Friday, 14 October 2011

పారిశ్రామిక వేత్తలు జిల్లాను ఎంచుకుంటున్నారు

ప్రస్తుతం పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలోనే పరిశ్రమల ఏర్పాటునకు అనువైన ప్రాంతంగా అనంతపురం జిల్లాను ఎంచుకుంటున్నారు. జిల్లాలో పరిశ్రమలు స్థాపించడానికి పలువురు ఔత్సాహిక, అనుభవజ్ఞులైన పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. రెన్నెళ్లుగా పరిశ్రమల స్థాపనకు సంబంధించి జిల్లా పరిశ్రమల కేంద్రానికి అందిన దరఖాస్తులే ఇందుకు నిదర్శనం. ఒక మోస్తరు నుంచి భారీ పరిశ్రమల వరకు స్థాపించడానికి దరఖాస్తులు అందాయి. హిందూపురం సమీపంలోని తూమకుంట పారిశ్రామికవాడలో, చిలమత్తూరు మండలంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపుతున్నారు ఈప్రాంతంలో ఎక్కువగా పరిశ్రమలు వస్తున్నాయని ముమ్మర ప్రచారం ఉంది. ఈక్రమంలోనే సైన్స్‌సిటీ తదితరాలు తెరమీదకు వచ్చాయి. ఇక్కడ పరిశ్రమల ఔచిత్యాన్ని గుర్తించి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పరిశ్రమల అవసరాలకు గండికోట రిజర్వాయర్‌ నుంచి 2 టిఎంసిల నీటిని కేటాయిస్తున్న ట్లు జిఓ కూడా జారీ చేశారు. అది ప్రస్తుతం అటకెక్కిన సంగతి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పరిశ్రమల స్థాపనకు ఇదొక్కటే అడ్డంకిగా మారింది. హిందూపురం ప్రాంతానికి బెంగళూరు విమానాశ్రయంతో పాటు, నగరం కూడా 100 కిలోమీటర్లపరిధిలోనే ఉంటుంది. ఇటీవలనే నెలకొల్సిన దేవనహళ్ళి అంతర్జాతీయ విమానాశ్రయం చిలమత్తూరు సమీపంలోని జాతీయ రహదారి నుంచి 50 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది. పుట్టపర్తి విమానాశ్రయం దగ్గరే. రైల్వే సౌకర్యం ఎలాగు ఉంది తెలంగాణ ప్రాంతంలో నెలకొన్ని పరిస్థితుల నేపధ్యంలో పారిశ్రామిక వేత్తలు ఇబ్బడిముబ్బడిగా ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు. 8 మంది పారిశ్రామిక వేత్తలు స్పాంజ్‌ ఐరన్‌ పరిశ్రమలు స్థాపించడానికి, టెక్స్‌పోర్ట్‌ పరిశ్రమను స్థాపించడానికి మరొకరు, వందలాది మంది చిన్నచిన్న పరిశ్రమలు స్థాపించడానికి దరఖాస్తులు చేసుకున్నారు. అయితే నీటికొరత వీరికి అడ్డంకిగా నిలుస్తోంది. గండికోట రిజర్వాయర్‌ నుంచి రావాల్సిన రెండు టిఎంసిల నీరు నిజంగా విడుదలైతే ఇక్కడ ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు స్థాపన అవుతాయి. చిలమత్తూరు మండలాన్ని ఇటీవలనే డార్క్‌ మండలంగా ప్రకటించారు. ఈకారణంగా ఇక్కడ నీటి లభ్యత చాలా కష్టమవుతుంది. పరిశ్రమల స్థాపనకు ప్రధానంగా కావాల్సింది నీటి సౌకర్యమే. ఆదిశగా పాలకులు ప్రయత్నం చేస్తే అనంతపురం పారిశ్రామిక జిల్లాగా ఖ్యాతిని గడిస్తుంది

No comments:

Post a Comment