Sunday, 8 January 2012

రాయలసీమ జిల్లాలో రాజీవ్ యువ కిరణాలు నీరుగారి పోతోంది

రాజీవ్ యువ కిరణాలు పథకం లక్ష్యానికి ప్రభుత్వమే తూట్లు పొడిచింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ కిరణాలు పథకం జిల్లాలో నీరుగారి పోతోంది. ఇప్పటికే శిక్షణ పొంది ఉద్యోగాలు చేస్తున్న వారు వాటిని వదిలేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం కుస్తీ పడుతుండగా శిక్షణలో ఉన్న వారు సైతం గైర్హాజరవుతుండటమే కాక కొత్తగా శిక్షణ పొందేందుకు యువత ముందుకు రాకపోవడం విశేషం. దీంతో రాజీవ్ యువ కిరణాల పథకం కింద లక్ష ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వ ఉద్యోగాలకు జారీ చేసిన నోటిఫికేషనే్ల గండి కొట్టుకున్నట్లయింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి యువత కోసం ప్రవేశ పెట్టిన ఈ పథకం కింద భారీ ఎత్తున ప్రైవేటు ఉద్యోగాలు ఇవ్వాలని భావించారు. గత అనుభవాల దృష్ట్యా యువత నుంచి మద్దతు రాకపోవడంతో తన మాట నిలుపుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా రాజీవ్ ఉద్యోగ శ్రీ పథకం కింద ప్రైవేటు కంపెనీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తించి ఆయా సంస్థలకు అవసరమైన మేరకు ప్రభుత్వమే శిక్షణ ఇప్పించి ఉద్యోగాలను కల్పించింది. అయితే ప్రైవేటు కంపెనీల్లో జీతం తక్కువ ఉండటం, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి కారణాల వల్ల అపుడు కూడా ఉద్యోగం పొందిన యువత వెనక్కి తిరిగిరావడంతో ఆ పథకం క్రమంగా మూలనపడింది. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మెరుగులు దిద్దుతారని ప్రచారం జరిగినా కొద్ది రోజులకే ఆయన ఆకస్మికంగా మరణించడంతో ఆ పథకానికి మంగళం పాడేశారు. ఇక ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత రాజీవ్ యువకిరణాలు పేరుతో పాత పథకాన్ని తెరపైకి తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన 15 సంస్థలకు యువతకు శిక్షణ ఇప్పించే బాధ్యతను అప్పగించారు. ఆయా సంస్థలు ప్రవేటు సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు గుర్తించి వాటికి అవసరమైన మానవ వనరులకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి ఆయా సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించాల్సి ఉంది. ప్రభుత్వం గుర్తించిన 15 సంస్థలు జిల్లాల్లో తమ భాగస్తులుగా స్థానిక శిక్షణా సంస్థలను ఎంపిక చేసుకొని శిక్షణ ఇవ్వడం ప్రారంభింయి. జిల్లాలో 4,308 మందికి శిక్షణ, ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో 2వేల మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు చూపించగా అప్పటికే నైపుణ్యం ఉన్న 13 వందల మందికి నేరుగా ఉద్యోగాలు ఇప్పించారు. సుమారు మరో 600 మంది వరకు ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. జిల్లాకు నిర్ణయించిన లక్ష్యంలో సుమారు 3,300మందికి ఉద్యోగాలిచ్చినట్లు ప్రభుత్వానికి నివేదిక వెళ్లగా దానిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తే అందులో 45శాతం మంది ఉద్యోగాలు మానేసి వెళ్లిపోయినట్లు తేలింది. మరో 20 శాతం యువకులకు సంబంధించి చిరునామాలు కూడా లభ్యం కాలేదని తెలుస్తోంది. శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశం కల్పిస్తే వెళ్లిపోవడానికి గల కారణాలపై మరో విచారణ నిర్వహించగా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కారణంగా ఆర్‌వైకె కింద ఉద్యోగం పొందిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలకు అవసరమైన శిక్షణ పొందేందుకు వెళ్తున్నారని తేలింది. మరికొందరు జీతం తక్కువ, పని ఎక్కువగా ఉందని, ఉద్యోగ భద్రత లేదని చెప్పినట్లు తెలుస్తోంది. కొందరు సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల్లో ఉద్యోగాలు ఇవ్వడం కూడా ఆర్థిక భారంగా పరిగణించి వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, మరోవైపు ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభం కావడంతో రాజీవ్ యువ కిరణాల లబ్ధిదారులు తమకు వచ్చిన ఉద్యోగావకాశాలను వదిలేసి వెనక్కి వచ్చినట్లు విచారణలో వెల్లడయింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా శిక్షణలో ఉన్న సుమారు 600మంది అభ్యర్థుల్లో కూడా చాలా వరకు డ్రాపవుట్స్ కనిపించే అవకాశం ఉందని పథకాన్ని నిర్వహిస్తున్న అధికారి ఒకరు తెలిపారు. మొత్తం మీద రాజీవ్ యువ కిరణాలు పథకానికి ప్రభుత్వమే గండి కొట్టిందన్న అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

No comments:

Post a Comment