Tuesday, 20 December 2011

కర్నూలు, అనంతపురంలో కొత్త పారిశ్రామికవాడలు

అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొత్తగా పారిశ్రామికవాడలు ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ప్రయత్నాలు మొదలు పెట్టింది. అనంతపురం జిల్లా 19.13 లక్షల హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో కేవలం 10 లక్షల హెక్టార్లలో మాత్రమే వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇప్పటికే అనంతపురంలో 635 ఎకరాల విస్తీర్ణంలో భారత్ డైనమిక్ లిమిటెడ్ మిస్సైల్స్ తయారీ యూనిట్ నిర్మాణానికి అమోదం తెలిపింది. పాలసముద్రంలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో రాడార్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సంసిద్ధతతో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, అత్యధిక భూములు కలిగి ఉండడంతో అనంతపురం జిల్లా పారిశ్రామికంగా అబివృద్ధి చెందే అవకాశం ఉంది. తాజాగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 6653 ఎకరాల భూ సేకరణలో ఏపీఐఐసీ అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో 2134 ఎకరాల విస్తీర్ణంలో అనంతపురం, గుంతకల్లు, కదిరి, తాడిపత్రి, గుత్తి, సజ్జలదిన్నె, హిందూపురం, గోళ్లాపురం, పెనుకొండ, సద్దలపల్లిలో 10 పారిశ్రామికవాడలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 242 ఎకరాల విస్తీర్ణంలో ఆదోని, నంద్యాల, డోన్, ఆత్మకూరులో ఐదు పారిశ్రామికవాడలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే 11 పారిశ్రామికవాడలకు భూ సేకరణ చేసేందుకు రెవెన్యూ అధికారులతో ఏపీఐఐసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. కొత్తగా వచ్చే పారిశ్రామికవాడల కోసం అనంతపురం జిల్లా పాలసముద్రంలో 185 ఎకరాలు, గోళ్లాపురంలో 49, కొడిపిలో 786, డీహీరేహాళ్‌లో 1221, పెదవడుగూరులో 219 ఎకరాలు సేకరిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని నన్నూరులో 1672 ఎకరాలు, పంచలింగాలలో 105, కల్లూరులో 106, రుద్రవరంలో 1580, దిన్నెదేవరపాడులో 657, ఆటోనగర్(ఆదోని)లో 73 ఎకరాలు సేకరించి పారిశ్రామికవాడలు ఏర్పాటు చేయనున్నారు. ఎందుకూ పనికిరాని కొండ, గుట్టలు కలిగిన భూమిని కూడా మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేసేందుకు ఏపీఐఐసీ సిద్ధంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయేతర భూముల సేకరణలో కూడా కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

దురంతో రైళ్లకూ తత్కాల్ టికెట్ల

రెండు స్టేషన్ల మధ్య ఆగకుండా నడిచే 'దురంతో' ఎక్స్‌ప్రెస్ రైళ్లకూ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 'తత్కాల్' టికెట్ల సదుపాయాన్ని వర్తింపచేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అలాగే ప్రయాణ తేదీకి ఒకరోజు ముందు ఇంటర్నెట్‌ద్వారా తత్కాల్ టికెట్లు పొందేవారు రైల్లో తనిఖీ సందర్భంగా ఆధార్ గుర్తింపు కార్డు చూ పితే సరిపోతుందని ప్రకటించింది. ఈ మేరకు అన్ని జోన్లకూ సమాచారం పంపినట్లు ఓ సీనియర్ అధికారి సోమవారం వెల్లడించారు. ఈ-టికెట్ తో ప్రయాణించేవారు ఓటరు కార్డు, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యార్థి గుర్తింపు కార్డు, జాతీయ బ్యాంకు పాస్‌బుక్ , క్రెడిట్ కార్డు వంటివి చూపేందుకు ఇప్పటివరకూ అనుమతిస్తున్నారు.

జనవరి 1 నుంచి ఆన్‌లైన్‌లో భారత వీసా

భారత వీసాలను పొందాలనుకుంటే ఇక నుంచి విదేశీయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో ఆన్‌లైన్ దరఖాస్తు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా ఆదివారం సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఆన్‌లైన్ వీసా దరఖాస్తు కేంద్రాన్ని భారత కాన్సులేట్ జనరల్ ప్రారంభించారు. " వీసా కావాలనుకునే వారు వెబ్‌సైట్‌లో సంబంధిత దరఖాస్తు ఫారాన్ని నింపి, ప్రింట్ తీసుకోవాలి. ఏదైనా వీసా ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ వద్ద ఆ దరఖాస్తును, రుసుము ను చెల్లించాలి''అని ఆయన చెప్పారు. వీసాల దరఖాస్తులన్నింటినీ ఆన్‌లైన్‌లోనే స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, జనవరి 1 నుంచి అమల్లోకి రానుందని తెలిపారు.