తిరుపతిలో ఔషధాల అక్రమ విక్రయాలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి.
అడ్డదారిలో కోటీశ్వరులవుదామని భావిస్తున్న కొందరు ఔషధ వ్యాపారులు
అకృత్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ అక్రమ దందాకు
అడ్డూ అదుపు లేకుండా పోతోంది. గతంలో పని చేసిన ఔషధ నియంత్రణ అధికారులు
ఇచ్చిన చనువుతో ఇక్కడ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా ఔషధ నియంత్రణ
అధికారులు కొరడా ఝుళిపించడంతో ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. నగరంలో
మందుల అక్రమ అమ్మకాలు సాగిస్తూ వారం తిరక్క ముందే రెండు ప్రాంతాల్లో
పట్టుబడడం సంచలనం రేపుతోంది. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర వైద్య
ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వాస్పత్రులకు ఇస్తున్న మందులను సైతం మెడికల్
దుకాణాల్లో, అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంకొందరు వివిధ
కంపెనీలు తయారు చేసే శాంపిళ్లను సైతం మెడికల్ రెప్‌లతో కుమ్మక్కై
భారీస్థాయిలో విక్రయిస్తున్నారు. నాలుగు రోజులకు ముందు బైరాగిపట్టెడలో ఒక
దుకాణంలో ఈఎస్‌ఐ, ప్రభుత్వాస్పత్రుల మందులు విక్రయిస్తుం డగా అధికారులు
పట్టుకున్నారు. తాజాగా ఒక ఇంట్లో ఏకంగా
శాంపిల్ మందులను అమ్ముతుండగా పట్టుకుని రూ.30 లక్షల మందులను స్వాధీనం
చేసుకున్నారు.ఇలాంటి తనిఖీలను ముమ్మరం చేస్తాం. అక్రమ మెడికల్ స్థావరాలను గుర్తించి,
కేసులు నమోదు చేస్తాం. ఔషధ నియంత్రణ శాఖ నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులను
గుర్తించే పనిలోనే ఉన్నాం. పట్టుబడ్డ ఈఎస్‌ఐ, సర్కారు, శాంపిల్ మందులపై
విచారణ సాగుతోంది. వీటిలో భాగస్వామ్యం ఉన్న వారిపై చర్యలు తప్పవు.

No comments:
Post a Comment