Saturday, 26 November 2011

‘రాజన్న’ సినిమా పాటలు ఆడియో వేడుక లేకుండానే విడుదల

అక్కినేని నాగార్జున తాజా సినిమా ‘రాజన్న’ సినిమా పాటలు ఆడియో వేడుక లేకుండానే విడుదల చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి సందడి లేకుండా సైలెంట్ గా శనివారం పాటలు మార్కెటోకి విడుదలయ్యాయి. కొన్ని వెబ్ సైట్లలో ఇప్పటికే రాజన్న పాటలు అందుబాటులోకి వచ్చాయి. శనివారం సాయంత్రం నుంచి రాజన్న పాటలు ఐటూన్స్ ద్వారా డౌన్ లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజన్న సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.

సచిన్ వందో సెంచరీ ఎందుకలా చేతులెత్తేస్తున్నాడు?

సచిన్ వ్యక్తిగతంగా ఒత్తిడికి గురవుతున్న సమయంలోనే, అభిమానుల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి ఉందనే విషయాన్ని కూడా ఆయన మరిచిపోయినట్లు లేరు. అందుకే అతను వందో సెంచరీకి కొత్తగా ఆడుతున్న ఆటగాడిలా వ్యవహరిస్తున్నాడు.
సొంత గడ్డపై సచిన్ టెండూల్కర్ తన వందో సెంచరీ సాధించి వంద బంగారు నాణేలను అందుకోవడమే కాకుండా కోట్లాది భారత అభిమానుల గుండెల్లో హర్షాతిరేకాలు నింపుతాడని విశ్వాసం గట్టిగానే ఉండింది. కానీ వెస్టిండీస్ బౌలర్ రాంపాల్ కోట్లాది మంది భారతీయులకు గుండె కొతనే మిగిల్చాడు. సెంచరీకి ఆరు పరుగుల దూరంలో ఉండగా సచిన్ టెండూల్కర్‌ను రాంపాల్ అవుట్ చేశాడు. టెండూల్కర్ రాంపాల్ వేసిన బంతికి సెకండ్ స్లిప్‌లో సామీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. క్రికెట్ ప్రపంచ కప్ పోటీల నుంచి సచిన్ టెండూల్కర్ వందో సెంచరీ కోసం నిరీక్షిస్తున్నాడు. వెస్టిండీస్‌పై 90ల్లో అవుట్ కావడం ఆయనకు ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు అతను టెస్టుల్లో 90 పరుగులు దాటిన తర్వాత పదో సారి అవుటయ్యాడు. వన్డేల్లో అలా అవుట్ కావడం 18వ సారి. ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా పేరు పొందిన సచిన్ టెండూల్కర్ కూడా మానవ మాత్రుడే. అతనిపై విపరీతమైన ఒత్తిడి పనిచేస్తున్నట్లు ఇటీవలి కాలంలో అవుటవుతున్న తీరు తెలియజేస్తోంది. తన సహజమైన ఆటను కూడా అతను ఒత్తిడిలో మరిచిపోతున్నట్లున్నాడు. తాను ఓ ఫీట్‌ను సాధించాల్సిన అవసరం ఉందనే భావన అతని గుండెను, మెదడును నిత్యం తొలిచి వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటిలాగే తాను మరో మ్యాచ్ ఆడబోతున్నాననే అభిప్రాయంతోనే సచిన్ టెండూల్కర్ మైదానంలోకి దిగి, వందో సెంచరీ చేయాలన్న విషయాన్ని మనసులోంచి తుడిచి వేసి ఆడితే సచిన్‌కు సెంచరీ సాధించడం బహుశా, కష్టమైన పని కాకపోవచ్చు.

కర్నూలు జిల్లాకు మూడు మునిసిపాలిటీలు ఏర్పాటు

జిల్లాలో కొత్తగా మరో మూడు మునిసిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ పంచాయతీలను మునిసిపాలిటీలుగా మార్చేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. ప్రసుత్తం కర్నూలు నగరపాలక సంస్థతో పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్ మునిసిపాలిటీలు ఉన్నాయి.
మునిసిపాలిటీలుగా మారిస్తే ప్రభుత్వం విధించే పన్నులు భరించలేమని.. పంచాయతీలుగానే కొనసాగించాలని ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ పంచాయతీల నుంచి తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం మునిసిపాలిటీలుగా మారుస్తూ నిర్ణయించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే సామాన్య ప్రజలు పట్టణాల్లో నివసించే పరిస్థితి లేదు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వం నగరపాలక, మునిసిపాలిటీల్లో 300 నుంచి 500 శాతం ఇంటి, ఆస్తి పన్ను పెంచిన విషయం తెలిసిందే

మున్సిపాలిటీగా మైదుకూరు

మైదుకూరు మేజర్ పంచాయతీ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీఓ జారీ చేసింది. జిల్లాలో ఒక్క మేజర్ పంచాయతీకే ఈ అవకాశం దక్కింది. లింగాలదిన్నె, శెట్టివారిపల్లె పంచాయతీలతో పాటు యల్లంపల్లె పంచాయతీలోని నానుబాలపల్లె, రాయప్పగారిపల్లె, షాపూరు గ్రామాలను కలుపుతూ అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది

ఆంధ్రా బ్యాంక్ సామాన్యు డి సేవకే

సామాన్యు డి సేవకే ఆంధ్రా బ్యాంక్ పునరంకితమైందని బ్యాంక్ డెప్యూటీ జనరల్ మేనేజర్ డీవీఎన్.రావు అన్నారు. ఆంధ్రాబ్యాంక్ జోనల్ కార్యాలయంలో  ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుపతి జోన్ పరిధిలో ఇప్పటి వరకు రూ. 4255.66 కోట్ల వ్యాపారం చేశామన్నారు. 3307.66 కోట్ల డిపాజిట్లు సేకరించామన్నారు. 54 బ్రాంచ్‌ల ద్వారా సేవలందిస్తున్న ట్టు చెప్పారు. వ్యవసాయం, గృహనిర్మాణం, విద్య, చిన్నతరహా పరిశ్రమలకు రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పా రు. రూ.107.2 కోట్ల గృహ రుణాలు, రూ. 62.16 కోట్ల విద్యా రుణాలు, రూ. 144.50 కోట్లు బంగారు నగలపై రుణాలు ఇచ్చామన్నా రు. పుంగనూరు, ప్రొద్దుటూరులో కొత్త బ్రాంచ్ లు ఏర్పాటు చేశామన్నారు. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని తెలిపా రు. ఆంధ్రాబ్యాంక్ సేవల పట్ల అసంతృప్తికి గురయ్యే వినియోగదారులు 9666606060కు మెసేజ్ పంపవచ్చన్నారు. 24 గంటల్లో సమస్య ను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రాబ్యాంక్ ద్వారా ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డ్స్ పథకాన్ని ప్రవేశ పెట్టినట్టు ఆయన తెలిపారు. ఏజీఎం సాయిప్రసాద్, చీఫ్ మేనేజర్లు నరసింహారావు, శ్రీధర్‌శాస్త్రి పాల్గొన్నారు