Friday, 16 December 2011

ఉప ఎన్నికలంటేనే భయం!

అవిశ్వాస తీర్మానం తెచ్చిన తంటా.. అన్ని రాజకీయ పార్టీల నేతలకు నష్టాలను వెంట తెచ్చినట్లయింది. ఎందుకంటే ఎన్నికలకు చాలా ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టి గెలిచినా, రెండేళ్లే పదవి ఉంటుంది. ఈ కాలంలోనే అంత సంపాదించుకుంటామా? అంటే అదీ నమ్మకం లేదు. అందుకోసం ఆయా రాజకీయ పార్టీల నాయకులు అంతర్మథనంలో పడ్డారు. ఉప ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల నేతలు బయటికి గంభీరంగా మాట్లాడుతున్నా లోలోపల మాత్రం అంతర్మధనం చోటు చేసుకుంది. ఖర్చు తడిసి మోపెడవుతున్న ఉప పోరు పట్ల ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించేందుకు సిద్ధపడడం లేదు. కాకపోతే పరువు ప్రతిష్ఠలు సమస్యగా మారడడంతో అటు రాజకీయ పార్టీలు, నేతలు విధిలేకే ఈ ఎన్నికలకు సుముఖత వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ ఏడాది మే నెలలో జరిగిన కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అభ్యర్థులకు ఖర్చు వచ్చింది. ఇప్పుడు తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలంటే అటు అభ్యర్థులు, ఆ యా పార్టీలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. మరో ఆరు నెలలు గడుస్తే కేవలం రెండు సంవత్సరాలు మాత్రం ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు. ఈ రెండేళ్ల కాలానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో అని ప్రధాన రాజకీయ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఓడిపోతే కోలుకోవడం కష్టం అవుతుందని కూడా అనుకుంటున్నట్లు తెలిసింది. మరోవైపు జగన్ వర్గం ఎమ్మెల్యేలు పోటీ చేయక తప్పని పరిస్థితి అయినా వారిలో కూడా ఎన్నికల భారం ఆందోళన కలిగిస్తున్నట్లు సమాచారం. ఈఉప ఎన్నికల ఘట్టం ముగిస్తే మరో రెండు ఏళ్లల్లో సాధారణ ఎన్నికలు వస్తాయి. అప్పుడు కూడా కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జగన్ వర్గాన్ని జిల్లాలో కట్టడి చేయాలంటే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు బరిలోకి దిగి పరపతిని నిరూపించుకోవలసిన సమయం వచ్చింది.

No comments:

Post a Comment