జాతీయ రహదారి 44 పై హైవే పోలీసులు ద్విచక్రవాహనదారులకు
బెంబేలెత్తిస్తున్నారు. ముఖ్యంగా రుద్రంపేట, రాప్తాడు పరిసర ప్రాంతాల్లో
వీరి దందా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వీరి ధాటికి భయపడి ద్విచక్ర
వాహనదారులు అటుగా వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. పగలనక రాత్రనక తాగి ఉండడం,
వాహనదారులను మాటలతో హింసించడం ఆనక వారి దగ్గరున్న డబ్బులు, సెల్‌ఫోన్
లాంటి విలువైన వస్తువులను లాక్కోవడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇక ఏదయినా వాహనంపై అమ్మాయి ఉన్న ఆనవాళ్లు కనపడితే ఇక వారిని వెంబడించి,
అటకాయించి నానా యాగీ చేయడం నిత్యకృత్యంగా మారిందన్న ఆరోపణలు వీరిపై
ఉన్నాయి. అమ్మాయి భుజాలపై చేతులు వేసి నిమరడం, ద్వంద్వార్థాల మాటలతో
విసిగించడం, కౌన్సిలింగ్ అంటూ అమ్మాయిని ఒక వైపు అబ్బాయిని ఒక వైపు ఉంచి
మాటలతో వేధించడం చేస్తున్నట్లు తెలిసింది. ఆనక వారి వద్ద ఉన్న డబ్బులు,
సెల్‌ఫోన్ లాంటి వస్తువులను బలవంతంగా లాక్కోవడం చేస్తున్నట్లు సమాచారం.
రెండు నెలల క్రితం నగరంలోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఉద్యోగి సాయంకాలం
ఆరు గంటల సమయంలో పెనుకొండ నుంచి ద్విచక్ర వాహనం లో అనంతపురానికి
వస్తున్నాడు. అతనికి కొన్ని రోజుల క్రితమే పెళ్లయ్యింది భార్యతో కలసి
ద్విచక్రవాహనంపై వస్తున్నారు. రాప్తాడు దాటిన తరువాత బాగా తాగి వున్న ఒక
యువకుడు మరో ద్విచక్రవాహనంలో వీరిని వెంబడించాడు. కొద్ది దూరం పోయిన తరువాత
వీరిని దాటవేసి వీరి వాహనాన్ని నిలిపివేశాడు. అప్పటికే బాగా తాగి ఉన్న
అతను తాను కానిస్టేబుల్‌నని వాహనానికి సంబంధించిన రికార్డులు చూపించమని
అడిగాడు. రికార్డులన్నీ తనిఖీ చేసిన తరువాత అమ్మాయితో అసభ్యంగా,
ప్రవర్తించసాగాడు. దీంతో కోపం వచ్చిన సదరు అబ్బాయి అతనితో వాగ్వాదానికి
దిగాడు. ఆ సందర్భంలో ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో ఆగ్రహించిన సదరు
కానిస్టేబుల్ రాప్తాడు పోలీసుస్టేషనుకు ఫోన్ చేసి తన తోటి సహచరులను రమ్మని
ఆజ్ఞాపించాడు. దీంతో అక్కడికి చేరుకున్న మిగిలిన పోలీసులు అతనిని
లాక్కెళ్లి పోలీసుస్టేషనుకు తీసుకెళ్లి తమ ప్రతాపం చూపించారు. అనంతరం ఈ
విషయం బయటకు ఎక్కడా చెప్పవద్దంటూ బెదిరించి అతనిని నుంచి పదివేల నగదు
తీసుకుని వదిలేశారు. పదివేలు ఇచ్చిన తరువాత పార్టీ చేసుకోవాలని డిమాండ్
చేసి మరో ఐదు వేలు గుంజారు. దీంతో పాటు అతని దగ్గరున్న రెండు సెల్‌ఫోన్‌లు
లాక్కున్నారు. వారం రోజుల తరువాత మళ్లీ ఫోన్‌లు చేసి బెదిరించడం
మొదలుపెట్టారు. ఇక వారం రోజుల క్రితం ముస్లిం కుటుంబానికి చెందిన ఇద్దరు
యువతీ యువకులు ఇదే పరిస్థితిలో మధ్యాహ్నం పూట వారికి తారసపడ్డారు. ఇంకేం
వారిని వేధించడం మొదలుపెట్టారు. వారిద్దరినీ మాటలతో మానసికంగా
వేధించడంతోపాటు తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారు. వారి సంప్రదాయాన్ని కూడా
పట్టించుకోకుండా బురఖా తీయమంటూ బెదిరించారు. సుమారు అరగంట పాటు అమ్మాయితో
అసభ్యంగా ప్రవర్తించారు. మధ్యాహ్నం కావడంతో వారిద్దరివీ సెల్‌నంబర్లు
తీసుకుని ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరించి అక్కడ నుంచి పంపించారు. ఇవి
మచ్చుకు రెండు మాత్రమే. ఇలాంటి సంఘటనలు రుద్రంపేట, రాప్తాడు రహదారి మధ్య
చాలా కాలం నుంచీ జరుగుతున్నట్లు సమాచారం. సదరు కానిస్టేబుల్‌కు సంబంధించిన
సహచరులు కూడా ఆ కానిస్టేబుల్ వ్యవహార శైలి పట్ల ఆగ్రహంతో ఉన్నారు. సదరు
కానిస్టేబుల్ తండ్రి కూడా పోలీసు శాఖలోనే ఎస్సై హోదాలో పనిచేస్తుండడంతో
అతని ఆగడాలకు అంతే లేకుండా పోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. సదరు
కానిస్టేబుల్ వ్యవహార శైలి పట్ల ఎవ్వరికీ సదభిప్రాయం లేకపోవడం గమనార్హం.
రహదారులపై తాగుబోతులను, జులాయిలను అరికట్టాల్సిన పెట్రోలింగ్ పోలీసులే ఇలా
వ్యవహరిస్తుంటే బాధితులు ఎవరికి చెప్పుకోవాలో తెలీక బాధపడుతున్నారు.
పోలీసులతో వ్యవహారం కాబట్టి ఎందుకు వచ్చిన గొడవలే అన్నట్లు కిమ్మనకుండా
ఉంటున్నారు. ఉన్నతాధికారులు మాత్రం ఇలాంటి వారి పట్ల నిర్లక్ష్యం
వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో జాతీయ రహదారి 44 పై రుద్రంపేట,
రాప్తాడు మధ్య ఇద్దరు కలసి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొని ఉంది.
No comments:
Post a Comment