7 నుండి ధనుర్మాస పూజాసహిత శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 7 నుండి 9వతేదీ వరకు ధనుర్మాస
పూజాసహిత శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవనం నిర్వహించనున్నట్లు దాససాహిత్య
ప్రాజెక్టు ప్రత్యేకాధికారి అనంతతీర్థాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు.
మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలోని రైల్వేస్టేషన్ వెనుక గల టిటిడి మూడవ సత్రం
ప్రాంగణంలో ప్రారంభమవుతాయని తెలిపారు. జవనరి 7,8 తేదీల్లో ఉదయం 5గంటలనుండి
7గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు
నిర్వహించనున్నారు. ఉదయం 8.30గంటల నుండి 12గంటల వరకు ఆంధ్ర, కర్ణాటక,
తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల భజన మండళ్లతో సంకీర్తన నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 2.30గంటల నుండి 5గంటల వరకు ధార్మిక సందేశం కార్యక్రమం
నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30గంటల నుండి 8.30గంటల వరకు సంగీత విభావరి,
సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 7న సాయంత్రం 4గంటలకు
శ్రీగోవిందరాజస్వామి దేవాలయం నుండి మూడవ సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర
నిర్వహిస్తామన్నారు. అలిపిరి పాదాల మండపంలో జనవరి 8న ఉదయం 4.30గంటలకు
సత్యాత్మతీర్థులు, టిటిడి ఉన్నతాధికారులతో మెట్లపూజ నిర్వహిస్తామని
తెలిపారు. అనంతరం వేలసంఖ్యలో వచ్చే భజనమండలి సభ్యులతో సంప్రదాయ భజనలు
చేస్తూ తిరుమల చేరుకుంటారని తెలిపారు. పూర్వం ఎందరో మహర్షులు, రాజర్షులు,
శ్రీపురందరదాసులు, శ్రీవ్యాస రాజయతీశ్వరులు, అన్నమాచార్యులు,
శ్రీకృష్ణదేవరాయలు వంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని
ఎక్కి మరింత పవిత్రం చేశారన్నారు. అలాంటి వారి అడుగుజాడల్లో నడిచి ఆ
దేవదేవుని కృపకు అందరు పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవం
నిర్వహిస్తున్నామన్నారు.ఇలా సప్తగిరులను అధిరోహించి సప్తగిరీశుని దర్శిస్తే వారికి సకల అరిష్టములు తొలగి సర్వాభీష్టములు సిద్ధిస్తాయన్నారు.
No comments:
Post a Comment