
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలో సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా
ఏర్పాటు చేశామని రాయలసీమ డిఐజి చారుసిన్హా తెలిపారు. శనివారం ఆమె
మదనపల్లె ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ
అనంతరంపురం, కడప, చిత్తూరు జిల్లా సరిహద్దులలో జరుగుతున్న పేకాట,
వ్యభిచారాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు
చేస్తున్నట్లు వివరించారు. గతంలో జిల్లా సరిహద్దులలో నకిలీ నక్సలైట్ల
ప్రభావం ఉండేదని, ఇటీవల కాలంలో కూంబింగ్, దాడులు నిర్వహించి అనుమానితులను
అదుపులోకి తీసుకోవడంతో సమస్య తగ్గుముఖం పట్టిందన్నారు.వ్యభిచార గృహాల
నిర్వహణపై ప్రజలు స్వచ్చందంగా సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని
చెప్పారు. జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా అదుపు చేయడంలో పోలీసులు పనితీరు
భేషుగ్గా ఉందన్నారు. జిల్లాలో పల్లెనిద్ర ద్వారా ప్రజలలో చైతన్యం
వస్తొందని చెప్పారు. జిల్లాలోనే కాకుండా తన పరిధిలో ఉన్న పెండింగ్ కేసుల్ని
చాలావరకు పరిష్కరించామని చెప్పారు. పాత్రికేయుల వాహనాలకు ప్రత్యేకంగా నెంబరు ఇచ్చి ఇతర వాహనాలపై
పేర్లు ఉంటే వారిపై చర్యలకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. మదనపల్లెలో
ట్రాఫిక్ సలహా కమిటీ సమావేశం ద్వారా ట్రాఫిక్‌ను పూర్తిగా కాకుండ
కొంతమేరకైనా తగ్గించవచ్చునని తెలిపారు. ట్రాఫిక్ సమస్యను పోలీసులతో మాత్రం
సాధ్యం కాదని, మున్సిపల్, రహదారుల శాఖ, మోటారు వెహికల్, ఆర్టీసీ, ప్రవేట్
లారీ యాజమాన్యం, ఆటోల సంఘాల యూనియన్ సహకారంతో సాధ్యమవుతుందని తెలిపారు.
పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు గతంలో ప్రతిపాదనలు పంపినట్లు
ఆమె తెలిపారు.
No comments:
Post a Comment