Sunday, 16 October 2011

ఇండియా ప్రపంచంలోనే అత్యుత్తమ రచనలు

భారతీయ భాషల్లో వచ్చే సృజనాత్మక సాహిత్యం ప్రామాణికమైనది, చాలా గొప్పదని,నోబెల్ బహుమతికి తీసిపోని రచనలు భారతీయ భాషల్లో వచ్చాయని సరస్వతీ సమ్మాన్ అవార్డు గ్రహీత, ప్రముఖ అస్సామీ రచయిత లక్ష్మీనందన్ బోరా అన్నారు. మాతృభాషలో రాసే భారతీయ రచయితలు ప్రపంచంలోనే అత్యుత్తమ రచనలు చేశారని ప్రముఖ మళయాళీ కవి, విమర్శకుడు కె.సచ్చిదానందం అన్న మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తిరుపతిలోని ఎస్వీయూ సెనేట్ హాల్‌లో శనివారం జరిగిన ఈశాన్య, దక్షిణ భారతీయ రచయితల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాహిత్య అకాడమీ, ఎస్వీయూ ఇంగ్లీషు విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం జరిగింది.

భారతీయ రచయితలు అభూత కల్పనలకు, సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తారని విఎస్.నైపాల్, సాల్మన్ రష్దీలు అనడం ద్వారా తమ అహంకారాన్ని ప్రదర్శించారని, భారతీయ రచయితల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని బోరా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ భాషల్లో వచ్చిన కొన్ని నవలలు నోబెల్ బహుమతి పొందడానికి అర్హమైనవని చెపుతూ కమలాదేవి, మహాశ్వేతాదేవి రచనలు నోబెల్ బహుమతి జాబితా వరకు వెళ్లాయన్నారు. ఈ సంవత్సరం మళయాళకవి సచ్చిదానందం పేరు నోబెల్ బహుమతి జాబితాలోకి వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అ స్సాంలో వేర్పాటువాద గ్రూపులు, బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు, వివిధ రూపాల్లో అత్యాచారాలు, భిన్న జీవన విధానాలు, లంచగొండి తనం, రాజకీయ అస్థిరత, తరతరాల మానవ విలువలు అక్కడి రచనల్లో కనిపిస్తాయన్నారు.

సాహిత్య అకాడమీ వల్ల వివిధ భారతీయ భాషల్లోని సాహిత్యం అన్ని భారతీయ భాషల్లోకి రావడం వల్ల జాతీయ గుర్తింపు లభిస్తోందని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో రెండు వందల భాషలున్నాయని, దక్షిణాది రాష్ట్రాల్లో ఇరవై నాలుగు భాషలున్నాయని ఈ సమ్మేళనంలో ప్రసంగించిన ప్రముఖ కథారచయిత కేతు విశ్వనాథరెడ్డి అన్నారు. ఈ రాష్ట్రాల్లోని భాషా సాహిత్యాల అధ్యయనానికి ఎస్వీయూ ఇంగ్లీషు విభాగం తలుపులు తెరవాలని ఆయన కోరారు. సాహిత్య అకాడమీ ఉపకార్యదర్శి కె.శ్రీనివాసరావు అకాడమీ చేస్తున్న కృషిని ప్రారంభోపన్యాసంలో వివరించారు.

సొంత భాషలో పురిటి నొప్పులు
‘ఈ దేశపు తల్లులు సొంత భాషలో పురిటి నొప్పులు పడడం మర్చిపోయారు’ అంటూ ప్రముఖ కవయిత్రి కొండేపూడి నిర్మల ‘పంజరం’ అన్న స్వీయ కవితను వినిపించారు.‘అనువదిస్తే తప్ప నాకల నీకర్థం కాదు’ అంటూ ఇంగ్లీషు భాష పెత్తనాన్ని వ్యక్తీకరించారు. ప్రారంభ సమావేశానంతరం కవితా పఠన కార్యక్రమం జరిగింది. ‘అర్థవంతమైన వాక్యా లు మాట్లాడి మాట్లాడి అలిసిపోయాను’ అని కెఎస్.రమణ తన కవితా పఠనంలో అన్నారు. కన్నడంలో మృత్యుంజయ, మళయాళంలో రోజ్‌మేరి, తమిళంలో తంగంమూర్తి తమ స్వీయ కవితలను చదివారు. సాయంత్రం జరిగిన కవితా పఠనంలో ఎస్.మునిసుందరం ‘గంగిరెద్దు’ అన్న కవితతో పాటు మరికొన్ని కవితలను చదివారు. 

- ఎస్వీ యూనిర్సిటీ 


source: sakshi 

No comments:

Post a Comment