Sunday, 8 January 2012

అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ గ్రామాల్లో పోలీసుల సోదాలు

ధర్మవరం రూరల్ పోలీసుసర్కిల్ పరిధిలోని పలు ఫ్యాక్షన్ గ్రామాల్లో దిగ్భంద సోదాలు నిర్వహిస్తున్నట్లు సిఐ గంగయ్య తెలిపారు.  స్థానిక రూరల్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లోని ఫ్యాక్షన్ గ్రామాల్లో ఇప్పటికే పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించి ముఠాతగాదాలతో జరిగే అనర్థాలు ప్రజలకు వివరించామన్నారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ గ్రామాలైన ధర్మవరం మండలంలోని రేగాటిపల్లి, నేలకోట, ఓబుళనాయునిపల్లి, సిసి కొత్తకోట, కామిరెడ్డిపల్లి, బత్తలపల్లి మండలంలోని గరిశలపల్లి, తాడిమర్రి మండలంలోని దాడితోట గ్రామాల్లో దిగ్భంద సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సోదాల్లో భాగంగా ఉదయానే్న పోలీసులు గ్రామాల్లో ప్రవేశించి గ్రామస్థులను గ్రామం వెలుపలికి వెళ్ళనివ్వకుండా ఇతరులను గ్రామంలోకి అనుమతించకుండా పకడ్బందీగా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో అనుమానం వచ్చిన వారి ఇళ్ళతో పాటు పశువులపాకలను, గడ్డివాములు తదితర ప్రాంతాలను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శనివారం ధర్మవరం మండలంలోని ఓబుళనాయునిపల్లి గ్రామం లో ఎస్‌ఐ అబ్దుల్‌కరీం ఆధ్వర్యంలో దిగ్భందసోదాలు నిర్వహించగా తాడిమర్రి మండలంలో ఎస్‌ఐ శేఖర్ ఆధ్వర్యంలో దాడితోట గ్రామంలో దిగ్భందసోదాలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే బత్తలపల్లి మండలంలోని గరిశలపల్లి గ్రామంలో పిఎస్‌ఐ రఘురాంప్రసాద్ ఆధ్వర్యంలో పల్లెనిద్ర నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా పల్లెనిద్ర దిగ్భందసోదాల కార్యక్రమాల వల్ల ముఠా తగాదాల జోలికి ప్రజలను వెళ్ళకుండా చైతన్యపరుస్తూ వాటివల్ల జరిగే అనర్థాలను వివరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

No comments:

Post a Comment