Wednesday, 21 December 2011

వైకుంఠ ఏకాదశికి ఈ దర్శన్ ద్వారా టిక్కెట్ల జారీ

వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని దర్శించుకునే భక్తులకు ఈ దర్శన్ కౌంటర్ ద్వారా టిక్కెట్ల జారీ ప్రక్రియను టీటీడీ బుధవారం ప్రారంభించింది. టిక్కెట్ల కోసం భక్తులు భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.100, రూ.300 ప్రత్యేక ప్రవేశం టికెట్లను జారీ చేయనున్నారు. తిరుపతి మహతి ఆడిటోరియంలోని ఈ-దర్శన్ కౌంటర్‌లో బుధవారం ఉదయం 9 గంటల నుంచి టికెట్లు మంజూరు చేయనున్నారు. జనవరి 5వ తేదీ ఏకాదశి దర్శనం కోసం రూ.100 ప్రత్యేక ప్రవేశం 5 వేలు, రూ.300 ప్రత్యేక ప్రవేశం 500 టికె ట్లు జారీ చేయనున్నారు. 6వ తేదీ ద్వాదశి దర్శనం కోసం కూడా ఇదే సంఖ్యలోనే టికెట్లు జారీ చేయనున్నారు. రూ.100 ప్రత్యేక ప్రవేశం పొందిన భక్తులు ఆయా పర్వదినాల్లో అలిపిరి, శ్రీవారి మెట్టు ద్వారా నడిచివెళ్లి కాలిబాటలోని కౌంటర్లలో తమ టికెట్టును తిరిగి నమోదు చేసుకుంటేనే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఇందుకోసం ఈ-దర్శన్ కౌంటర్‌లో ప్రత్యేకంగా రెండు కౌంటర్లు ఏర్పాటు చేశామని, అవసరమైతే మరికొన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈడీపీ విభా గం అధికారి భాస్కర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఇక ఈనెల 24వ తేదీ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, చెన్నయ్, ముంబయి, ఢిల్లీ, పూణెతో పాటు మరో 60 ఈ-దర్శన్ కేంద్రాల ద్వారా రోజుకు రూ.100 ప్రత్యేక ప్రవేశం టికెట్లు 25 వేలు, రూ.300 ప్రత్యేక ప్రవేశం టికెట్లు మరో 4500 కేటాయించనున్నారు.

No comments:

Post a Comment