Tuesday, 18 October 2011

దేశంలో విస్తరించిన అవినీతి ఎయిడ్స్ కన్నా ఎంతో ప్రమాదకరమ

దేశంలో విస్తరించిన అవినీతి ఎయిడ్స్ కన్నా ఎంతో ప్రమాదకరమని సినీ నటుడు, కళాకారుల ఐక్య వేదిక రాష్ట్ర అద్యక్షులు నరేష్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక బాలుర కళాశాలలో అవినీతి వ్యతిరేక పొరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేటి విద్యార్థులు, రాజకీయం అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అవినీతి ప్రాచీనకాలం నుండే ఉందన్నారు. అయితే ప్రజల్లో స్వతహాగా చైతన్యం వస్తే అవినీతిని అంతం చేయవచ్చన్నారు. ముఖ్యంగా అవినీతి అంతానికి ఓటును ఆయుధంగా వాడుకోవాలన్నారు. గాంధీజీ కలలు కన్న విధంగా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామ స్థాయి నుండే అవినీతిని పారద్రోలాలన్నారు. విద్యార్థి దశ నుండే అవినీతిని అంతమొందించడానికే కదిరి నుండి ఈ మహత్తర ఉద్యమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. ఒక నీటి బొట్టులా ప్రారంభమైన ఈ ఉద్యమం రాష్ట్ర మంతా పెద్ద ఉద్యమంగా మారుతుందన్నారు. అవినీతి నిర్మూలనలో అన్నాహజారే దీక్ష అందరికి ఆదర్శమన్నారు. అనంతపురం జిల్లా కరవుకాటకాల్లో అల్లాడుతోందని, తాను అదిలాబాద్ జిల్లా అడవుల్లో పని చేసినప్పటికి అనంత జిల్లాకు తన వంతు సహాయ సహకారాలందించి ఆదుకోవానే ఉద్దేశ్యంతో ఎక్కువ శాతం అనంతపురం జిల్లాలోనే తన కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరో జన్మంటూ వుంటే అనంతపురం జిల్లాలోనే పుడతానన్నారు. అనంతరం అనంత విద్య, వైద్య అవినీతి వ్యతిరేక పోరాట సమితికి తన వంతు సాయంగా రూ. 5 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. జాకీర్ హుసేన్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే సమాజంలో జరుగుతున్న అవినీతి విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించకుండా ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ చెన్నకేశవులు, అధ్యాపకులు ప్రశాంత్, సూర్యనారాయణ, సనావుల్లా, అనంత విద్యా, వైద్య అవినీతి వ్యతిరేక పొరాట సమితి జిల్లా కార్యదర్శి వెంకటేష్, బిసి మహాజన సమితి రాష్ట్ర కార్యదర్శి హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment