
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఉప ఎన్నికలు
కీలకం కానున్నాయి. తన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని తేలడంతో తన
మద్దతుదారులను గెలిపించుకునేందుకు జగన్ ఇప్పటి నుంచే కసరత్తు చేపట్టినట్లు
సమాచారం. రాష్ట్రంలోని 25 నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలు ఒక ఎత్తయితే,
సొంత జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు జరుగనున్న ఎన్నికలు ఒక ఎత్తు అని
చెప్పాలి. జగన్‌కు అత్యంత సన్నిహితులైన ముగ్గురు ఎమ్మెల్యేలు మళ్లీ
పోటీచేస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు కడప జిల్లాపై దృష్టి సారించారు. పార్టీ
స్థాపించి ఏడాదికాక మునుపే రెండవసారి ఉప ఎన్నికల పోరుకు జగన్
సన్నద్ధమవుతున్నారు. కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో
పోటీచేసిన తల్లీకొడుకులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తిరిగి జిల్లాలోని
మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉప ఎన్నికల్లో
తన వర్గీయులను గెలిపించుకునేందుకు జగన్ సర్వశక్తులు ఒడ్డే అవకాశాలు
ఉన్నాయి. ఈ ఎన్నికల బాధ్యతలు కూడా వైఎస్ కుటుంబ సభ్యులు తీసుకోనున్నారు. ఈ
నేపథ్యంలో జగన్ ఈ నెల 26 నుంచి ఆ మూడు నియోజకవర్గాల్లో ఓదార్పు యాత్ర పేర
ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాలోని రాజంపేట, రాయచోటి,
రైల్వేకోడూరు శాసనసభ్యులు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, గడికోట
శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు జగన్ వెన్నంటే నిలిచారు. ముగ్గురు
ఎమ్మెల్యేలు జగన్ మాటకు కట్టుబడి అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి
అనుకూలంగా ఓటు వేశారు. వీరిపై అనర్హత వేటు రేపోమాపో పడనుంది. ఆ తరువాత
జరిగే ఉప ఎన్నికల్లో ఈ ముగ్గురు నేతలు ఆయా నియోజకవర్గాల నుండి వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీకి సిద్ధమవుతున్నారు. జిల్లాలోని మూడు
నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోకపోతే వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీకి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమేనని రాజకీయ పరిశీలకులు
భావిస్తున్నారు.
No comments:
Post a Comment