Wednesday, 18 January 2012

టీమిండియా జట్టు ఐపిఎల్ టోర్నమెంట్ల వల్లే ఈ ఓటములు...మాజీ కెప్టెన్ బేడీ



విదేశాల్లో జరుగుతున్న టెస్టు సిరీస్‌లలో భారత జట్టు వరుస ఓటములను ఎదుర్కోవడానికి నిస్సందేహంగా ఇండియన్ ప్రీమియర్ లీగే ప్రధాన కారణమని టీమిండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ అభిప్రాయపడ్డాడు. ‘అన్ని అంశాలపై విస్తృత దృక్కోణంలో ఆలోచిస్తే టెస్టుల్లో భారత జట్టు వైఫల్యాలకు కారణమేమిటో ప్రతి ఒక్కరికీ అర్ధమవుతుంది. ఐపిఎల్‌ను నిర్వహించేందుకు నిష్ణాతులతో కూడిన విభాగం ఉండాలి. ఈ విభాగంలోని గౌరవప్రదమైన పదవులన్నింటిలో వీరే ఉండాలి. కానీ, క్రికెట్‌తో ఏమాత్రం సంబంధాలు లేనివారే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహిస్తుండటం దురదృష్టకరం. క్రికెట్ అంటేనే విలువలు, సిద్ధాంతాలతో కూడిన క్రీడ. అయితే ఐపిఎల్‌కు ఎటువంటి సిద్ధాంతాలు, విలువలు లేవు. ఇది కేవలం ‘హిట్ అండ్ రన్’ గేమ్‌లా మాత్రమే కొనసాగుతోంది. ఇది పూర్తిగా వ్యాపారాత్మక ధోరణిలో సాగుతోంది. క్రికెట్‌లో వ్యాపారాన్ని ఎంతవరకు అనుమతించవచ్చు అనే విషయంపై బిసిసిఐ భరత క్రికెట్ కంట్రోల్ బోర్డుకి స్పష్టమైన అవగాహన ఉండితీరాలి’ అని బిషన్ సింగ్ బేడీ అన్నాడు.బిసిసిఐ టెక్నికల్ కమిటీపైనా విమర్శలు బిసిసిఐ టెక్నికల్ కమిటీ పనితీరుపై కూడా ఆయన విమర్శలు గుప్పించాడు. సుమారు రెండు దశాబ్ధాల క్రితం తెరపైకి వచ్చిన ఈ కమిటీకి గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ ‘లిటిల్ మాస్టర్’ సారథ్యం వహించగా, ప్రస్తుతం భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న విషయం విదితమే. క్రికెట్‌కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసిన ఈ కమిటీ దేశంలో క్రికెట్ అభివృద్ధికి ఇప్పటివరకూ ఎటువంటి సేవలూ అందించలేదని బిషన్ సింగ్ బేడీ ధ్వజమెత్తాడు.పూర్తిగా ఐపిఎల్‌నే నిందించలేము : వెంగీ ఇదిలావుంటే, టెస్టు క్రికెట్‌లో భారత జట్టు వైఫల్యాలకు పూర్తిగా ఇండియన్ ప్రీమియర్ లీగే కారణమని నిందించేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ నిరాకరించాడు. బిసిసిఐకి సరైన ప్రణాళిక లేకపోవడమే భారత జట్టు పేలవమైన ప్రదర్శనకు కారణమని వెంగ్‌సర్కార్ పేర్కొన్నాడు. ‘కేవలం ఐపిఎల్ వల్లనే ఆటగాళ్ల నైపుణ్యం దెబ్బతింటోందని చెప్పలేం. అసలు విదేశాల్లో భారత జట్టు పర్యటనలే లోపభూయిష్టంగా ఉన్నాయి. విదేశీ పర్యటనలకు ముందుగానీ, టెస్టులకు మధ్యగానీ మన జట్టు సరైన సంఖ్యలో మ్యాచ్‌లు ఆడటంలేదు. యువ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వంటి రిజర్వు ఆటగాళ్లు నెల రోజులకు పైగా ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు’ అని వెంగ్‌సర్కార్ అన్నాడు. ఐపిఎల్ టోర్నమెంట్లను సుదీర్ఘ కాలం పాటు నిర్వహించరాదని, కేవలం నెల రోజుల వ్యధిలోనే ముగించాలని ఆయన సూచించాడు.కాగా, ప్రస్తుత కాలంలో యువ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొని తమ ప్రతిభకు పదును పెట్టుకోవాల్సిందిపోయి కాసుల వర్షం కురిపించే ఐపిఎల్ వంటి టోర్నమెంట్లలో ఆడేందుకే ఇష్టపడుతున్నారని టీమిండియా మాజీ పేసర్ మనోజ్ ప్రభాకర్ అన్నాడు. ‘రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో ఆడాలని కోరుకుంటున్నట్టు చెప్పే యువ ఆటగాళ్లను మీరు ఎప్పుడైనా చూశారా? నిస్సందేహంగా అటువంటి వారెవరూ మీకు తారసపడి ఉండరు. ఏవిధంగానైనా సరే ఐపిఎల్‌లో ఆడేందుకు కాంట్రాక్టులు ఇప్పించాలనే ప్రతి ఒక్కరూ కోరుతుంటారు. ట్వంటీ-20 మ్యాచ్‌లలో ఆడి కేవలం నెలన్నర రోజుల్లోనే కోట్లకు పడగలెత్తే అవకాశం లభిస్తుండటంతో ఏ ఆటగాడూ కష్టపడేందుకు ఇష్టపడటం లేదు’ అని మనోజ్ ప్రభాకర్ అన్నాడు. దేశవాళీ క్రికెట్ బాగోగులను బిసిసిఐ ఏనాడైనా పట్టించుకుందా? అని ఆయన నిలదీశాడు. కాగా, గత ఏడాది ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా ఎదురైన పరాభవాల నుంచి భారత బ్యాట్స్‌మన్లు గుణపాఠం నేర్చుకోలేకపోయారని మాజీ సెలెక్టర్ చందూ బోర్డే విమర్శించాడు.

No comments:

Post a Comment