Monday, 2 January 2012

ద్విచక్ర వాహనాలతో కాలేజీలకు వచ్చేవిద్యార్థులకు హెల్మెట్ తప్పనిసరి

మోటార్ సైకిల్ వేగంగా నడిపి ప్రాణాలు పోగొట్టుకుంటున్న విద్యార్థులకు ప్రాణరక్షణ కల్పించేందుకు అర్బన్ ఎస్పీ ప్రభాకర్‌రావు నడుం బిగించారు. ఇందులో భాగంగానే సోమవారం నుండి తిరుపతిలోని ఏ కాలేజీకి మోటార్ సైకిల్‌పై వెళ్లే విద్యార్థి అయినా హెల్మెట్ లేకుండా వెళితే వారిని అనుమతించరాదని కళాశాల యాజమాన్యాలకు పోలీసు శాఖ గట్టి హెచ్చరికలు చేసింది. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా విధిగా పిల్లలకు హెల్మెట్లు తీసివ్వాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించింది. ఈ నేపధ్యంలో అన్ని ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లకు, కరస్పాండెంట్లకు అర్బన్ ఎస్పీ ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ప్రభుత్వ కళాశాలలకు కూడా వీటిని వర్తింపజేసేందుకు రంగం సిద్ధం చేశారు. సంపన్నులు అయిన తల్లిదండ్రులు సొమ్ములున్నాయి కదా అని నగర రోడ్లకు ఉపయోగపడని అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మోటార్ సైకిళ్లను కొనిస్తున్నారు. పిల్లలను సంతృప్తి పరచడానికి తల్లిదండ్రులు చేస్తున్న ఈ తీరు చివరకు వారికి కడుపుకోత మిగుల్చుతున్నా అప్రమత్తమవుతున్న తల్లిదండ్రుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉందని మేధావులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో పోలీసులు చొరవ తీసుకుని హెల్మెట్ వాడకాన్ని నిబంధనగా విధించడం సంతోషదాయకమని వారంటున్నారు. ఇది కేవలం రెండురోజులకు పరిమితం కాకుండా శాశ్వతంగా అమలు చేయాల్సిన బాద్యత పోలీసులపై ఉందని అంటున్నారు. ఇందుకు తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు పోలీసులకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారంటున్నారు. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే వారి తల్లిదండ్రులు అయినా పాఠశాల యజమానులు అయినా ముందుగా వారిపై కేసులు నమోదు చేయించాలని సూచిస్తున్నారు

No comments:

Post a Comment