Saturday, 12 November 2011

ఆరు నెలలలో చిరంజీవిని కేంద్ర మంత్రివర్గంలోకి?

ప్రజారాజ్యం పార్టీని తమ పార్టీలో విలీనం చేసిన చిరంజీవిని నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనను తుడిచిపెట్టడానికి కాంగ్రెసు అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అది కూడా సాధ్యమైనంత త్వరగా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచన సాగుతోంది. రాజ్యసభకు గానీ లోకసభకు గానీ ఎంపిక కాక ముందే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రాజ్యసభకు ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలలలోగా పార్లమెంటు ఉభయసభల్లో దేనికైనా ఒకదానికి ఎంపికైతే చాలు. అందువల్ల ముందు చిరంజీవిని మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తర్వాత రాజ్యసభకు ఎంపిక చేయాలనే ఆలోచన సాగుతోంది. ఏప్రిల్ లేదా మేలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు సీటు కేటాయిస్తారని అంటున్నారు

మంత్రి రఘువీరారెడ్డి చేతిలో నుంచి మైకు లాక్కున్ రాయదుర్గం ఎమ్మెల్యే

రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డితో అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగిన ఉదంతమిది. రాయదుర్గం పట్టణంలోని జడ్పీ బాలికోన్నత పాఠశాల ఆవరణలో శనివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి రఘువీరా ప్రసంగిస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందోనంటూ వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. దీంతో ఒక్కసారిగా రామచంద్రారెడ్డి మంత్రి చేతిలో నుంచి మైకు లాక్కుని ఆవేశంగా ప్రసంగించారు. ప్రశ్నల వర్షం కురిపించారు. రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటం లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం అత్యంత బాధాకరమన్నారు. కొంతమందికి మాత్రమే సంక్షేమ ఫలాలను అందించి అందరికీ అందించినట్లు గొప్పలు చెప్పుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ వేదిక కాదంటూనే రాజకీయం చేస్తున్నారని మంత్రితో వాగ్వాదానికి దిగారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సహకరించే వారి పనులు జరుగకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు

టాటా నానో కారు డీజిల్ వేరియంట్ మార్చికి విడుదల

టాటా మోటార్స్ చీప్ కారు 'టాటా నానో'లో కంపెనీ అభివృద్ధి చేస్తున్న డీజిల్ వేరియంట్‌ వచ్చే సంవత్సరం మార్చి నెలలో దేశీయ విపణిలోకి విడుదల కావచ్చునని మార్కెట్ వర్గాల సమాచారం. అంతేకాకుండా.. టాటా నానో పేరుకు అదనంగా వీ2ను చేర్చుకుని "టాటా నానో వీ2" పేరుతో ఈ డీజిల్ వేరియంట్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.టాటా నానో కార్లకు ఇంజన్‌లు తయారు చేయడంలో ప్రముఖ విడిభాగాల సంస్థ బోష్ తమ సహకారాన్ని అందిస్తున్న మేము ఇదవరకటి కథనాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. టాటా నానో వీ2లో ప్రస్తుతం ఉన్న నానో కార్ల కన్నా మెరుగైన ఇంటీరియర్స్, సీటింగ్, సస్పెన్షన్, కలర్ ఆప్షన్స్, పవర్ స్టీరింగ్ వంటి ఫీచర్లు లభించే అవకాశం ఉంది. సిటీ రోడ్లకు టాటా నానో చక్కగా సరిపోతుంది