Wednesday, 18 January 2012

నా రాజీనామాను ఆమోదించండి...ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి

ఎమ్మెల్యే పదవికి తాను సమర్పించిన రాజీనామాను ఆమోదించాలని భూమా శోభా నాగిరెడ్డి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. తన రాజీనామాను సాంకేతిక కోణంలో చూడకుండా విలువలకు కట్టుబడి ఆమోదించాలని ఆమె కోరారు. అసలు ప్రజారాజ్యం పార్టీయే మనుగడలో లేనపుడు విప్ ధిక్కారానికి సంబంధించి వారిచ్చిన అనర్హత నోటీసుకు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్వయంగా కాంగ్రెస్‌లో చేరిపోయి అక్కడ సమన్వయ కమిటీ సభ్యుడుగా నియమితులయ్యారనీ అలాంటపుడు ప్రజారాజ్యం ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. ఇంకా తాను పీఆర్పీ అధ్యక్షుడుగా ఉన్నానని చిరంజీవి చెబితే తాను తప్పకుండా ఆయన వద్దకు వెళ్లి వివరణ ఇస్తానని ఆమె ఎద్దేవా చేశారు. తనపై ఉన్న కేసులను ఎత్తివేస్తే కాంగ్రెస్‌లో చేరడానికి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించినపుడు శోభ తప్పు పట్టారు. తన అక్రమాస్తులు, అవినీతిపై విచారణ జరక్కుండా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్న చంద్రబాబుకు మరొకరి అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు, కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారనీ ఆయన అసెంబ్లీలో అవిశ్వాసతీర్మానం పెట్టింది కూడా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కానే కాదనీ కేవలం జగన్‌ను సమర్థించే ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టడానికేనని ఆమె అన్నారు. చంద్రబాబుకు రైతుల పట్ల ఏ మాత్రం ప్రేమ లేదననాడికి ఆయన తొమ్మిదేళ్ల పాలనలో చేసిన నిర్వాకమే నిదర్శనమని శోభ గుర్తు చేశారు. చంద్రబాబుకు, కాంగ్రెస్‌కు ధైర్యం ఉంటే తాజాగా అందరమూ కలిసి ఎన్నికలకు పోదాం సిద్ధం కావాలని ఆమె సవాలు విసిరారు. ఇప్పటికే రెండు సార్లు ప్రజల తిరస్కారానికి గురైన చంద్రబాబుకు మళ్లీ అదే అనుభవం ఎదురవుతుందని ఆమె జోస్యం చెప్పారు.

No comments:

Post a Comment