
తిరుమలలో ఈనెల 10వతేదీన చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని శ్రీవారి
ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 10.30 గంటల వరకు మూసి
వేయనున్నట్లు టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు గురువారం ఒక ప్రకటనలో
వెల్లడించారు. 10వతేది ఉదయం 6 గంటలపై భక్తులను వైకుంఠం -2లో అనుమతిస్తామని
తెలిపారు. అలాగే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత
బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేస్తామన్నారు.
అలాగే పౌర్ణమి రోజున చంద్రగ్రహణం వస్తుండటంతో గరుడ సేవను రద్దు
చేశామన్నారు. అయితే సుప్రభాత సేవకు యథావిధిగా భక్తులను అనుమతిస్తామన్నారు.
ఇక చంద్రగ్రహణం వీడిన తరువాత రాత్రి 10.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి
పుణ్యాహవచనం, శుద్ది, కైంకర్యాలు ఇత్యాది పూజా కార్యక్రమాలు
నిర్వహిస్తారన్నారు. రాత్రి 11.30 గంటలకు శాస్త్రోక్తంగా కార్తీక
దీపోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. అలాగే 11వతేది ఉదయం స్వామివారికి
నిర్వహించే తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించి అనంతరం భక్తులను
అనుమతిస్తామన్నారు. ఇక అన్నదానంలో 10వతేది ఉదయం 7 గంటల నుండి ఉదయం 11.30
గంటల వరకు మాత్రమే అన్నప్రసాద వితరణ వుంటుందని, అటు తరువాత ఉచిత అన్నదాన
కాంప్లెక్స్‌ను మూసివేస్తామని తెలిపారు. డిసెంబర్ 11వతేది ఉదయం 9.30 గంటల
నుండి యధావిధిగా అన్నప్రసాద వితరణ జరుగుతుందని, భక్తులు సహకరించాలని ఆయన
విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment