర్యటన లో కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రణాళిక బద్ధంగా చేపట్టేందు కు సిద్ధం చేయాల'ని అధికారులకు రె వెన్యూ శాఖ మంత్రి రఘవీరారెడ్డి ఆదేశించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనవరిలో 12 మంది సభ్యులతో కూడిన కేంద్ర బృం దం జిల్లాలో పర్యటించనుందన్నారు. జిల్లా వ్యాప్తంగా పర్యటించి సమగ్రం గా పరిశీలన జరిపి జిల్లా వ్యవసాయ అభివృద్ధి ప్రణాళికను తయారుచేస్తారన్నారు ఇందు కోసం వారికి అవసరమైన పూర్తి సమాచారాన్ని ప్రణాళిక బ ద్ధంగా రూపొందించి అమలు చేయాలన్నారు. వారికి సరైన దిశానిర్దేశం చేయాలన్నారు. రైతులు ఇబ్బందుల తెలుసుకుని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జి ల్లాకు రెండు టీఎంసీల నీటిని కేసీకెనాల్ ద్వారా విడుదలకు ఆదేశాలు ఇ చ్చారన్నారు. సాగునీటి కోసం రైతులు ఎలాంటి ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. అన్ని ప్రాంతాలకు కచ్చితంగా సాగునీరు అందిస్తామన్నారు.

Wednesday, 28 December 2011

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌తో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ‘ఢీ’

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వాదులాటకు దిగినట్లు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీపై ముఖ్యమంత్రి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డికి, రవీంద్రా రెడ్డికి మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. 104 సర్వీసుల ఉద్యోగుల తొలగింపుపై ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఎక్కువగా ఉన్న 104 సర్వీసుల ఉద్యోగులను తొలగించాలని రవీంద్రా రెడ్డి పట్టుబట్టగా అలా తొలగిస్తే సమస్యలు వస్తాయని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. దీంతో రవీంద్రా రెడ్డి సమావేశం నుంచి మధ్యలో ఆగ్రహంగా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. 104 సర్వీసుల్లో హెచ్ఎంఆర్ఐ అవసరానికి మించి ఉద్యోగులను నియమించిందని, ఎక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించే విషయంపై పరిశీలిస్తున్నామని డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రితో ఏ విధమైన వాగ్వివాదం జరగలేదని ఆయన చెప్పారు. 108 సర్వీసులను నెలలోగా అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. 104 సర్వీసులను ప్రభుత్వమే నిర్వహించాలా, కొత్త టెండర్లను ఆహ్వానించాలా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, ఆరోగ్యశ్రీ పథకాన్ని ట్రస్టు పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దానిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో జివికె నుంచి 108 సర్వీసులను తప్పిస్తారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీకి సిద్ధమే....భూమానాగిరెడ్డి

రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉన్నారని వెనకాడే ప్రసక్తే లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ సభ్యులు మాజీ ఎంపి భూమానాగిరెడ్డి పేర్కొన్నారు.  గోస్పాడులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు, ఆళ్ళగడ్డ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీకి సిద్ధంగా ఉన్నామని భూమా స్పృష్టం చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి రాజీనామా చేసిందన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రైతుల అభ్యున్నతికి పాటుపడుతున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పట్టి గెలిపిస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెంచిన ధరలతో రైతులు, సామాన్య ప్రజానికం కొట్టుమిట్టాడుతూ ఇబ్బందులు పడుతున్నారని ఇంత అసమర్థత ప్రభుత్వాన్ని ఎన్నడు చూడలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. రైతుల అభ్యున్నతే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఆళ్ళగడ్డ ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్దంగా ఉన్నామని మాజీ ఎంపి భూమానాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

రాలయసీమ జిల్లాలో మాఫియాకు రాజకీయ అండ!

రాలయసీమ జిల్లాలో అడ్డదారిలో సంపాదనకు అలవాటు పడిన వారు మాఫియా మారి రాజకీయ అండదండలతో చెలరేగి పోతున్నారు. వీరిని కాదని సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుందన్న ప్రశ్న ప్రజల నుంచి ఎదురవుతోంది. మాఫియాకు రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులకు అధికారులు అండగా ఉన్నంత కాలం ఏ అక్రమ వ్యవహారాన్ని అడ్డుకోలేరని వారు తేల్చి చెబుతున్నారు. తమ కష్టం తమకు తప్పదని మాఫియా విషయంలో జోక్యం చేసుకోవడం ప్రమాదమే కాని ప్రయోజనం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మద్యం, ఇసుక దందాలపై హడావుడి చేసి దాడులు నిర్వహించి భరతం పట్టాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం వాటి అమలులో శ్రద్ధ చూపకపోవడమే ఇందుకు నిదర్శనమని ప్రజలు పేర్కొంటున్నారు. జిల్లాలో మద్యం అధిక ధరలకు విక్రయించడం, ఇసుక అక్రమ రవాణాతో పాటు అడవులను కొల్లగొడుతూ ఎర్ర చందనం, గనులను తవ్వుతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. వీటిపై ఉక్కు పాదం మోపితే ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున నిధులు సమకూరుతాయి. అయితే ఎక్కడా, ఏ అధికారి ఆ దిశగా అడుగులు వేస్తున్న దాఖాలు కనిపించడం లేదు. అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కుల మేడలపై మేడలు కడుతూ, బీరువాల్లో కరెన్సీ నోట్ల కట్టలను పేర్చుకుంటున్నారు. ఖనిజ సంపదతో పాటు మద్యం వ్యవహారంలో రాజకీయ నాయకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలు ఉండటంతో మాఫియాలకు తలొంచుతూ వారి వైపు పోలీసు, రెవిన్యూ, గనులు, విజిలెన్స్ అధికారులు కనె్నత్తి చూడడం లేదు. పరోక్షంగా సంబంధాలు ఉన్న రాజకీయ నాయకులు తమ మద్దతుగా ఉన్నందుకు వారికి భారీగా నజరానా ముడుతోందన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ఇక ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్న నాయకులు అధికారుల సహకారంతో తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో అధికార, ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేసుకునే విషయం బహిరంగంగా జరిగితే లోలోన మాత్రం ఒక అభిప్రాయానికి వచ్చి తమ పని చక్కబెట్టుకుంటారంటున్నారు. మద్యం, ఇసుక, కలప, మైనింగ్ మాఫియాలపై నాయకులు చేసే హడావుడి కేవలం తమను నమ్మించడానికి చేసే ప్రయత్నమేనని చెబుతున్నారు. నిజాయితీ కలిగిన రాజకీయ నాయకులను వెతికితే ఎక్కడో ఒకరో ఇద్దరో కనిపించినా వారు కూడా మాఫియాను, వారికి అండగా ఉన్న వారిని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. జిల్లాలో చెలరేగుతున్న మాఫియాను వారికి అండగా ఉన్న రాజకీయ నాయకులు, అధికారుల ఆగడాలను అడ్డుకోవాలంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే తప్ప ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. మద్యం, ఇసుకపై దాడులు చేయించిన ప్రభుత్వం మద్యం ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, ఇసుకను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు బుట్టదాఖలవుతున్నాయి. ప్రజల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించనంత కాలం సామాన్యుడికి మేలు జరిగే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. అక్రమార్కులను కట్టడి చేయనంత కాలం సామాన్యుడికి కష్టాలు తప్పవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.