Sunday, 4 December 2011

తొక్కలో ట్విట్టర్ : పవన్ కళ్యాణ్

ట్విట్టర్ లో రెగ్యులర్ గా ట్వీట్ చేసే వారిపై పవన్ కళ్యాణ్ విమర్శ చేస్తూ విసుర్లు విసిరారు. ఆయన తాజాగా పంజా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ...ట్విట్టర్ వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇప్పుడే షూటింగ్ నుంచి వచ్చాను..బాగా అలిసి పోయాను..తిన్నాను..కూర్చున్నాను..గుడ్ మార్నింగ్..గుడ్ ఈవినింగ్ లాంటి కబుర్లే కదా...అంతకుమించి ట్విట్టర్ లో చెప్పుకునేందుకు ఏమీ లేదు. నాకు అలాంటివి పెద్దగా ఇంట్రస్ట్ ఉండవు..అందుకే నేను ట్విట్టర్ కు దూరం అని తేల్చి చెప్పారు. అలాగే ఇది విన్న కొందరు రెగ్యులర్ గా ట్విట్టర్ లో అప్ డేట్స్ ఇచ్చే హీరోలు,హీరోయిన్స్, దర్శకులు భుజాలు తడుముకున్నారు. ఇది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. పవన్ ఆ ట్విట్టర్ హీరోలను భలే దెబ్బకొట్టాడని అంటున్నారు.

కాంగ్రెసు పార్టీలోకి తిరిగి వెళ్లేది లేదని ...ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి

తాను ఎలాంటి ప్రలోభాలకు లొంగి కాంగ్రెసు పార్టీలోకి తిరిగి వెళ్లేది లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి ఆదివారం స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ జగన్‌తోనే ఉంటానని చెప్పారు. ఉప ఎన్నికలు వస్తే తాను నలభై వేల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. బళ్లారిలో గాలి ధాటికి కాంగ్రెసు తుడిచి పెట్టుకు పోయిందని ఆంధ్ర ప్రదేశ్‌లోనూ అదే జరుగుతుందన్నారు. పులివెందుల, కడప ఉప ఎన్నికల్లో ఎలా మెజార్టీ సాధించామో ఉప ఎన్నికలు వస్తే జగన్ పార్టీ అలా మెజార్టీ సాధిస్తుందన్నారు.జగన్‌ను విడిచి ఒకరిద్దరు వెళ్లి పోయినా ఎలాంటి నష్టం లేదన్నారు. కాంగ్రెసులోకి వెళ్లి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు వమ్ము చేసే వాడిని కాదన్నారు. జగన్‌తో ఉంటానన్న నా ఆలోచనలో ఎలాంటి మార్పు లేదన్నారు. సమయం వచ్చింది కాబట్టే తాను ఇప్పుడు మీడియా ముందు చెబుతున్నానన్నారు. కాగా అంతకుముందు కాపు రామచంద్రా రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు.

పరిశ్రమల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి

నిరుద్యోగ యువతకు పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ జవహర్‌బాబు పేర్కొన్నారు.  మండల పరిధిలోని శ్రీరామానుజం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్‌ఆర్‌ఐటీ) కళాశాలలో ‘ఎంటర్ ప్రీమియర్‌షిప్ డెవలప్‌మెంట్’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ ఏడీ జవహర్‌బాబు హాజరై మాట్లాడారు. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం వెంటబడి వెతుక్కోవడం కంటే చిన్నపాటి పరిశ్రమలు స్థాపించుకొని తోటి నిరుద్యోగ యువతకు ఉపాధి అందించాలన్నారు.
ఎంఎస్‌ఎంఐడీ యాక్ట్ గురించి వాటి నియమ నిబంధనల గురించి వివరించారు. యువత పరిశ్రమల కోసం ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలో, కావాల్సిన లెసైన్స్, పెట్టుబడులు సమకూర్చుకోవడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీలు, బ్యాంకుల రుణ సదుపాయం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. నిరుద్యోగ యువతకు పరిశ్రమలు స్థాపించడానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

5 నుంచి శబరిమల ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్లు

  రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల నుంచి శబరిమలైకి వెళ్లే భక్తుల కోసం దక్షిణమధ్య రైల్వే నడపనున్న 132 ప్రత్యేక రైళ్లకు సోమవారం (5వతేదీ) నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్చు. రైళ్ల వివరాలివి...
కొల్లాం-తిరుపతి (07506) కాట్పాడి, చిత్తూరు స్టేషన్‌ల మీదుగా డిసెంబర్ 9, 16, 23, 30 తేదీలలో 4 సర్వీసులు. ఉదయం 4గంటలకు కొల్లాంలో బయలుదేరి రాత్రి 11 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.18 బోగీలు ఉంటాయి.
తిరుపతి-అకోలా (07406) డిసెంబర్ 17వ తేదీన ఒక సర్వీసు గూడూరు, విజయవాడ, సికింద్రాబాద్, నిజామాబాద్ స్టేషన్‌ల మీదుగా నడుస్తుంది.ఉదయం 9గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు 9.30 గంటలకు అకోలా చేరుకుంటుంది. 18 బోగీలు ఉంటాయి.
తిరుపతి-ఔరంగాబాద్ (07405) గూడూరు, విజయవాడ, సికింద్రాబాద్, నిజామాబాద్ స్టేషన్‌ల మీదుగా డిసెంబర్ 10, 24 తేదీలలో 2 సర్వీసులు నడుస్తాయి.ఉదయం 9 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుంది. 18 బోగీలు ఉంటాయి.
తిరుపతి-ఆదిలాబాద్ (07407). గూడూరు, విజ యవాడ, సికింద్రాబాద్, నిజామాబాద్ స్టేషన్‌ల మీదుగా డిసెంబర్ 31న ఒక సర్వీసు. ఉదయం 9గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8గంటలకు ఆదిలాబాద్‌కు చేరుకుంటుంది. మొత్తం 18 బోగీలు ఉంటాయి.

అలిగిన చిత్తూరు జిల్లా కలెక్టర్

ప్రపంచ వికలాంగుల దినోత్సవ సమావేశానికి హాజరు కావాల్సిన కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఉన్నతాధికారుల వైఖరితో గేటు వరకూ వచ్చి అలిగి వెళ్లిపోయారు. వివరాలిలా ఉన్నాయి.
సరిగ్గా ఉదయం 9.55 నిమిషాలకు కలెక్టర్ వాహనం వేలూరు రోడ్డు మీదుగా వస్తూ జిల్లా పరిషత్ మీటింగ్ హాలుకు రావడానికి టర్న్ అయ్యింది. ఇదే సమయంలో విద్యార్థులు ర్యాలీగా వస్తున్నారు. సరిగ్గా జడ్పీ మీటింగ్ హాలు వద్దకు కలెక్టర్ వాహనం వస్తుండగా విద్యార్థులు ఆయనకు అడ్డుగా ఉన్న డివైడర్‌ను దాటుతూ వచ్చారు. ఇంతలో ఓ విద్యార్థి ఆటో కింద పడడం కలెక్టర్ కంటపడింది. ఈ దృశ్యాలను చూసిన కలెక్టర్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.వికలాంగుల దినోత్సవం రోజున విద్యార్థులతో ఎలాంటి ర్యాలీలు నిర్వహించవద్దన్నప్పటికీ ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. అదీగాక ర్యాలీగా వస్తున్న పిల్లలతో ఏ ఒక్క ఉపాధ్యాయుడూ లేకపోవడం, వాహనాల మధ్య పిల్లలు చిక్కుకోవడం.. ఏమైనా ప్రమాదం జరిగి ఉంటే ఎవరు బాధ్యులు అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేసి సమావేశానికి హాజరుకాకుండానే గేటు నుంచి అటే అలిగి వెళ్లిపోయారు. ఈ సంఘటనతో నివ్వెరపోయిన ఉన్నతాధికారులందరూ కలెక్టర్ మళ్లీ వస్తారేమోనని అరగంటసేపు వేచి ఉన్నారు. చివరకు కలెక్టర్ ఇక రారని తెలుసుకుని సమావేశాన్ని పూర్తిచేశారు.