Friday, 16 December 2011

ఉప ఎన్నికల ప్రచారానికి కొత్త గెటప్‌లో బాలయ్య?

ఉప ఎన్నికల భారాన్ని బాలయ్యపై పెట్టాలని టిడిపి అధిష్టానం యోచిస్తోంది. ఆయన్ను ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా మార్చడానికి రంగం సిద్ధం చేస్తోంది. దూరమైన ఎన్టీఆర్‌ ఫ్యామిలీని దగ్గరకు తీసుకోవడానికి ఇదొక్కట్టే చంద్రబాబు ముందున్న మార్గంగా కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న స్థానాలపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా గురిపెట్టింది. కనీసం ఆరు నుంచి ఎనిమిది స్థానాల్ని కైవసం చేసుకోవడానికి ప్లాన్‌ చేస్తోంది. మిగిలిన స్థానాల్లో రెండో స్థానంలో నిలిచేందుకు ప్రణాళికను రూపకల్పన చేస్తోంది. ఇందుకోసం సినీగ్లామర్‌ పుష్కలంగా ఉన్న బాలయ్యను ప్రచారంలోకి దింపాలని ప్రయత్నిస్తోంది. రూట్‌మ్యాప్‌ను కూడా తయారు చేస్తోంది. ఆయన ప్రచారంతో ఆంధ్రా, సీడెడ్‌ ఏరియాల్లో ఓట్ల వర్షం కురిస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. తొలి నుంచి బాలకృష్ణకు బలమైన అభిమాన సంఘాలు రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి. ఆ తరువాత ఆంధ్రా ఏరియాలో అభిమానుల హడావుడి బాగా కనిపిస్తోంది. ఆయన సినిమాలకు భారీ కలెక్షన్లు కూడా అక్కడే వస్తాయి. ఇదే తరహాలో ఓట్లు కూడా పడతాయని పార్టీ అధిష్టానం అంచనా. నేరుగా బాలకృష్ణను రంగంలోకి దింపడానికి ఇది సరైన సమయం కాదని భావిస్తున్న టిడిపి ఆయన సినీగ్లామర్‌ను వీలున్నంత వరకు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. బాలకృష్ణ ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావడానికి ఇంకొంత కాలం ఉన్నప్పటికీ గతం కన్నా ఇక నుంచి చురుగ్గా ప్రచారానికి వెళతారని టిడిపి నేతలు చెబుతున్నారు. ఉప ఎన్నికలపై వరుసగా అన్ని జిల్లాల నేతలతో చంద్రబాబు రివ్యూ మీటింగ్‌లు పెట్టారు. బాలయ్య ఉప ఎన్నికల ప్రచారానికి వస్తారని...ఏదో చేస్తారని టిడిపి క్యాడర్‌ ఆశలు పెట్టుకుంటోంది. వారి ఆశల్ని ఓట్ల రూపంలో మార్చడానికి ఈసారైన బాలయ్య స్పీచ్‌ మార్చుతారా..? లేక ఎన్టీఆర్‌ ఫ్యామిలీ పార్టీకి దగ్గరగానే ఉందనే సంకేతాలు ఇవ్వడం వరకే పరిమితం అవుతారో చూడాలి.

No comments:

Post a Comment