అనంతపురం


భూమికి కొదవ లేదు.. నీటి జాడలేదు

కరవు అంటే అనంతపురం గుర్తుకు వస్తుంది. దేశంలోని జైసల్మీర్ తరువాత అత్యల్ప వర్షపాతం కురిసే జిల్లాగా గుర్తించబడింది. అందుకే ఇక్కడ కోటి మంది నివసించే భూ భాగం ఉన్నప్పటికీ కేవలం 36 నుంచి 40 లక్షల మంది వరకే ఇక్కడ నివసిస్తుండడం కరవు తీవ్రతకు అద్దంపడుతోంది. కొన్ని సంవత్సరాల నుంచీ వ్యవసాయ జూదంలో వందల కోట్ల రూ పాయలు పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు. ప్రతి ఏటా జిల్లా నుంచి మూడు లక్షల మంది వరకూ ఇతర ప్రాంతాలకు ఉపాది వెతుక్కుంటూ వలసలు పోతున్నారు. 
జిల్లాలో సాగు భూమి 23 లక్షల ఎకరాలు ఉన్నప్పటికీ కనీసం 10 శాతం సాగు భూమికి కూడా నీటిపారుదల సౌ కర్యం లేదు. దీంతో ఏటా ఇక్కడ వ్యవసాయం వర్షాభావ పరిస్థితుల కారణంగా కుంటుపడుతూనే ఉంది. విస్తీర్ణం రీత్యా రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా పెద్దది. 19,130 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. ఇందులో 32.57 లక్షల ఎకరాలు వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. ఇందులో 23.25 లక్షల ఎకరాల భూమి వర్షాధారం పైనే సాగవుతోంది. దేశంలో జైసల్మీర్ తరువాత అనంతపురం జిల్లాలోనే అత్యల్ప వర్షపాతం కురుస్తోంది. కనీస సాగునీటి పారుదల సౌకర్యం లేక ఇరిగేషన్ కమిషన్ సూచించిన కనీస శాతం భూమికి సాగునీరు ఇప్పటికీ లభించని జిల్లా కూడా ఇదే కావడం గమనార్హం. ఇంత పెద్ద ఎత్తున వర్షాధారం పైన ఆధారపడి సాగు చేస్తున్న ఇక్కడి భూమిలోనూ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం చాలా తక్కువగా ఉండడం కూడా ప్రతికూలాంశంగా మారింది. అడపాదడపా నమోదయ్యే తక్కువ వర్షపాతాన్ని కూడా భూమి నిలుపుకోలేకపోవడంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఫలితంగా తరచుగా కరవులు ఏర్పడుతున్నాయి. ఈ 20 ఏళ్ల కాలంలోనే జిల్లాలో 14 ఏళ్లు కరవు సంభవించిదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 
వ్యవసాయ ఏటా జూదంగా మారడంతో రైతులు పంట పెట్టుబడులు వెరసి అప్పులు తడిసిమోపెడవుతున్నాయి. ఎక్కువ శాతం పంటలు వర్షాభావ పరిస్థితుల కారణంగానే పెట్టిన పెట్టుబడులు కూడా గిట్టుబాటుకాని పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో పంటల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక, అవమానాన్ని తట్టుకోలేక 1997 నుంచి ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ఇలా ఇప్పటి వరకూ దాదాపు 700 మంది వరకూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అనంతపురం జిల్లా ప్రజానీకానికి వేరుశనగ పంటే ప్రధాన జీవనాధారం. జిల్లా వాతావరణ పరిస్థితులను తట్టుకుని తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని అంతో ఇంతో దిగుబడి ఇవ్వగలిగిన పంట ఇదే కావడం గమనార్హం. అదే సమయంలో ఇక్కడి నేలలు, కురిసే వర్షం, వాతావరణ పరిస్థితులు కూడా ఈ పంటకే అనుకూలమైనవి. 1980 సంవత్సరానికి ముందు వరకూ రైతులు ఆహార ధాన్యాల పంట వైపే మొగ్గు చూపేవారు. 1980 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేరుశనగ పంటను ప్రోత్సహిస్తూ వచ్చాయి. దేశీయ అవసరాలకు తగిన విధంగా వంట నూనెల ఉత్పత్తులను పెంచేందుకు ప్రోత్సాహకాలిచ్చారు. అందుకోసం టెక్నాలజీ మిషన్ ఫర్ ఆయిల్ సీడ్స్( టిఎంఓపి) ఏర్పాటుచేసి సహాయ సహకారాలు అందించడంతో దేశవ్యాప్తంగా వంటనూనెల ఉత్పత్తుల విస్తీర్ణం, దిగుబడులు పెరుగుతూ వచ్చాయి. అందువలన జిల్లాలో వేరుశనగ ప్రధాన పంటగా మారింది. వేరుశనగ విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహకాలు అందించాయి. దీంతో వర్షాధార ఆహార ధాన్యాల పంటలు పూర్తీగా తగ్గిపోయాయి. అతి తక్కువ వర్షానికి పండే జొన్నలు, కొర్రలు, ఆర్కలు, రాగులు, సాములు, సజ్జలు వంటి పంటలకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. అదే సమయంలో ప్రజల ఆహార అలవాట్లలో మార్పులు చోటు చేసుకోవడంతో వీటికి ప్రాధాన్యత తగ్గింది. వేరుశనగకు డిమాండ్ పెరిగి అధికమైన ధర లభించింది. దీంతో రైతులు జిల్లాలో ఎక్కువ మంది ఈ పంట వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. ఆనతికాలంలోనే ఆహార ధాన్యాల పంట సాగు జిల్లాలో బాగా పడిపోయి వాణిజ్య పంట అయిన వేరుశనగ సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతూ వచ్చింది. 1975-76వ సంవత్సరంలో జిల్లాలో 70 వేల ఎకరాల్లో ఆహార ధాన్యాల పంటలు సాగుచేస్తే 8,12,500 ఎకరాల్లో మాత్రమే వేరుశనగ సాగయ్యేది. అప్పటి నుంచి ఇప్పటివరకూ వేరుశనగ సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వచ్చి 2000 సంవత్సరం నాటికి 19,95,000 ఎకరాలకు చేరుకుంది.



No comments:

Post a Comment