
జిల్లాలో హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు
ఉన్నాయని ఏపీఐఐసీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో పారిశ్రామిక
పురోగతిపై ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో
పారిశ్రామిక పురోభివృద్ధి కుంటుపడింది. పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు
పారిశ్రామిక వేత్తలు ముఖం చాటేస్తున్నారు. అన్ని మౌలిక వసతులు ఉన్నా
పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. రూ.10 వేల కోట్లతో
ఇనుప పరిశ్రమ ప్రారంభించిన ఓ కంపెనీ పనులను సైతం వదులుకుని వెళ్లిపోయింది. ఈ
నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం కడప సమీపంలోని కొప్పర్తి పారిశ్రామిక వాడలో
హెలికాప్టర్ తయారీ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయా అని
ఏపీఐఐసీని కోరింది. 500 ఎకరాల స్థలంతో పాటు నీరు అందుబాటులో ఉన్నాయని
జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ
ప్రతిపాదనలను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే వాటిని కేంద్ర ప్రభుత్వ
పరిశీలనకు పంపింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే కడప సమీపంలోని
కొప్పర్తి పారిశ్రామికవాడలో హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు మార్గం
సుగమం అయినట్లే. హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఆధ్వర్యంలో ఈ
హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది.
No comments:
Post a Comment