జూనియర్ వైద్యులకు ప్రభుత్వం షాకిచ్చింది. ఎంత చెప్పినా సమ్మె విరమించక
పోతుండడంతో.. హౌస్ సర్జన్లపై వేటువేయాలని నిర్ణయించింది. ఈ మేరకు
బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లకు రహస్యంగా ఉత్తర్వులు జారీచేసినట్లు
సమాచారం. సమ్మెవల్ల తగ్గిన హాజరును కారణంగా చూపి.. ప్రభుత్వం దాదాపు 1,900
మంది హౌస్‌సర్జన్లను పీజీ పరీక్షలకు అనర్హులను చేస్తోంది. రాష్ట్రంలోని 10
బోధనాస్పత్రుల్లో ఎండీ, ఎంఎస్ వంటి మూడేళ్ల పీజీ కోర్సులు చేస్తున్న
జూనియర్ వైద్యులతో పాటు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఏడాదిపాటు హౌస్‌సర్జన్
చేస్తున్న వైద్యవిద్యార్థులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు.
విద్యార్థులు నాలుగున్నరేళ్ల ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేసి, ఏడాదిపాటు
ఆస్పత్రుల్లో హౌస్‌సర్జన్‌గా పనిచేయాలి. తర్వాత మరో ఏడాది గ్రామీణ
ప్రాంతాల్లో రోగులకు సేవలు చేయాలి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిబంధనల
ప్రకారం ఎంబీబీఎస్ కోర్సు పూర్తయిన ప్రతీ విద్యార్థి కచ్చితంగా 365
రోజుల(ఏడాది) పాటు హౌస్‌సర్జన్‌గా విధులు నిర్వహించాలి. అందులో ఒక్కరోజు
తగ్గినా.. వారికి వైద్యపట్టా లభించే అవకాశముండదు. హౌస్‌సర్జన్
పూర్తిచేశాకే ఎండీ, ఎంఎస్ లాంటి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హతపరీక్షకు
అనుమతిస్తారు. 2012 అక్టోబర్‌లో ఈ అర్హత పరీక్ష జరగనుంది. అప్పటిలోగా..
హౌస్ సర్జన్ పూర్తి చేసుకోవాల్సిందే.
కానీ, 2012 సంవత్సరంలో హౌస్ సర్జన్ పూర్తి చేసుకోబోయే.. 10 బోధనాస్పత్రులకు
చెందిన 1,900 మంది హౌస్‌సర్జన్లు సమ్మెలో పాల్గొంటున్నారు. 11 రోజులుగా
విధులకు దూరంగా ఉంటున్నారు. దీంతో వీరికి పీజీ పరీక్షలో అనుమతి ఇవ్వకూడదని
ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సమ్మెలో పాల్గొంటున్న హౌస్ సర్జన్ల
వివరాలు సేకరించి పెట్టుకోవాల్సిందిగా అన్ని బోధనాస్పత్రుల
సూపరింటెండెంట్లను రాష్ట్ర వైద్య విద్యా శాఖ ఉన్నతాధికారులు ఆదేశించినట్లు
తెలిసింది. ఈ మేరకు రహస్యంగా ఉత్తర్వులు (మెమోలు) పంపినట్లు విశ్వసనీయ
వర్గాల సమాచారం

No comments:
Post a Comment