Monday, 2 January 2012

కర్నూలు జిల్లా ఉప ఎన్నికల అభ్యర్థులపై పార్టీల కసరత్తు!

 జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు నేపధ్యంలో ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆయా పార్టీల నాయకులు తమ వంతు ప్రయ త్నాలు ముమ్మరం చేశారు. ఇదే సమయంలో ఆయా పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డిపై అనర్హత వేటు వేసినా, రాజీనామా ఆమోదించినా ఉప ఎన్నికలు ఖాయం కావడంతో ఆ దిశగా రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఆళ్లగడ్డ బరిలో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున భూమా దంపతుల్లో ఒకరు పోటీ చేయడం ఖాయం కాగా తెలుగుదేశం తరపున ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఇరిగెల రామపుల్లారెడ్డి పేరును ఖరారు చేశారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు గంగుల సోదరులు సిద్ధపడుతున్నారు. గంగుల ప్రతాప రెడ్డి తనకు పార్లమెంటుకు పోటీ చేయడమే ఇష్టమని ఉప ఎన్నికల బరిలో తన సోదరుడు గంగుల ప్రభాకర రెడ్డి ఉంటారని తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు సమాచారం. అయితే పార్టీ రాష్ట్ర నాయకులు మాత్రం గంగుల ప్రతాప రెడ్డి బరిలోకి దిగి విజయం సాధించి వస్తే మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు అవకాశం ఉన్నట్లు సమాచారం అందించారని వార్తలు వస్తున్నాయి. ఇక ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి బరిలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టిడిపి తరపున మాజీ మంత్రి బివి మోహన రెడ్డి రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ తరపున రుద్రగౌడు పేరు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నా అభ్యర్థి పేరు ఖరారు చేసే సమయానికి మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. ఇక ఈ రెండు స్థానాలతో పాటు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై టిడిపి చేసిన ఫిర్యాదు మేరకు స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది. ఈ విషయంలో బాలపై వేటు ఖాయమని టిడిపి వర్గాలు ఆశతో ఉన్నా కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వేటు పడకపోవచ్చని పేర్కొంటున్నారు. దాంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఉప ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తున్న ఎమ్మిగనూరులో విజయం ఖాయమని టిడిపి ధీమాతో ఉండగా కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ స్థానంపై విశ్వాసంతో ఉంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆళ్లగడ్డపై ధీమాగా ఉన్నప్పటికీ ఎమ్మిగనూరు విషయంలో వారికి కొంత అనుమానం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయానికి అక్కడ ఉన్న లోపాలను సరిదిద్దుకొని బరిలోకి దిగితే విజయం వరిస్తుందన్న నమ్మకం కూడా ఉంది

No comments:

Post a Comment