Sunday, 11 March 2012

ట్విట్టర్ ద్వారా ద్రవిడ్ శుభాకాంక్షలు తెలిపిన....యువరాజ్ సింగ్

జామీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఓ గొప్ప అవకాశంగా భావిస్తున్నానని యువరాజ్ సింగ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. రిటైర్మెంట్ సందర్భంగా యువీ ట్విట్టర్‌లో 'ది వాల్' రాహుల్ ద్రవిడ్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు. టీమిండియా జట్టులో రాహుల్ ద్రవిడ్ నైతిక విలువలు గల గొప్ప వ్యక్తి అని సహచర ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. జామీ కఠోర శ్రమ ఎప్పుడూ విఫలం కాలేదని, యువ క్రికెటర్లకు ఆదర్శప్రాయుడని కొనియాడాడు. ద్రావిడ్ కెప్టెన్‌గా ఉన్నపుడే యువీ టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. యువీ ద్రవిడ్‌ని ముద్దుగా జామీ అని పిలవడం మనకు తెలిసిన విషయమే.ఇది ఇలా ఉంటే ఆల్ టైమ్ బెస్ట్ టెస్టు క్రికెటర్ల జాబితాలో భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ 30వ స్థానంలో నిలిచాడు.అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రావిడ్‌పై ఆసీస్ మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. మిస్టర్ డిపెండబుల్‌గా పేరుగాంచిన ద్రావిడ్ ఒక క్రికెటర్ మాత్రమే కాదు.. హూందాగా వ్యవహరించే గొప్ప వ్యక్తి, ఆట గురించి నిరంతరం ఆలోచించే మేధావి అంటూ ఆస్ట్రేలియా పత్రిక మార్నింగ్ హెరాల్డ్ ద్రావిడ్‌ను ఆకాశానికెత్తేసింది.

‘వీఆర్‌వో, వీఆర్‌ఏ’ ఫలితాలు రేపు విడుదల

వీఆర్‌వో, వీఆర్‌ఏ రాత పరీక్షా ఫలితాలు రేపు సాయంత్రం 4 గంటలకు విడుదలకానున్నాయి. రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదల తర్వాత జిల్లాల్లో రిజర్వేషన్ ప్రాతిపదికన ఎంపిక జాబితాలను కలెక్టర్లు ప్రకటిస్తారు.

తిరుపతిలో సీసీ కెమెరాల నిఘా

గీత దాటితే జరిమానా వాహనదారులు ఇక నిబంధనలను అతిక్రమిస్తే పోలీసులకు దొరికిపోవడం ఖాయం. తిరుపతి పుణ్యక్షేత్రంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు అర్బన్ పోలీసులు సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ప్రధానమైన ట్రాఫిక్ కూడళ్లలో అత్యాధునిక సీసీ కెమెరాలను అమర్చి వాహనదారుల దూకుడుకు కళ్లెం వేయనున్నారు. ఈ మేరకు అర్బన్ పోలీసు జిల్లా కార్యాలయంలో ఎస్పీ ప్రభాకర్‌రావు అధ్యక్షతన తిరుపతి మున్సిపల్ కమిషనర్ ప్రసా ద్, ఆర్టీసీ ఆర్‌ఎం నాగశివుడు, టీటీడీ సూపరింటెం డెంట్ ఇంజనీర్ సుధాకర్‌తోపాటు వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు. సమావేశం అనంతరం అర్బన్ ఎస్పీ మీడియాతో మాట్లాడారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఫర్చూన్ టెక్నాలజీ సహకారంతో నగరంలో 120 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. 500 మీటర్ల దూరంలోని వాహనంలో దాగి వున్న మనిషిని కూడా జూమ్ చేసి గుర్తించడం ఈ కెమెరా ప్రత్యేకతన్నారు. సమస్యాత్మకంగా ఉన్న 42 ట్రాఫిక్ సర్కిళ్లను ఇప్పటికే గుర్తించినట్లు వివరించారు. ఈ ప్రాంతంలో అత్యాధునిక స్పీడ్ డూం వైర్‌లెస్ సీసీ కెమెరాలను అమర్చనున్నట్టు తెలిపారు. కెమెరాల్లో రికార్డయిన సమాచారాన్ని కంట్రోల్ రూంకి, అక్కడి నుంచి అధికారుల వద్ద ఉన్న సెల్‌ఫోన్‌కు సమాచారం అందుతుందన్నారు.

రాయలసీమకు ఈ బడ్జెట్‌లో రైల్వే అభివృద్ధి సాధిస్తాం

రైల్వే పరంగా మరింత అభివృద్ధి సాధించడానికి ప్రయత్నం చేయడంతో పాటు కరువు జిల్లా అయిన అనంతపురానికి రైల్వే పరిశ్రమను మంజూరు చేయాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను అభ్యర్థించి నట్లు అనంతపురం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి వెల్లడించారు. శనివారం సాయంత్రం గుంతకల్లు రైల్వే జంక్షన్‌లోని ప్లాట్‌ఫామ్-1, 2లో ఏర్పాటు చేసిన గుంతకల్లు-తిరుపతి ప్యాసింజర్ రైలు ప్రారంభోత్సవ సభలో ఎంపీ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఉపాధి అవకాశాలు లేక కరువు ప్రాంత యువత కష్టనష్టాల పాలవుతున్నారని, ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని గుంతకల్లు, గుత్తి రైల్వే జంక్షన్ల మధ్య రైల్వే పరిశ్రమ ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డుకు, ప్రధాన మంత్రికి విన్నవించామని చెప్పారు.గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని వచ్చే అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల ఎంపీలతో కలిసి రైల్వే రంగం లో మరింత అభివృద్ధి సాధించడానికి రానున్న రోజుల్లో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాదు-డోన్‌ల మధ్య నడిచే తుంగభద్ర రైలు ను గుత్తి లేదా గుంతకల్లు వరకు పొడిగించాలని కోరుతున్నామన్నారు. అలాగే పగటి పూట పుట్టపర్తి, దర్మవరంల నుంచి అనంతపురం, గుంతకల్లు మీదుగా హైదరాబాదుకు ఒక రైలును నడపాలని, బెంగళూరు-షిరిడీ మధ్య ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించాలని, చెన్నై-హైదరాబాదు నడుమ కొత్త రైలును నడపాలని, గుంతకల్లు మీదుగా హుబ్లీ ప్రాంతానికి మరిన్ని రైళ్లను ప్రారంభించాలని ప్రతిపాదనలు పంపామన్నా రు. గుంతకల్లు స్టేషన్‌ను ఆధునికీకరించేందుకు రూ.6 కోట్లు, గుంతకల్లులో బైపాస్ లైన్ నిర్మా ణం కోసం రూ.19 కోట్లు, పెన్నా బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రైల్వే అధికారులను కోరుతున్నట్లు ఆయన చెప్పారు. గుత్తి-బెంగళూరు రైల్వే మార్గం విద్యుదీకరణ సర్వే కు రైల్వే బోర్డు గత ఏడాది అనుమతించిందని, ఈ పర్యాయం నిధులు మంజూరు చేయాలని బోర్డుపై ఒత్తిడి తేనున్నామని అన్నారు. కేంద్రం లో యూడీఎఫ్, ఎన్‌డీఏ ప్రభుత్వాలు ఉన్న సమయంలో రైల్వేలో అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యా యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నష్టాన్ని పూడ్చుకునే దిశగా ప్రస్తుతం గట్టి ప్రయత్నాలే చేస్తున్నామని అన్నారు. యూడీఎఫ్, ఎన్‌డీఏ ప్రభుత్వాల హయాంలో గుంతకల్లు డివిజ న్‌ను కుదించడానికి ప్రయత్నాలు జరిగాయని, స్పష్టంగా చెప్పాలంటే నష్టం కూడా జరిగిందని అప్పటి ప్రభుత్వ పెద్దల తీరును ఎంపీ విమర్శించారు. అనంతరం గుంతకల్లు ఎమ్మె ల్యే మధుసూదన్‌గుప్తా మాట్లాడుతూ మన ఆర్థి క ఎదుగుదలకు భారతదేశాన్ని ఒక్క తాటిపై తీసుకురావడానికి, సైన్యానికి సేవలు అందించే విషయంలో రైల్వే ఎనలేని సేవలు చేస్తోందన్నారు. అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి రైల్వే అతి సులువైన రవాణా వ్యవస్థగా కొనియాడారు. గుత్తికి సమీపంలోనే ఇమామ్‌పురంలో రైళ్లను ఆపాలని, గుత్తి స్టేషన్‌ను మరింత అభివృద్ధి పరచాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు.

కెప్టెన్సీ కావాలని నేనెప్పుడూ కోరుకోలేదు....వీరేంద్ర సెహ్వాగ్

కెప్టెన్సీ కోసమే తాను జట్టులో విభేదాలు సృష్టిస్తున్నానని భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ తనపై చేసిన వ్యాఖ్యలను డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తోసిపుచ్చాడు. సారథి కావాలనే కోరిక తనకు లేదని, ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పానని స్పష్టం చేశాడు. నాలుగేళ్ల కిందట కుంబ్లే నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కెప్టెన్ కావాలని వీరూ ప్రయత్నించాడని చాపెల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘జట్టుకు నాయకుడిని కావాలని నేనెప్పుడూ కోరుకోలేదు. టీమ్‌లో సీనియర్ ఆటగాడిని. వైస్ కెప్టెన్‌గా ఉన్నా లేకపోయినా పరుగులు చేయడమే నా లక్ష్యం. సలహాలు ఇవ్వాలనుకుంటే కెప్టెన్‌గా ఎవరున్నా సరే నేరుగా వెళ్లి చెప్పేస్తా’ అని వీరూ వ్యాఖ్యానించాడు.