Monday, 13 February 2012

.మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి పది రోజులు అసెంబ్లీకి సెలవు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై పోరు కొనసాగించాలనే రాష్ట్ర ఆరోగ్య మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలకు పది రోజుల పాటు హాజరు కాలేనని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు, శాసన మండలి చైర్మన్ చక్రమానికి లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా పంపించారు. అనారోగ్యం కారణంగా తాను సమావేశాలకు హాజరు కాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. మూడు రోజుల క్రితం తనకు ఆటలమ్మ వ్యాధి సోకిందని, మరో పది రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని ఆయన ఆ లేఖలో చెప్పారు. దీంతో తాను ఈ నెల 23వ తేదీ వరకు సమావేశాలకు హాజరు కాలేనని చెబుతూ తన శాఖకు సంబంధించిన ప్రశ్నలను వాయిదా వేయాలని ఆయన కోరారు. తన శాఖను విడదీసి కొత్త మంత్రి కొండ్రు మురళికి కేటాయించడంతో ఆయన ముఖ్యమంత్రిపై తీవ్రంగా ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్ లపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. వారిద్దరూ కుమ్మక్కై అధిష్టానవర్గాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. విప్‌ ధిక్కరించిన 17 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకపోవడం సరికాదని వారు అంటున్నారు. ముఖ్యమంత్రి తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా సాగిన విచారణ ప్రక్రియ ఇటీవలే ముగిసిందని, తీర్పు కాపీలు కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ, తీర్పు వెలువరించకుండా ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. సీఎం చర్యలతో పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిందన్నారు. నిరాశ నిస్పృహలో కార్యకర్తలున్నారని వారు చెప్పారు. ఉపఎన్నికలొస్తే మళ్లీ గెలవమన్న ఆందోళనలో సీఎం ఉన్నారని, మాజీ మంత్రులు, మంత్రి మండలి సహచరులు, ఎంఎల్‌సీలు, ఎంఎల్‌ఏలు సీఎంపై గుర్రుగా ఉన్నారు.

No comments:

Post a Comment