Friday, 16 December 2011

అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో సొసైటీ రద్దు!

ప్రభుత్వ ఆసుపత్రిలో పడకలను 750కు పెంచడమే కాకుండా, అక్కడ సొసైటీ ద్వారా పనిచేసే ఉద్యోగులను రెగ్యులర్ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించడానికి వైద్య విద్యా శాఖ డైరెక్టర్ ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే సొసైటీలోనూ కొందరిపై, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నియామకం చేసిన మరో 20 మందితో కలిపి మొత్తం 37 మందిపై వేటు వేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన కొందరు ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన ఆసుపత్రి, కళాశాలల్లో 230 మంది ఉద్యోగులను నియమించుకోమని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే ఇక్కడ 210 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 20 ఖాళీలు ఉన్నాయి. వీరందరూ ఒక సొసైటీగా ఏర్పడ్డారు. వీరికి సొసైటీ ద్వారానే జీతభత్యాలు అందుతున్నాయి. ఇంకా మిగిలిన 20 ఖాళీలనూ అప్పటి వైద్య కశాశాల ప్రిన్సిపాల్ భర్తీ చేశారు. దీంతో అక్కడి నుంచి సొసైటీ కమిటీకి ప్రిన్సిపాల్‌కు మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతూ వస్తోంది. ప్రిన్సిపాల్ భర్తీ చేసిన కాంట్రాక్టు ఉద్యోగులు రెండున్నర సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా వారికి జీత భత్యాలు అందడం లేదు. దీంతో వారు జీతాల కోసం రోడ్డెక్కడంతో ఆసుపత్రి అభివృద్ధి సంఘం నిధుల నుంచి వీరికి ఆరు నెలల జీతాలు చెల్లించారు. అప్పటి నుంచి 18 నెలల వరకూ వీరికి జీతాలు అందలేదు. దీంతో వీరు కొన్ని రోజులుగా ప్రభుత్వ వైద్య కళాశాల ముందు ధర్నాకు దిగారు. అయినా పరిష్కారం కనిపించకపోవడంతో ఎమ్మెల్సీ గేయానంద్ ఆధ్వర్యంలో కొందరు సభ్యులు బుధవారం డిఎంఇని కలిసినట్లు సమాచారం. ఈ సందర్భంగా డిఎంఇ మాట్లాడుతూ సొసైటీని రద్దు చేసి రెగ్యులర్ కాంట్రాక్టు ఉద్యోగులుగా వీరిని నియమించడానికి చర్యలు తీసుకోనున్నామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

No comments:

Post a Comment