త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ
అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది.
రాజ్యసభ బరిలోకి తన తల్లి, శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మను దింపే ఆలోచనలో
ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా కాంగ్రెసు పార్టీని ఇరకాటంలోకి నెట్టే
ప్రయత్నం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెలాఖరున రాజ్యసభ ఎన్నికల
నోటిఫికేషన్ వెలువడుతుంది. వచ్చే నెల మూడో వారంలో ఎన్నికలు జరుగుతాయి. తమపై సాధ్యమైనంత త్వరగా వేటు వేసేలా స్పీకర్‌పై మరింత ఒత్తిడి పెంచడమే వారి
వ్యూహంగా కనిపిస్తోంది. తెలంగాణలోని ఆరు స్థానాలకు, కోవూరు స్థానానికి ఉప
ఎన్నికలు నిర్వహించినప్పుడు తమకు చెందిన 17 స్థానాలకు ఎన్నికలు జరిగేలా
చూడాలని కోరుతూ వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడా
రాశారు. ఏడు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తమపై అనర్హత
వేటు వేసేలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాన్ని రచించారని
విమర్శిస్తున్న వారు స్పీకర్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. రాష్ట్రంలోని 24
స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు వచ్చేలా చూడాలనేది వారి వ్యూహంగా
కనిపిస్తోంది. అందుకే మరింత దూకుడుగా వారు వ్యవహరించేందుకు
నిర్ణయించుకున్నారు. వైయస్సార్
కాంగ్రెసు పార్టీకి 17 మంది శాసనసభ్యుల మద్దతు ఉంది. అనర్హత వేటులో
స్పీకర్ జాప్యం చేస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలపై వైయస్ జగన్ దృష్టి
పెట్టినట్లు తెలుస్తోంది. పది మంది శాసనసభ్యులు రాజ్యసభ అభ్యర్థిని
ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఆ 17 మంది మద్దతుతో పాటు అవసరమైతే తెలంగాణ
రాష్ట్ర సమితి (తెరాస) మద్దతు కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
తెలంగాణపై కాంగ్రెసు మోసం చేస్తోంది కాబట్టే కాంగ్రెసును ఓడించడమే
లక్ష్యంగా తెరాస మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అలాగే,
వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానం ఉన్న మరి కొంత మంది కాంగ్రెసు శాసనసభ్యుల
మద్దతు కూడా కూడగట్టుకోవచ్చుననేది ఆలోచనగా చెబుతున్నారు
No comments:
Post a Comment