Sunday, 13 November 2011

చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలో సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని రాయలసీమ డిఐజి చారుసిన్హా తెలిపారు. శనివారం ఆమె మదనపల్లె ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ అనంతరంపురం, కడప, చిత్తూరు జిల్లా సరిహద్దులలో జరుగుతున్న పేకాట, వ్యభిచారాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గతంలో జిల్లా సరిహద్దులలో నకిలీ నక్సలైట్ల ప్రభావం ఉండేదని, ఇటీవల కాలంలో కూంబింగ్, దాడులు నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో సమస్య తగ్గుముఖం పట్టిందన్నారు.వ్యభిచార గృహాల నిర్వహణపై ప్రజలు స్వచ్చందంగా సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా అదుపు చేయడంలో పోలీసులు పనితీరు భేషుగ్గా ఉందన్నారు. జిల్లాలో పల్లెనిద్ర ద్వారా ప్రజలలో చైతన్యం వస్తొందని చెప్పారు. జిల్లాలోనే కాకుండా తన పరిధిలో ఉన్న పెండింగ్ కేసుల్ని చాలావరకు పరిష్కరించామని చెప్పారు. పాత్రికేయుల వాహనాలకు ప్రత్యేకంగా నెంబరు ఇచ్చి ఇతర వాహనాలపై పేర్లు ఉంటే వారిపై చర్యలకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. మదనపల్లెలో ట్రాఫిక్ సలహా కమిటీ సమావేశం ద్వారా ట్రాఫిక్‌ను పూర్తిగా కాకుండ కొంతమేరకైనా తగ్గించవచ్చునని తెలిపారు. ట్రాఫిక్ సమస్యను పోలీసులతో మాత్రం సాధ్యం కాదని, మున్సిపల్, రహదారుల శాఖ, మోటారు వెహికల్, ఆర్టీసీ, ప్రవేట్ లారీ యాజమాన్యం, ఆటోల సంఘాల యూనియన్ సహకారంతో సాధ్యమవుతుందని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు గతంలో ప్రతిపాదనలు పంపినట్లు ఆమె తెలిపారు.

సత్యసాయి భక్తులు మెచ్చే విధంగా ‘బాబా-సత్యసాయి’ చిత్రం

ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రేక్షకులు, సత్యసాయి భక్తులు మెచ్చే విధంగా ‘బాబా-సత్యసాయి’ చిత్రం వుంటుందని ఆ చిత్రదర్శకులు కోడిరామకృష్ణ తెలిపారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న అనంతరం బాబా బాల్యజీవిత విశేషాలను, సేవాకార్యక్రమాలకు కేంద్రబిందువైన పుట్టపర్తిలో చిత్రీకరణకు అనుమతి కోరే విషయంపై ట్రస్టువర్గాలతో చర్చించారు. ఐటిభవన్ చేరుకున్న కోడిరామకృష్ణ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు కార్యదర్శి ప్రసాద్‌రావు, ట్రస్టుసభ్యులు ఆర్‌జె రత్నాకర్, ఎస్‌వి గిరిలతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా పుట్టపర్తిలోని సూపర్‌స్పెషాలిటి హాస్పిటల్, యూనివర్శిటీ భవనం, సత్యసాయి మాతృమూర్తుల సమాధులు, ప్రశాంతినిలయంలోని కొన్ని ప్రాంతాల్లో చిత్రీకరణకు అనుమతి ఇవ్వాలని ట్రస్టుసభ్యులను అభ్యర్థించారు. ఇందుపై ట్రస్టుసభ్యులు మాట్లాడుతూ సత్యసాయి జయంతి వేడుకల తదుపరి చిత్రీకరణకు ట్రస్టుపరంగా అన్ని సహకారాలు అందిస్తామని రత్నాకర్ హాబఈ ఇచ్చారు. ప్రధానంగా వీరి సంభాషణలో బాబా-సత్యసాయి చిత్రం దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం వుందని, అందువల్ల దేశీయంగా వివిధ రాష్ట్రాల్లో నటీనటులను పాత్రకు తగినట్టుగా ఎంపిక చేశామన్నారు. కృత్రిమంగా కూడా సహజపాత్రకు అనుగుణంగా సరిపోయే నటీనటులను ఎంపిక చేశామని ఆర్‌జె రత్నాకర్ వద్ద కోడిరామకృష్ణ వెల్లడించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బాబా పర్యటించిన ప్రాంతాలు వైట్‌ఫీల్డ్, కొడైకెనాల్‌తో పాటు సాయికుల్వంత్ సభామండపం తదితర సెట్టింగులను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసి సినిమా తీస్తున్నామన్నారు. చిత్రంలో పది పాటలు వుంటాయని, సంగీతం ఇళయరాజా నిర్వహిస్తున్నారన్నారు. ఈ నెల 17న ముంబైలో పాటల మిక్సింగ్ కార్యక్రమం చేపడతామన్నారు. బాబా ఆధ్యాత్మిక బోధనలు, మానవాళికి అందించిన సేవలు చిత్రంలో వుంటాయన్నారు. ఏప్రిల్ మాసానికి చిత్రనిర్మాణం పూర్తి చేసి మేలో విడుదల చేసేందుకు అవకాశం వుందని ఆయన వెల్లడించారు. బాబాను స్ఫూర్తిగా తీసుకొని సేవాభావాన్ని అలవరుచుకుంటే ప్రపంచంలో భారత్ మొదటిస్థానంలో నిలుస్తుందన్నారు. బాబా స్నేహితులతో పాటు దేశ, విదేశీభక్తులు కూడా ఈ చిత్రంలో కనిపిస్తారని, ఇప్పటికే కొంతభాగం షూటింగ్ జరిపామని, సత్యసాయిట్రస్టువారి సహకారంతో పుట్టపర్తిలో అవసరమైన ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తామన్నారు. అయితే నటీనటుల పేర్లు తెలపడానికి నిరాకరించారు. బాబా జీవితవిశేషాలు చిత్రంలో నిక్షిప్తమై వుంటాయన్నారు.

పవన్ తో ఓ సినిమా కోసం దిల్ రాజు వేట

పవన్ కళ్యాణ్ ఎస్ జె సూర్య కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘ఖుషి’. ఈ చిత్రం 2001 ఏప్రిల్ 27న విడుదలై సంచలన విజయం సాధించింది. ఇదే చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి అప్పటి నుంచి పవన్ తో ఓ సినిమా చేసే ఛాన్స్ కోసం దిల్ రాజు దాదాపు పదకొండేళ్ళుగా ఎదురు చూస్తున్నాడట. అయితే ఆయన కల త్వరలో నెరవేరనుందని తెలుస్తోంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో పవన్ నటిస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్లేస్ లో మహేష్ నటిస్తుండటంతో దిల్ రాజు పవన్ హీరోగా ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. గత కొన్ని నెలలుగా పవన్ చుట్టూ తిరుగుతున్న దిల్ రాజు చాలా సిట్టింగ్స్ జరిపారని ఈ మధ్యనే పవన్ ఓ స్క్రీప్ట్ ని ఫైనలైజ్ చేశాడని ఇండస్ట్రీ వర్గాల కథనం. పవన్ వెంటపడి మరీ సాధించుకున్న దిల్ రాజుకి పవన్ తో సినిమా చేయాలనే పట్టుదలకు హాట్సాఫ్ అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు

నయనతార ప్రభుదేవా పెళ్లి ప్రేమికుల రోజున ఫిక్స్

ప్రేమ జంట నయనతార,ప్రభుదేవాలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే మ్యాటర్ పై మీడియాలో చాలా కాలంగా ఊహాగానాలు జరుగుతన్నాయి.ఈ నేపధ్యంలో ఈ ప్రేమికులు తమ పెళ్ళిని ప్రేమికుల రోజైన పిభ్రవరి 14 న చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ విషయాన్ని నయనతారకు సన్నిహితుడైన ఓ తమిళ దర్శకుడు చెప్పినట్లుగా తమిళ మీడియా ప్రచారం చేస్తోంది.అంతేగాక..నయనతార కేరళలోని కొచ్చికి సమీపంలో ఉన్న ఓ దీవిలో నయనతార మంచి ఇల్లు కట్టిస్తున్నారని చెప్తున్నారు.పెళ్లి సందర్భంగా ప్రభుదేవాకి ఆమె ఇవ్వబోతున్న కానుక ఇది అని అక్కడ మీడియా చెప్తోంది.ఇక వివాహానంతరం ఈ దంపతులు ముంబయిలో సెటిలవ్వాలనుకుంటున్నారని సమాచారం

కర్నూలులో పాదచారుల వంతెనలు

నగరంలోని ముఖ్య కూడళ్లలో ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా రూ. 1.50 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి(పాదచారుల వంతెన)లు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ వెల్లడించారు. శనివారం స్థానిక కొత్త బస్టాండ్, రాజ్‌విహార్, కలెక్టరేట్ వద్ద పాదచారుల వంతెనల నిర్మాణానికి మంత్రి శిలాఫలకాలను ఆవిష్కరించారు. నగరానికి కొత్త శోభను తెచ్చేందుకు పాదచారుల వంతెనను నిర్మిస్తున్నామన్నారు. ప్రకాష్ ఆర్ట్స్ సహకారంతో వ్యాపార దృక్పథం లాభాపేక్ష లేకుండా కొత్త బస్టాండ్, రాజ్‌విహార్, కలెక్టరేట్ వద్ద ఒక్కోటి రూ. 50 లక్షలు వెచ్చించి నిర్మిస్తామన్నారు. మొదటి దశలో వంతెనలు పూర్తయిన తర్వాత ఎక్స్‌లేటర్, లిఫ్ట్ సౌకర్యాలు రూ. కోటితో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు