Sunday, 26 February 2012

రాయలసీమలో కరెంటు కష్టాలు

మార్చి నెల ప్రారంభానికి ముందే కరెంటు కష్టాలు మొదలయ్యాయి. దాదాపు నెల రోజుల నుంచి కరెంటు కోత లేక పోవడంతో ఊపీరి పీల్చుకున్న ప్రజలకు మళ్లీ ‘ఉక్కపోత’ మొదలైంది. రాష్ట్రంలోని ఆర్టీపీపీ, కెటిజిఎస్, ల్యాండ్‌కో, కాకతీయ థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు తగ్గిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 1100 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి లోటు ఏర్పడింది. దీంతో కోతలు మొదలైనట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు కరెంటు కోత విధిస్తున్నారు. ఇక  మున్సిపాలిటీల్లో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు విద్యుత్ కోత విధిస్తున్నారు.ఇక మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు కోత విధిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కేవలం వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఉన్నప్పుడు మాత్రమే కరెంటు వస్తోందని స్థానికులు చెబుతున్నారు. చీకటి పడితే తప్ప గ్రామీణ ప్రాంతాల్లో బల్బు వెలగడడం లేదు. ఇక రైతన్నలు కరెంట్ కోసం రాత్రి పూట జాగారం చేయాల్సి వస్తోంది.మరోవైపు వేసవి కాలం మరింత ముదిరితే మరిన్ని గంటలు కోత ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ వినియోగం ఎక్కువ కావడంతో అందుకు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కోత విధించాల్సిన అవసరం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విద్యుత్ కోత కారణంగా ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో కోత సమయం మరింత పెరిగితే ప్రజలు బాధలు వర్ణణాతీతం. త్వరలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇటు వంటి తరుణంలో విద్యుత్ కోత కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

No comments:

Post a Comment