Wednesday, 21 December 2011

శ్రీవారి సేవకులకు నూతన డ్రస్‌కోడ్ అమలు

శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుండి వచ్చే శ్రీవారి భక్తులకు సేవ చేయడానికి టిటిడి ఏర్పాటు చేసిన శ్రీవారి సేవకులకు నూతన డ్రస్‌కోడ్ విధానాన్ని వచ్చే ఏడాది రథసప్తమి నుండి అమలు చేయనున్నట్లు టిటిడి ప్రజాసంబంధాల అధికారి తలారి రవి ఒక ప్రకటనలో తెలిపారు. మానవసేవే మాధవసేవ అన్న ప్రధానలక్ష్యంతో టిటిడి శ్రీవారి సేవకులను ఏర్పాటు చేసింది. సాటి భక్తులకు సేవలు అందించడానికి వీలుగా ఈ వ్యవస్థ టిటిడి ప్రవేశ పెట్టింది. గత 11సంవత్సరాల కాలంలో మూడున్నర లక్షలమంది శ్రీవారి సేవకులు ఇప్పటివరకు భక్తులకు వివిధ విభాగాల్లో సేవలు అందించారు. నేడు సుమారు 40 విభాగాల్లో శ్రీవారి సేవకులు భక్తులకు విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా పేర్కొనవలసినవి దర్శనం క్యూలైన్లు, అన్న ప్రసాద భవనం, కల్యాణకట్ట, పరకామణి, ఉద్యానవనశాఖ, పబ్లికేషన్ స్టాల్స్, సమాచార కేంద్రాలు తదితర ప్రాంతాల్లో శ్రీవారి సేవకులు భక్తులకు అందిస్తున్న సేవలు ఎంతో విశిష్టమైనవి. అయితే తిరుమలకు విచ్చేసే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా టిటిడి శ్రీవారి సేవకుల సేవలను మరింత పటిష్టం చేయడానికి నడుం బిగించింది. అందులో భాగంగా శ్రీవారి సేవను క్రమబద్దీకరించడానికి తద్వారా ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి నూతన విధివిధానాలను నిర్దేశించినట్లు టిటిడి తెలిపింది. శ్రీవారి సేవకు విచ్చేసే సేవకులకు ఒక నిర్దిష్టమైన యూనిఫాంను నిర్ణయించింది. అందులో భాగంగా పురుషులు తెల్లపంచె, లేదా ఫ్యాంటు, తెల్లషర్టు విధిగా ధరించాలని, మహిళలు ముదురు ఆకుపచ్చ రంగు చీర, అదే రంగు రవిక(చీరపై డిజైన్ ఉండవచ్చు, లేకపోవచ్చు) విధిగా ధరించి శ్రీవారి సేవకు రావాల్సి ఉంటుందని తెలిపారు. ప్రారంభంలో 200మందితో ఆరంభమైన శ్రీవారిసేవ వ్యవస్థ నేడు అపారంగా విస్తరించింది. శ్రీవారి సేవకుల్లో భక్తుల పట్ల మరింత సమర్థతతో సేవలు అందించడానికి వీలుగా, అదే రీతిలో శ్రీవారి సేవకులను ప్రోత్సహించడంలో భాగంగా టిటిడి ఇప్పటికే శ్రీవారి సేవకులకు ఉచిత వసతి, అన్నప్రసాద సౌకర్యాలను కల్పిస్తోంది. అంతేకాకుండా ఏడురోజులు సేవ చేసిన వారికి ఎనిమిదవరోజు శ్రీవారి దర్శనభాగ్యం కూడా టిటిడి కల్పిస్తోంది. త్వరలో శ్రీవారి సేవకులకు లడ్డూ,ప్రసాదాన్ని సబ్సిడీకి అందించాలని టిటిడి యోచిస్తోంది. కాగా ఈ నూతన డ్రస్‌కోడ్ విధానం 2012వ సంవత్సరం జనవరి 30న రథసప్తమి పర్వదినం నాటి నుండి టిటిడి విధిగా అమలు చేయనుంది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న శ్రీవారి భక్తులకు ఈ మార్పును గమనించి విధిగా టిటిడి ప్రవేశపెట్టిన నూతన విధివిధానాలను పాటించాలని టిటిడి కోరింది.

No comments:

Post a Comment