Saturday, 3 December 2011

ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి?

సొంత గూటికి చేరేందుకు ముగ్గురు తెలుగుదేశం తిరుగుబాటు శాసనసభ్యులు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు వారు తెలుగుదేశం వర్గాలకు సంకేతాలు పంపినట్లు చెబుతున్నారు. తిరుగుబాటు శాసనసభ్యులు వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి, బాలనాగి రెడ్డి రహస్యంగా చంద్రబాబును కూడా కలిసి తమ అభిమతాన్ని తెలియజేసినట్లు వినికిడి. దీంతో చంద్రబాబు పార్టీ సీనియర్ నాయకులతోనూ పార్టీ శాసనసభ్యులతోనూ ఆ విషయంపై చర్చించినట్లు చెబుతున్నారు. ఆ ముగ్గురిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించడానికి వారు సముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. దీనివల్ల పార్టీ బలంగా ఉందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, పార్టీ బలంగా ఉంది కాబట్టే వారు తిరిగి పార్టీలోకి వచ్చారని అనుకుంటారని భావిస్తున్నారు. తెలంగాణపై చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. కాగా, బాలనాగిరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించిన నేపథ్యంలో ఆ ముగ్గురికి కూడా తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసింది. ఆ ముగ్గురు తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వస్తే చంద్రబాబుకు నైతిక బలం చేకూరినట్లేనని చెప్పవచ్చు. అయితే, ఆ వార్తలను హరీశ్వర్ రెడ్డి ఖండిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పిలిచినా తాను కలవబోనని ఆయన అన్నారు. తెలంగాణపై తెలుగదేశం పార్టీ తన వైఖరిని స్పష్టం చేసేవరకు తాను కలవబోనని చెప్పారు.

No comments:

Post a Comment